నవజీవన నెలవుగా నదీతీరం

ABN , First Publish Date - 2021-11-23T07:25:06+05:30 IST

యమునా నదీతీరాన్ని సబర్మతీ నదీతీరం వలే అభివృద్ధి పరచాలనే ప్రతిపాదన ఒకటి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సబర్మతి నదీతీరం అభివద్థి అహ్మదాబాద్ నగర ఉన్నతికి విశేష స్థాయిలో తోడ్పడింది...

నవజీవన నెలవుగా నదీతీరం

యమునా నదీతీరాన్ని సబర్మతీ నదీతీరం వలే అభివృద్ధి పరచాలనే ప్రతిపాదన ఒకటి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సబర్మతి నదీతీరం అభివద్థి అహ్మదాబాద్ నగర ఉన్నతికి విశేష స్థాయిలో తోడ్పడింది. రజకుల సౌకర్యార్థం దోబీఘాట్‌లు, వారాంత సంతలు మొదలైన వాటి నిర్వహణకు సబర్మతీ నదీతీర ప్రాంత అభివృద్ధిలో ప్రాధాన్యమిచ్చారు నిరాశ్రయులైన వారికి వేరే చోట నివేశన స్థలాల నిచ్చారు. నదీతలం వెడల్పును 382 మీటర్ల నుంచి 275 మీటర్లకు తగ్గించారు. తద్వారా పునరుద్ధరించిన భూమిలో 80 శాతానికి పైగా ప్రజా ప్రయోజనాలకు అందుబాటులో ఉంచారు. పునరుద్ధరించిన భూమిలో వనాలను అభివృద్ధిపరిచారు. సబర్మతి వాహిని అద్దరి, ఇద్దరి గట్లను తాకుతూ నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీతీరం అహ్మదాబాద్ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు, భూగర్భ జలాలనూ పెంపొందిస్తోంది. ఈ నదీ తీర అభివృద్ధి రీతిని సబర్మతీ నమూనాగా భావించవచ్చు. లండన్ మహానగరంలో థేమ్స్ నదీ తీరాన్ని అభివృద్ధిపరచడంలో ఇదే నమూనాను అనుసరించారు. అయితే ప్రపంచంలోని అనేక దేశాలు ఇటీవలి సంవత్సరాలలో తమ తమ నదీతీరాల అభివృద్ధికి ఒక భిన్న నమూనాను అనుసరించాయి. ఈ ప్రత్యామ్నాయ నమూనాలో నదీతలం వెడల్పును తగ్గించడానికి బదులుగా మరింతగా వెడల్పు చేశారు. విశాలమైన నది ఒడ్డున చెట్లను పెంచారు. ఆ నెలవును వన్య ప్రాణుల ఆవాసంగా చేశారు. ఫలితంగా నది గతంలో వలే ఒక సహజ ప్రవాహిని అయింది. 


సబర్మతి నమూనాలో నదీతీరాన పునరుద్ధరించిన భూమిపై గృహాలు, కార్యాలయాల నిర్మాణంతో ఆర్థిక పురోగతికి దోహదం జరిగింది. ప్రత్యామ్నాయ నమూనాలో నదీతీరంలో వనాలను అభివృద్ధిపరచి వాటిలో జింకలు, తాబేళ్లు మొదలైన వన్య ప్రాణుల నెలవుగా చేయడం జరిగింది. సబర్మతీ నమూనాలో విస్తరించిన నదీతీరంలో భూమి ధర అధికమవుతుంది. గల్లీలో ఉన్న ఇల్లు కంటే ఉద్యానవనం ఎదుట ఉన్న ఇల్లే ఎక్కువ ధర పలుకుతుంది కదా. భూమి ధరల పెరుగుదలతో దేశ జీడీపీ (స్థూల దేశియోత్పత్తి) కూడా అనివార్యంగా పెరుగుతుంది. ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, సాఫ్ట్‌వేర్ పార్క్‌లు మొదలైన సేవల రంగ సంస్థల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్న కారణంగా ప్రత్యామ్నాయ నమూనా సైతం భారత్‌కు ఒక ప్రత్యేక లబ్ధిని సమకూరుస్తుంది. హరితవనాలు, సహజగతిలో సాగుతున్న నది అలాంటి సేవా సంస్థలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కూరతో తక్కువ రోటీలు తినడం కంటే కూర లేకుండా ఎక్కువ రోటీలు తినడమే ఆరోగ్యప్రదం కదా. 


భారతీయ సంప్రదాయం నదులను ‘మాతృమూర్తి’గా గౌరవిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిని విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధిపరిచేందుకు సంకల్పించారు. గంగామాతే తనను వారణాసికి పిలిచిందని ఆయన పేర్కొన్నారు. గంగాజలాల మానసికశక్తులపై మోదీకి ప్రగాఢ గౌరవం ఉంది. యమునా నదికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రయాగరాజ్ (అలహాబాద్) వద్ద గంగ, యమునలు సంగమిస్తాయి. ఆ రెండు నదుల ప్రవాహాలు తీసుకువచ్చే మానసికశక్తులు అక్కడ పరస్పరం సమ్మిశ్రితమవుతాయి. జపనీస్ శాస్త్రవేత్త మసారు ఎమోటో స్వేదనం చేసిన నీరు ఉన్న ఒక బాటిల్‌పై ‘ప్రేమ’ అని రాసి ఉన్న లేబిల్‌ను అతికించాడు; మరో బాటిల్‌పై ‘ఆగ్రహం’అని రాసి ఉన్న లేబిల్‌ను అతికించాడు. 24 గంటల అనంతరం ఆ రెండు సీసాలను పరిశీలించగా ‘ప్రేమ’ అని లేబిల్ ఉన్న బాటిల్‌లోని నీటి అణువులు చాలా అందంగా కనిపించాయి; ‘ఆగ్రహం’ అని రాసి ఉన్న బాటిల్‌లోని నీటి అణువులు చాలా వికృతంగా కనిపించాయి. దీన్ని బట్టి నీటికి మానసిక తరంగాలను శోషింప చేసుకునే గుణం ఉందని అర్థమవుతుంది. 


యమునా జలాలు యుమునోత్రి మానసికశక్తిని తీసుకువస్తాయి. అయితే యమునానగర్‌కు ఎగువున హత్నికుంద్ బ్యారేజ్ వద్ద యమున జలాలు నిలిచిపోతాయి. పానిపట్, సోనిపేట్ మధ్య యమున దాదాపుగా ఎండిపోయి ఉంటుంది. కనుక హత్నికుంద్ వద్ద నిలిచిపోయిన యమునను విడుదల చేస్తే వాటిలోని యమునోత్రి మానసిక శక్తి ఢిల్లీ నగరానికి చేరి ఆ నగర ప్రజల మనోబలాన్ని పెంపొందింపచేస్తుంది. 


యమునా జలాలను వ్యవసాయానికి సరఫరా చేయడం వల్ల సమకూరే ఆర్థిక లబ్ధిని; ఢిల్లీలోని సాఫ్ట్‌వేర్ పార్క్‌లకు సరఫరా చేయడం వల్ల చేకూరే ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం మదింపు చేయాలి. నా అంచనా ఏమిటంటే వ్యవసాయానికి అందించే నిర్దిష్ట పరిమాణ యమునా జలాలనుంచి రూ.1000 ఆదాయం వస్తే, అదే పరిమాణంలో నీటిని సాఫ్ట్‌వేర్ పార్క్‌కు సరఫరా చేస్తే వచ్చే రాబడి రూ.1,00,000గా ఉంటుంది. హత్నికుంద్ నుంచి నీటిని విడుదల చేసినందుకు గాను, సాఫ్ట్‌వేర్ పార్క్‌ల నుంచి లభించే అదనపు ఆదాయం నుంచి హర్యానాకు ఢిల్లీ ప్రభుత్వం నష్ట పరిహారాన్ని చెల్లించాలి. తద్వారా హత్నికుంద్ నుంచి యమునా జలాలను విడుదల చేయడం వల్ల హర్యానా, ఢిల్లీ రెండూ లబ్ధి పొందుతాయి.


నదీతీరాలను అభివృద్ధిపరచడంలో సబర్మతి నమూనా, ప్రత్యామ్నాయ నమూనా లాభనష్టాలను దేశంలోని సమస్త నదీతీరాల విషయంలో నిష్పాక్షికంగా అంచనా వేయవలసిన అవసరముంది. నదీతలాన్ని విశాలం చేసినా లేక కుదించినా నదీ ప్రవాహాన్ని నిండుగా ఉంచడం సాధ్యమవుతుంది. రెండు నమూనాలలోనూ దోబీఘాట్లు, వారాంతపు సంతల నిర్వహణకు సదుపాయముంటుంది. భూగర్భ జలాలను పెంపొందించుకునే వెసులుబాటూ ఉంటుంది. పునరుద్ధరించిన భూమి విషయంలోనే రెండిటి మధ్య తేడా ఉంది. సబర్మతి నమూనాలో మరింత భూమి అందుబాటులోకి రావడంతో పాటు వ్యవసాయమూ విస్తరిస్తుంది. ప్రత్యామ్నాయ నమూనాలో భూమి విలువ పెరిగి ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, సాఫ్ట్‌వేర్ పార్క్‌లు మొదలైనవి విస్తరిస్తాయి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-11-23T07:25:06+05:30 IST