రేపటి నుంచి నవమి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-12T05:33:18+05:30 IST

రేపటి నుంచి నవమి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి నవమి బ్రహ్మోత్సవాలు
సిద్ధమైన ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు

21న సీతారామ కల్యాణం, 22న శ్రీరామ మహాపట్టాభిషేకం

కొవిడ్‌ మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహణ

భద్రాద్రిలో ఏర్పాట్లు పూర్తి

భద్రాచలం, ఏప్రిల్‌ 11: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మంగళవారం  వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13వ తేదీ నుంచి 27వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, మామిడి తోరణాలను ఇప్పటికే సిబ్బంది ఏర్పాటు చేశారు.  కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపఽథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం భద్రాద్రి రామాలయంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 21న శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని ఆలయ ప్రాంగణంలోని నిత్యకల్యాణ వేదిక వద్ద నిర్వహించనున్నారు. 22న మహాపట్టాభిషేకాన్ని సైతం అదేవేదికలో నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు ప్రత్యంక్షంగా వీక్షించే అవకాశం లేకపోవడంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు. 13న ఉగాది  సందర్భంగా ప్లవనామ సంవత్సరాది ఉగాది పండుగ, నూతన పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 17న మృత్సంగ్రహణం, వాస్తుహోమం, అంకురారోపణం, 18న ధ్వజపట లేఖనం, ఆవిష్కరణ, గరుడ ధ్వజాదివాసం, 19న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం, 20న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. 21న  శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం నిర్వహించనుండగా సాయంత్రం శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం,  22న శ్రీరామమహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే 23న సదస్యం, 24న తెప్పోత్సవం, చోరోత్సవం, 25న ఊంజల్‌ ఉత్సవం, 26న వసంతోత్సవం, 27న చక్రతీర్ధం, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. 


రేపటి నుంచి నిత్య కల్యాణాలకు బ్రేక్‌

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భద్రాద్రి రామాలయంలో మంగళవారం నుంచి 27వ తేదీ వరకు నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. 17నుంచి 27వరకు దర్బారు సేవలు నిలిపివేయనున్నారు. అలాగే 17 నుంచి మే 4వరకు పవళింపు సేవలను సైతం నిలిపివేస్తారు. 

చైత్రమాస ఉత్సవాలివే

భద్రాద్రిలో చైత్రమాసంలో నిర్వహించే ఉత్సవాలను దేవస్థానం వైదిక సిబ్బంది ఈవో బి.శివాజికి అందజేశారు. 13న ఫ్లవనామ ఉగాదిని పురస్కరించుకొని మూలవరులకు స్నపన తిరుమంజనం, ఉగాది ప్రసాద వితరణ, నూతన పంచాంగ శ్రవణం, వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల ప్రారంభం, 14న భగవత్‌ రామానుజ జయంతి ఉత్సవాలు ప్రారంభం, 17న నవమి ఉత్సవాలకు అంకురారోపణం, 18న భగవత్‌రామానుజాచార్య స్వామి తిరునక్షత్రం సందర్భంగా స్నపన తిరుమంజనం, 21న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకం,  మే 5న నూతన పర్యంకోత్సవం నిర్వహించనున్నారు. 

Updated Date - 2021-04-12T05:33:18+05:30 IST