సొంత ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిద్ధూ

ABN , First Publish Date - 2021-11-25T23:46:45+05:30 IST

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి

సొంత ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిద్ధూ

చండీగఢ్ : పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి తన సొంత పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే బహిర్గతం చేయకపోతే, తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని రెండు నెలల క్రితం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చెప్పారని గుర్తు చేశారు. కొన్ని ముఖ్యమైన నియామకాల విషయంలో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, సిద్ధూ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. 


సిద్ధూ గురువారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, నిర్బంధంగా వసూలు చేసిన రాష్ట్ర పన్నులను కేబుల్ టీవీ కంపెనీ ఫాస్ట్‌వే నుంచి తిరిగి రాబట్టడానికి ఓ చట్టాన్ని రూపొందించాలని తాను ప్రతిపాదించానని చెప్పారు. ఆ కంపెనీ కంప్యూటర్లను నియంత్రణలోకి తీసుకుని, ఆ కంపెనీ దాచిపెట్టిన డేటాను తెలుసుకుని ఆ పన్నులను రాబట్టడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ఫాస్ట్‌వే గుత్తాధిపత్యం నుంచి కేబుల్ ఆపరేటర్లకు విముక్తి కల్పించడానికి, రాష్ట్ర ఖజానా నిండటానికి తన ప్రతిపాదన దోహదపడుతుందని చెప్పారు. కానీ తన ప్రతిపాదనను కెప్టెన్ అమరీందర్ సింగ్ అడ్డుకున్నారన్నారు. 


Updated Date - 2021-11-25T23:46:45+05:30 IST