లఖింపూర్ ఖేరీకి పంజాబ్ కాంగ్రెస్ కవాతు : సిద్ధూ

ABN , First Publish Date - 2021-10-06T01:33:16+05:30 IST

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను బుధవారం నాటికి

లఖింపూర్ ఖేరీకి పంజాబ్ కాంగ్రెస్ కవాతు : సిద్ధూ

చండీగఢ్ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను బుధవారం నాటికి విడుదల చేయకపోతే పంజాబ్ కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి కవాతు చేస్తుందని ఆ పార్టీ నేత నవజోత్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు. రైతులను హత్య చేసినందుకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 


ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనను వ్యతిరేకిస్తూ ఆదివారం రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ఉత్తర ప్రదేశ్ వెళ్ళారు. ఆమెను సీతాపూర్ వద్ద పోలీసులు నిర్బంధించారు. ఆమెను నిర్బంధించడాన్ని కాంగ్రెస్ ఖండించింది. పోలీసు అధికారులు మంగళవారం స్పందిస్తూ, శాంతికి భంగం కలిగిస్తారనే ఆందోళనతో ప్రియాంకతోపాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


నవజోత్ సింగ్ సిద్ధూ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, రైతుల కిరాతక హత్య వెనుకగల కేంద్ర మంత్రి కుమారుడిని బుధవారం నాటికి అరెస్టు చేయకపోతే, రైతుల కోసం పోరాడుతూ, చట్ట విరుద్ధంగా అరెస్టయిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని విడుదల చేయకపోతే, పంజాబ్ కాంగ్రెస్ లఖింపూర్ ఖేరీకి కవాతు చేస్తుందని హెచ్చరించారు. 


రైతు నేతల కథనం ప్రకారం, ఉప ముఖ్యమంత్రి పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన రైతులపై నుంచి దూసుకెళ్ళిన కార్లలోని ఓ కారులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఆ సమయంలో సంఘటన స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నానని ఆశిష్ మంగళవారం మీడియాకు చెప్పారు. 


Updated Date - 2021-10-06T01:33:16+05:30 IST