ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో కన్నుల పండువగా దుర్గాష్టమి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-04T01:37:00+05:30 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దుర్గాష్టమి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో కన్నుల పండువగా దుర్గాష్టమి ఉత్సవాలు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో దుర్గాష్టమి సంబరాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండేళ్ళ విరామం తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాలకు 82 దేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సర్వమానవ సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం జరిగిన చండీ హోమంలో వేలాది మంది పాల్గొన్నారు. వందలాది మంది వేదపండితుల మంత్ర పఠనం మధ్య 108 రకాల పూలు, పళ్ళూ ఇతర హోమ ద్రవ్యాలు అర్పిస్తూ ఈ హోమం నిర్వహించారు. 700 మంత్రాలతో కూడిన దుర్గా శప్తశతిని పఠించడం ఈ హోమంలో జరిగే ముఖ్య క్రతువు. అమ్మవారిని స్తుతిస్తూ చెప్పే ప్రతీ శ్లోకంతో పాటుగా హోమ గుండంలో అర్పించే ద్రవ్యాలు చాలా ప్రత్యేకం. ఏనుగులు, ఆవులు లాంటి జంతుజాలం నుంచీ చెట్లూ చేమల దాకా అన్ని జీవరాశులలో భగవంతుని స్వరూపాన్ని గుర్తించడమే చండీ హోమం యొక్క ప్రత్యేకత. 

 

ప్రముఖ ఆధ్యాత్మిక నాయకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్  మాట్లాడుతూ "చండీ అంటే చాల శక్తిమంతమైనది అని అర్థం వస్తుందన్నారు. హోమ గుండంలో అర్పించే ప్రతీ మూలికకు ఒక ప్రత్యేక గుణం ఉందని, అది హోమగుండంలో వేసినప్పుడు వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని చెప్పారు. నవరాత్రి ఉత్సవాలు మాటల నుంచీ మౌనానికి, క్రియ నుంచీ జ్ఞానానికి, సంకుచిత తత్వాన్నుంచీ విశాల దృక్పథానికి చేసే ప్రయణమని తెలిపారు. నవరాత్రి సంబరాలు నిద్రాణమైన దైవిక శక్తిని జాగృత పరచడమేనని చెప్పారు. 

 

నవరాత్రి సందర్భంగా చేసే సాత్విక విందు ఈ ఉత్సవాలలో ఒక ప్రత్యేక ఆకర్షణ. లక్షన్నర మంది భక్తుల కోసం చేసే ఈ కార్యక్రమంలో 60 టన్నుల బియ్యం, 40 టన్నుల గోధుమ పిండి, 20 టన్నుల పప్పు దినుసులు, 40 వేల లీటర్ల నూనె, 10 టన్నుల ఉప్పు, 45 వేల లీటర్ల పాలు, 250 టన్నుల కూరగాయలు, పదివేల లీటర్ల పెరుగు వినియోగించారు. 




Updated Date - 2022-10-04T01:37:00+05:30 IST