విశేషాల నెలవు... హజ్‌

ABN , First Publish Date - 2022-07-01T08:58:28+05:30 IST

ఇస్లాం ధర్మానికి అయిదు మూల స్తంభాలు ఉన్నాయి. వాటిలో హజ్‌ యాత్ర ఒకటి. పవిత్రమైన మక్కా నగరానికి ముస్లింలు చేసే యాత్రను ‘హజ్‌’ అంటారు.

విశేషాల నెలవు... హజ్‌

ఇస్లాం ధర్మానికి అయిదు మూల స్తంభాలు ఉన్నాయి. వాటిలో హజ్‌ యాత్ర ఒకటి. పవిత్రమైన మక్కా నగరానికి ముస్లింలు చేసే యాత్రను ‘హజ్‌’ అంటారు. ముస్లింలలో ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒకసారైనా ఈ యాత్ర చేయాలన్నది నిర్దేశం. ఈ యాత్రలో చూడాల్సిన వివిధ ప్రదేశాలు, పాటించాల్సిన పలు నియమాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది కాబా సందర్శన.


‘కాబా’ అంటే ‘చతురస్రాకార  గృహం’ అని అర్థం. దీన్ని ‘బైతుల్‌ అతీఖ్‌’ అని కూడా అంటారు. ‘అత్యంత గౌరవప్రదమైన, అత్యంత ప్రాచీనమైన, స్వతంత్రమైన గృహం’ అని ఆ మాటలకు అర్థం. కాబా గృహం... హజ్‌, ఉమ్రా యాత్రలకు కేంద్రబిందువు. ముస్లింలు నమాజ్‌ (ప్రార్థన) కాబా దిశలోనే. దీన్ని ‘ఖిబ్లా’ అంటారు. పవిత్ర గ్రంథాల ప్రకారం... ఈ మసీదును అల్లాహ్‌ ఆజ్ఞ ప్రకారం... మొట్టమొదట దేవదూతలు నిర్మించారు. ఆ తరువాత తొలి మానవ ప్రవక్త ఆదమ్‌ అలైహిస్సలాం, అనంతరం ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయీల్‌ అలైహిస్సలామ్‌ నిర్మాణాలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద మసీద్‌ అయిన కాబా... సౌదీ అరేబియా దేశంలోని మక్కా నగరంలో  ఉంది. దీని ప్రస్తుత వైశాల్యం 3,56.800 చదరపు మీటర్లు. కాబా విస్తరణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హజ్‌ సమయంలో దీని లోపల, వెలుపల దాదాపు డెబ్భై లక్షలమంది నమాజ్‌ చేసే సౌకర్యం ఉంది. 


హజ్రుల్‌ అస్వద్‌...

‘హజ్రుల్‌’ అంటే రాయి. ‘అస్వద్‌’ అంటే నల్లనిది. ‘హజ్రుల్‌ అస్వద్‌’ అంటే ‘నల్లనిరాయి’ అని అర్థం. ఇది కాబా గృహం దక్షిణం-తూర్పుల మధ్య భాగంలోని గోడలోకి అమర్చి ఉంది. హజ్‌, ఉమ్రా చేసేవారు... కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ రాతిని ముద్దు పెట్టుకుంటారు. లేదా దాన్నివైపు చేతిని ఎత్తుతారు. కాబా గృహ ప్రదక్షిణం... హజ్రె అస్వద్‌ నుంచి ప్రారంభమవుతుంది.


జమ్‌ జమ్‌ బావి...

జమ్‌ జమ్‌ బావి లోతు 66 అడుగులు లేదా 20 మీటర్లు ఉంటుంది. దీనిలోని నీటి ఊట నాలుగు వేల ఏళ్ళ నుంచి ఎన్నడూ ఎండిపోలేదనీ, నీటి రుచి మారలేదనీ చెబుతారు. ఈ నీటిలో కాల్షియం, మెగ్నీషియం, లవణాలు, సహజమైన ఫ్లోరైడ్లు ఉన్నాయనీ, దీనికి రోగ క్రిమి నాశక లక్షణాలు, ఓషధీ గుణాలు ఉన్నాయనీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సఫా, మార్వా కొండలు, ఫిరా గుహ


ఈ రెండు కొండలు మక్కాలోని మస్జిద్‌ హరామ్‌లో ఉన్నాయి. ఇస్మాయీల్‌ అలైహిస్సలామ్‌ ఆకలితో ఏడుస్తూ ఉండగా... ఆయన తల్లి హాజిరా నీటి కోసం ఈ కొండల మధ్య పరుగు తీశారు. ఆ పరుగును ‘సయీ’ అంటారు. ‘సయీ’ అంటే అన్వేషించడం. హజ్‌, ఉమ్రాల సందర్భంగా ఈ కొండల మధ్య ఏడు సార్లు నడవడం విధి. ఈ కొండలు కాబాకు వంద మీటర్ల దూరంలో ఉన్నాయి. మక్కా నుంచి మీనా ప్రాంతానికి వెళ్ళే దారిలో ఫిరా  గుహ ఉంది ఇక్కడే పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరణ ప్రక్రియ ప్రారంభమయింది. 

మదీనా... మస్జీదే నబవీ


కాబాలో వీడ్కోలు ప్రదక్షిణ చేసిన తరువాత... మదీనాకు వెళ్ళాలి. మక్కా నగరానికి ఉత్తరంగా... దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉండే మదీనా... హిజాజ్‌ క్షేత్రంలో అంతర్భాగం. జనాభాపరంగా సౌదీ అరేబియాలో మూడో అతి పెద్ద నగరం. మక్కా తరువాత... ముస్లిం జగత్తుకు అత్యంత ప్రియమైన, శుభకరమైన నగరం. అల్లాహ్‌ అంతిమ సందేశాన్ని వ్యాప్తి చేసిన విశ్వ కారుణ్య మూర్తి మహమ్మద్‌ ముస్తాఫా నడయాడిన చోటిది. అలాగే ప్రవక్తగా తన కర్తవ్యాన్ని నెరవేర్చిన మహమ్మద్‌ శాశ్వతంగా విశ్రమిస్తున్న పవిత్ర స్థలం. కాగా మదీనా నగరం మధ్య ఎర్రని రాళ్ళతో కట్టిన మస్జీదే నబవీలో ఏకకాలంలో లక్షలాదిమంది నమాజ్‌ చేయవచ్చు.

గుంబదె ఖజ్రా (పచ్చని గుమ్మటం...)

హిజ్రీ శకం పదకొండో సంవత్సరం... రబీవుల్‌ అవ్వల్‌ మాసం... పన్నెండో రోజు... సోమవారం నాడు... మహా ప్రవక్త మహమ్మద్‌ తన సతీమణి హజ్రత్‌ అయిషా కుటీరంలో పరమపదించారు. ఆ స్థలంలోనే ఆయన పార్థివ శరీరాన్ని ఖననం చేశారు. అది మస్జిద్‌ ఆవరణలోనే ఉంది. మస్జిద్‌ నవబీ పక్కనే జన్నతుల్‌ బఖీ (శ్మశానవాటిక) ఉంది. అందులో ఎందరో మహాపురుషుల సమాధులు ఉన్నాయి. మదీనాలో ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన మసీదులు ఉన్నాయి. ఈ నగరంలోని ఖుర్‌ఆన్‌ ప్రింటింగ్‌ కాంప్లెక్స్‌లో... ప్రపంచంలోని యాభైకి పైగా భాషల్లో ఖుర్‌ఆన్‌ అనువాదాలు ముద్రితమై... ఉచితంగా పంపిణీ 

అవుతున్నాయి.

ఫ మహమ్మద్‌ వహీదుద్దీన్‌


కిస్వాహ్‌...

కాబా గృహాన్ని బూడిద-నీలం రంగు రాళ్ళతో కట్టారు. దీనికి తూర్పువైపున హిజ్రె అస్వద్‌ (నల్లరాయి) ఏర్పాటు చేసి ఉంది. దక్షిణంలో రుక్నె యమానీ (యమానీ కార్నర్‌) ఉన్నాయి. దీని గోడలు నాలుగూ తెరతో కప్పి ఉంటాయి. ఆ తెరను ‘కిస్వాహ్‌’ అంటారు. ఏడాదికి ఒకసారి... హజ్‌ సమయంలో ఈ వస్త్రాన్ని మారుస్తారు. ఈ నల్లని వస్త్రం మీద... అంతిమ పవిత్ర గ్రంథమైన దివ్య ఖుర్‌ఆన్‌లోని ప్రవచనాలను ఎంబ్రాయిడరీ చేస్తారు. సుమారు 47 అడుగుల ఎత్తు, 137 అడుగుల వెడల్పు ఉండే కిస్వా్‌హకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ వస్త్రం తయారీకి ప్రస్తుతం సుమారు రూ. 30 కోట్లు ఖర్చవుతోంది.

Updated Date - 2022-07-01T08:58:28+05:30 IST