నిజమైన విజేత

ABN , First Publish Date - 2022-07-01T10:03:42+05:30 IST

భిక్షువులకు లభించే గౌరవ, మర్యాదలు చూసి తను కూడా భిక్షువుగా మారాలనుకున్నాడు ఒక పేద రైతు. ‘అలాగైతే కష్టపడకుండా జీవించవచ్చు’ అనుకున్నాడు. మరుసటి రోజు ఒక ఆరామానికి వెళ్ళాడు.

నిజమైన  విజేత

భిక్షువులకు లభించే గౌరవ, మర్యాదలు చూసి తను కూడా భిక్షువుగా మారాలనుకున్నాడు ఒక పేద రైతు. ‘అలాగైతే కష్టపడకుండా జీవించవచ్చు’ అనుకున్నాడు. మరుసటి రోజు ఒక ఆరామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కాషాయ చీవరాలు ఇచ్చారు. చక్కగా స్నానం చేసి, వాటిని ధరించాడు. మట్టి కొట్టుకుపోయిన తన దుస్తుల్ని పారేయకుండా... ఆరామం బయట ఉన్న ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. 


మొదటి రెండు రోజులూ అక్కడి కొత్త వాతావరణం వల్ల అంతా బాగానే ఉందనుకున్నాడు. ఆ తరువాత చదువు, ధ్యాన శిక్షణ ప్రారంభమయ్యాయి. మౌనంగా ఏకాంతవాసం గడపవలసి వచ్చింది. చదువు ఎంతో భారంగా అనిపించింది. మౌనం మరింత కష్టమయింది. ఈ శిక్షణ కన్నా తాను గతంలో చేసిన చాకిరీ తేలికగా కనిపించింది. దాంతో అతను అక్కడ ఉండలేకపోయాడు. ఒక రోజు... ఎవరూ చూడకుండా ఆరామంలోంచి ఉడాయించాడు. తన పాత దుస్తులు దాచుకున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. తొర్రలో దాచిన పాత దుస్తులు తీసుకున్నాడు. వాటిని చూడగానే అతనికి తన గత జీవితం గుర్తుకువచ్చింది. ‘కష్టపడకుండా గౌరవం దక్కదు’ అనుకున్నాడు. వాటిని తొర్రలోనే ఉంచి, తిరిగి ఆరామానికి వచ్చేశాడు. ఇలా రెండు మూడుసార్లు జరిగింది. చివరకు ఏకాగ్రత 

సాధించాడు.


ఒక రోజు బుద్ధుడు తన భిక్షు సంఘంతో అచిరావతి నది ఒడ్డున... పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. భిక్షువుగా మారిన ఆ రైతు విషయం వారి మధ్య చర్చకు వచ్చింది. అదే సమయంలో... ఆ నదిలో దిగి వెళ్ళడం కోసం నలుగురు వ్యక్తులు వచ్చారు. అక్కడ దిగడానికి రేవు లేకపోవడంతో నదీ తీరంలోనే ఆగిపోయారు. ఎక్కడ దిగాలో ఆలోచిస్తూ... అటూ ఇటూ తిరుగుతున్నారు. 


అప్పుడు బుద్ధుడు... ‘‘భిక్షువులారా! నీటిలో దిగడానికి వాళ్ళు భయపడుతున్నారు. నీటిలో దిగేవారికి సహజంగా నాలుగు భయాలు ఉంటాయి. ఒకటి: అలల భయం. రెండోది: మకర భయం. మూడోది: సుడిగుండాల భయం. నాలుగోది: ప్రమాదకరమైన చేపల భయం. అలాగే గృహస్తుగా జీవిస్తూ, భిక్షు జీవనంలోకి మారే వ్యక్తికి కూడా అలాంటి నాలుగు భయాలు ఉంటాయి. భిక్షువు కొత్తగా బౌద్ధ సంఘంలోకి వచ్చినప్పుడు శిక్షకుడు చెప్పినట్టు వినాలి. ‘నేను నిన్నటిదాకా ఒకరికి చెప్పేవాణ్ణి. ఈ రోజు వీరు చెప్పినట్టు వినాల్సి వస్తోంది. పైగా వీరిలో కొందరు నాకన్నా చిన్నవారు కూడా ఉన్నారు’ అని ఆలోచించి, వెనుతిరగాలని చూస్తాడు. ఇది ‘తరంగ భయం’. అల మనిషిని నెట్టి, పడగొట్టినట్టు ఈ భయం ఆ భిక్షువును పడగొడుతుంది. అలాగే ‘నేను గృహస్తుగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చిన పదార్థాలు తినేవాణ్ణి. కానీ ఆరామంలో తినే సమయం, తినే పదార్థాలు నిర్దుష్టంగా ఉంటాయి. మూతికి చిక్కాలు కట్టినట్టు ఉంది’ అని భావించి, వెనక్కు వెళ్ళిపోవాలనుకుంటాడు. దీన్ని ‘మకర (మొసళ్ళ) భయం’ అనవచ్చు. మొసలి లాగి ముంచేసినట్టు... ‘రుచి’ అనే రస తృష్ణ లాగేస్తుంది. అలాగే... ‘గత జీవితంలో నా సుఖాలకు కావలసిన రీతిలో ఇల్లు, గదులు, మంచాలు, ఇతర విలాస వస్తువులు ఉండేవి. ఇక్కడ వాటికి తావు లేదు’ అని వెనుతిరుగుతారు. ‘భిక్షు జీవితం త్యాగమయం’ అని ఆలోచించరు. ఇది ‘సుడిగుండాల భయం’ లాంటిది. అది పైకి లేవకుండా ముంచేస్తుంది. ఈ సుఖ వ్యామోహం కూడా అలాగే ముంచుతుంది. ఇక నాలుగో భయం... కామ, వ్యామోహ భయం. అందమైన స్త్రీలను చూసినప్పుడు మనస్సు చలిస్తుంది. తిరిగి వెనుకటి జీవితానికి మరలుతాడు. ఇది భయంకరమైన కత్తుల్లాంటి కోరలు ఉండే చేపల వల్ల కలిగే భయం లాంటిది. ఈ వ్యామోహం... చేపలు నమిలి మింగినట్టు మింగేస్తుంది. భిక్షువుగా మారిన ఆ రైతు ఈ నాలుగు భయాలనూ జయించాడు. అతడు నిర్భయుడు. అతడే నిజమైన విజేత’’ అన్నాడు బుద్ధుడు.

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2022-07-01T10:03:42+05:30 IST