జ్ఞాన భాస్కరుడు

ABN , First Publish Date - 2022-05-06T05:03:39+05:30 IST

‘సాక్షాత్తూ పరమేశ్వరుడే వేదమత పునరుద్ధరణ కోసం వ్యాసుడి తరువాత... శంకరుడిగా అవతరించాడు. ఆయనే ఆదిశంకరుడు.

జ్ఞాన భాస్కరుడు

నేడు శ్రీ శంకర జయంతి


‘‘సాక్షాత్తూ పరమేశ్వరుడే వేదమత పునరుద్ధరణ కోసం వ్యాసుడి తరువాత... శంకరుడిగా అవతరించాడు. ఆయనే ఆదిశంకరుడు. వ్యాసుడు నారాయణ స్వరూపుడైతే, ఆది శంకరుడు ఈశ్వర స్వరూపుడు. మానవ జాతికి ఒక చిరంతనమైన సేవ చేయదలచి, ప్రపంచంలోని కష్టాలనూ, దుఃఖాన్నీ ప్రతిఘటించడానికి సత్యం, జ్ఞానాలకన్నా వేరే  మార్గం లేదని భావించి... ప్రాపంచిక బాధా నివారకాలైన ఉపదేశాలను అందించారు’’ అన్నారు కంచి మహాస్వామి.


కేరళలోని కాలడి గ్రామంలో శివగురు, ఆర్యాంబ దంపతులకు... ఎనిమిదేళ్ళ ఆయుర్దాయంతో జన్మించిన శ్రీ శంకరులు... అయిదేళ్ళ వయసులో ఆపత్సన్యాసాన్ని స్వీకరించారు. సద్గురువు కోసం పరివ్రాజకుడిగా సంచరిస్తూ, నర్మదా నదీ తీరాన శ్రీ గోవింద భగవత్పాదాచార్యులను దర్శించి, సేవించారు. ‘శ్రీ శంకర భగవత్పాదాచార్యులు’ అనే యోగ పట్టాన్ని పొందారు. గురువుల ఆదేశానుసారం కాశీ క్షేత్రంలో శ్రీ విశ్వనాథుణ్ణి సందర్శించగా... ఆ స్వామి అనుగ్రహంతో వేదవ్యాసుల దర్శనం లభించింది. శ్రీ గోవింద భగవత్పాదుల కటాక్షంతో ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం రెండింతలు కాగా... శ్రీ శంకరుల పాండిత్యాన్ని వ్యాసుడు ప్రశంసించి, మరో పదహారేళ్ళ ఆయుష్షును అనుగ్రహించాడు. తాను రచించిన ప్రస్థానత్రయానికి (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యాలు రాయాలనీ, వైదిక మతోద్ధారణ కోసం, సనాతన సంస్కృతి పరివ్యాప్తి కోసం దేశ సంచారం చేయాలనీ, ప్రజల్లో చైతన్యం కలిగించాలనీ ఆదేశించాడు.  శాఖోపశాఖలుగా చీలిపోయి, అస్తవ్యస్తంగా ఉన్న వైదిక మతాన్ని శ్రీశంకరులు ఒక్క తాటిపైకి తెచ్చారు. 


కార్యదీక్షాపరుడు: శ్రీ శంకరుల కాలంలో రాజులు బౌద్ధ, జైన మతాలను స్వీకరించి, వాటి వ్యాప్తికి కృషి చేయడంతో... వైదిక మతం అంతరించే ప్రమాదంలో పడింది. అలాంటి పరిస్థితుల్లో తన బహుముఖ ప్రజ్ఞతో... హిందూ మత శాఖలలోని ఛాందసత్వాన్ని నిర్మూలించారు. వైదిక మతం ఔన్నత్యాన్ని నిలబెట్టి... ‘షణ్ముఖ స్థాపనాచార్యుని’గా వినుతికెక్కారు. ఆ మత మార్గాల్లోని సాత్వికతను వెలికి తీసి, వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా తమ దేవతలను ఆరాధించడానికి వీలుగా... ‘పంచాయతన పూజ’ను ఏర్పాటు చేశారు. దేశంలో ఆలయ వ్యవస్థను కట్టుదిట్టం చేసి, పూజావిధానాలను నిర్దేశించారు. నేడు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ ఆలయాలు వైభవోపేతంగా అలరారుతున్నాయంటే... అది శ్రీశంకరుల కృషి ఫలితమే. 


మానవతామూర్తి: భిక్షకు వెళ్ళిన సమయంలో... ఒక పేద గృహిణి దీనావస్థను గమనించి, తన భిక్షాపాత్రలో వేసిన ఉసిరికాయను గ్రహించి... శ్రీ మహాలక్ష్మిని ‘కనకధారాస్తవం’తో శ్రీశంకరులు ప్రార్థించారు. ఆ ఇంట దారిద్ర్యాన్ని రూపుమాపారు. పూర్ణానదికి వెళ్ళాలనుకున్న తన తల్లి ఎండలకు తాళలేకపోవడంతో... ఆ నదినే తన ఇంటి ముంగిట ప్రవహింపజేశారు. తన దేశ సంచార కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలను ప్రదర్శించారు. ఆపత్సన్యాసం స్వీకరించడానికి తనను అనుమతించిన తల్లికి... ఆమె తలుచుకున్న వెంటనే వస్తాననీ, అవసాన సమయంలో కొడుకుగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తాననీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఆమె కోరిక మేరకు .అచ్యుతాష్టకా’న్ని వినిపించారు. సన్న్యాసివంటూ స్థానికులు వారించినా లెక్కచేయకుండా... అంత్యక్రియలను స్వయంగా జరిపి... మాతృఋణం తీర్చుకున్నారు. 


శాస్త్రీయ దృక్పథం: వైదికమతం వర్థిల్లడానికి, అద్వైత సిద్ధాంతం బహుళ ప్రాచుర్యం పొందడానికి దేశం నలుదిక్కులా చతురామ్నాయాలను శ్రీశంకరులు నెలకొల్పారు. వాటికి తన ప్రప్రథమ శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు. కంచిలో స్వయంగా నెలకొల్పిన కామాక్షీ పీఠాన్ని అధిరోహించి, ఏకామ్రేశ్వర, కామాక్షీ దేవిలను ఆరాధించి, వ్యాస మునీంద్రుల అభీష్టాన్ని నెరవేర్చారు. ఆ సమయంలో వ్యాసుడికి ప్రముఖ శిష్యుడైన గౌడపాదాచార్యులు సాక్షాత్కరించి ‘‘శంకరా! నీ అవతార కార్యం పరిసమాప్తమయింది. ఇక నీవు శివ దర్శనం చేసుకొని, కైవల్యం పొందే సమయం ఆసన్నమయింది’’ అని ఆశీర్వదించి, అంతర్హితుడయ్యారు. తన గురువుకు గురువైన గౌడపాదునికి ప్రణామం చేసి... కేదార్‌నాథ్‌ వైపు పయనం సాగించారు శ్రీ ఆదిశంకరులు. ఆయనకు ముందే వేదాలలో, ఉపనిషత్తుల్లో అద్వైత సిద్ధాంతం ఉన్నా... వాటికి ప్రాచుర్యం తీసుకువచ్చారు. ఆయనది పిడివాదం కాదు... శాస్త్రీయ దృక్పథం. తార్కికతతో, మేధాశక్తితో... ప్రస్థాన త్రయానికి భాష్యాలు, ఉపనిషత్తులను ప్రజలు అవగాహన చేసుకోవడానికి ప్రామాణికమైన ప్రకరణ గ్రంథాలు, తాను దర్శించిన దేవీ దేవతలపై స్తోత్రాలు రచించారు. శివానందలహరి, సౌందర్యలహరి, వివేక చూడామణి తదితర రచనలతో ఆధ్యాత్మిక వాఙ్మయాన్ని పరిపుష్ఠం చేసిన జ్ఞానభాస్కరుడు శ్రీశంకరులు.

Read more