నేరస్థుల పాలనలో నలుగుతున్న నవ్యాంధ్ర

ABN , First Publish Date - 2021-05-06T06:01:09+05:30 IST

ప్రజాస్వామ్యమనే అమృత ఫల వృక్షాన్ని నేర రాజకీయమనే పురుగు పట్టి తినేస్తోంది. దాదాపు రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ కుట్రల చిట్టా...

నేరస్థుల పాలనలో నలుగుతున్న నవ్యాంధ్ర

ప్రజాస్వామ్యమనే అమృత ఫల వృక్షాన్ని నేర రాజకీయమనే పురుగు పట్టి తినేస్తోంది. దాదాపు రూ.43 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ కుట్రల చిట్టా ఎంత పెద్దదో సీబీఐ వెలువరించిన 11 చార్జిషీట్లను పరిశీలిస్తే తెలుస్తుంది. రాష్ట్రాన్ని దోచిన నేరస్థుడు జైల్లో నుంచి బయటికి రావడమే ఒక వింత అయితే వచ్చి రాజ్యమేలడం మరొక వింత. ఒక ఉద్యోగి వెయ్యి రూపాయల అవినీతికి పాల్పడితే అది ఋజువయ్యే వరకు సాక్ష్యాలు తారుమారు చేస్తారని సస్పెండ్ చేస్తారు. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల ప్రజాధనం దోపిడి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ సాక్ష్యాలు తారు మారు చెయ్యరా? జగన్‌పై వున్న అవినీతి కేసులు ఋజువు అయ్యే వరకు ఎందుకు ఆ పదవినుండి ఆయనను ఎందుకు పక్కన పెట్టకూడదు. అవినీతి కేసులలో సీబీఐ 11 చార్జిషీట్లు వేసి ప్రతి చార్జిషీటులోనూ జగన్‍ని ఏ1 ముద్దాయిగా చేర్చింది. పదహారు నెలలపాటు జైలులో వుంచింది. సీబీఐ కేసుల నుంచి తనను కాపాడితే 2014 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీతో చేయి కలుపుతానని డీల్ కుదుర్చుకోవడంతో జగన్‍కి నిబంధనలతో కూడిన బెయిల్ దొరికింది. బెయిల్ పైన బయటికి వచ్చినప్పటి నుంచీ జగన్ బెయిల్ నిబంధనలన్నిటినీ వందశాతం ఉల్లంఘించారనేది జగమెరిగిన సత్యం. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు వర్తించడం లేదు? 


జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన కేసులలో సహ నిందితులకు అత్యున్నత పదవులు, పదోన్నతులు కల్పించడమే కాకుండా, గతంలో క్విడ్ ప్రొ కో అభియోగాలున్న పారిశ్రామికవేత్తలు, ఆ కంపెనీలకే మళ్లీ ఇప్పుడు భూములు, పోర్టుల కేటాయింపు చేస్తున్నారు. వారిని ప్రభావితం చేయటం ద్వారా తన కేసులను నిర్వీర్యం చేయడమే సింగిల్ పాయింట్ ఎజెండాగా పెట్టుకున్నారు. అత్యున్నత పదవులు, పదోన్నతులు పొందిన అధికారులు పొందిన మేళ్లకు ప్రత్యుపకారంగా జగన్ కేసులలో సాక్షులను బెదిరించడం, ఆయా శాఖలలో రికార్డులను తారుమారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. పదే పదే వాయిదాలకు ఎగ్గొడుతూ, కుంటి సాకులతో కోర్టుల కళ్లు గప్పి కేసుల విచారణ వేగవంతం కానివ్వకుండా అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఈ దిశగా జగన్ ఆధ్వర్యంలో ఒక పెద్ద యంత్రాంగమే పనిచేస్తోంది. ఆయా కేసులలో ప్రధాన నిందితులే ఆ యంత్రాంగంలో ప్రధాన సూత్ర దారులు. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో కీలక స్థానాల్లోని కొందరు అధికారులు కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. జగన్ వాయిదాకు వెళ్లాల్సిన రోజునే ఏదో ఒక పథకం ప్రారంభానికి పెట్టుకోవడం, ముందస్తు కేలండర్ పేరుతో షెడ్యూల్ రూపొందించడం, దాని కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు కపట లేఖలు రాయడం ఆ యంత్రాంగం పని. ఇలా రెండేళ్లుగా కోర్టుల కళ్ళకు గంతలు కడుతున్నారు. అవినీతిపరుల పట్ల సింహస్వప్నం కావాల్సిన సీబీఐ వంటి వ్యవస్థలు కాగితం పులులుగా మారబట్టే జగన్ వంటి ఆర్థిక నేరస్థుల ఆటలు ఇలా కొనసాగుతున్నాయి.


ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఏప్రిల్ 08, 2013న నమోదైన 5వ ఛార్జిషీట్, 5ఏ ఛార్జిషీట్లలో ఏ5 ముద్దాయిగా వున్న శ్రీలక్ష్మిని తన ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి కార్యదర్శిగా నియమించి, యుద్ధ ప్రాతిపదికన ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు జగన్. అదే కేసుకు సంబంధించి అవే ఛార్జిషీట్లలో ఏ7 ముద్దాయి (దివంగత) సజ్జల దివాకర్ రెడ్డి సోదరుడు సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. మీడియా వ్యవహారాలకే పరిమితం కావాల్సిన వ్యక్తికి శాంతిభద్రతలతో సహా అన్నికీలక శాఖల నిర్ణయాలను ప్రభావితం చేసే పెత్తనం కట్టబెట్టారు. ఆగస్టు 13, 2012న నమోదైన 4వ ఛార్జిషీట్‍లో ఏ4 ముద్దాయి అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావును రాజ్యసభ సభ్యులుగా నియమించారు. అందులోనే ఏ8గా ఉన్న మరో ముద్దాయి ఎం. శామ్యూల్‌కు (ఈయన 10వ ఛార్జిషీట్‍లో ఏ10 కూడా) ప్రభుత్వ సలహాదారు బాధ్యతలను అప్పగించటమేగాక, నవరత్నాల అమలు కమిటీకి వైస్ ఛైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. 10వ ఛార్జిషీట్‍లో ఏ12 అయిన ముద్దాయి మురళీధర్ రెడ్డిని జిల్లా కలెక్టరుగా, రాష్ట్ర ప్రభుత్వ కీలక వ్యవహారాల్లో ప్రధాన వ్యక్తిగా నియమించారు.


మే 07, 2012న నమోదైన 3వ ఛార్జిషీట్‍లో ఏ4 ముద్దాయి అయిన పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డిని కూడా రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. సెప్టెంబర్ 09, 2014న నమోదైన 11వ ఛార్జిషీట్‍లో ఏ6 ముద్దాయి వై.వి. సుబ్బారెడ్డిని (జగన్ బాబాయి) తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించారు. ఆగస్టు 13, 2012న నమోదైన సిబిఐ 4వ ఛార్జిషీట్‌లో ఏ3 ముద్దాయి, ఇంకా సెప్టెంబర్ 17, 2013లో నమోదైన 9వ ఛార్జిషీట్‌లో 11వ ముద్దాయి నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో అరెస్ట్ చేస్తే అతడిని విడిపించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తన 28మంది ఎంపిలను విదేశాంగ మంత్రి జైశంకర్ వద్దకు పంపి భారీఎత్తున లాబీయింగ్ జరపడం దేశమంతా చూసింది. మొత్తం అన్ని కేసులలో రెండవ ముద్దాయి, తనతోపాటు 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి పోస్టులతో సహా ఏకంగా 5పదవులు కట్టబెట్టడం కొసమెరుపు. వీటిని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి బైటపడేయడమే జగన్మోహన్ రెడ్డి అతనికిచ్చిన ఏకైక టాస్క్. జగన్ సీబీఐ ఛార్జిషీట్‍లు అన్నింటిలోనూ ఏ3 ముద్దాయి అరబిందో సంస్థ. జగన్ బినామీ విజయసాయి రెడ్డి కాగా, విజయ సాయిరెడ్డి బినామీ అల్లుడు అరబిందో రోహిత్ రెడ్డి. ఆశ్రిత పక్షపాతంతోనే అంబులెన్సుల కొనుగోళ్ల కాంట్రాక్టును కూడా విజయసాయి రెడ్డి అల్లుడు డైరెక్టర్‌గా ఉన్న అరబిందో కంపెనీ పరం చేసారు. 


మార్చి 31, 2012న నమోదైన తొలి ఛార్జిషీట్‍లో ఏ3గా ఉన్న అరబిందో ఫార్మాకు కాకినాడ సెజ్ ధారాదత్తం చేశారు. సెజ్‌లో 51% వాటాను రూ.2,511కోట్లకు కొనుగోలు చేయించి బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు పేరుతో తీర ప్రాంతాన్ని కబ్జా చేయాలని పథకం పన్నారు. రూ.5వేల కోట్ల విలువైన కోన భూములను బినామీల పరం చేశారు. ఏ4గా ఉన్న హెటిరో ఫార్మాకు విశాఖపట్నంలో వందల కోట్ల విలువ చేసే బేపార్కును కట్టబెట్టారు. రూ.225కోట్ల విలువైన 9ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. గతంలో జరిగిన క్విడ్ ప్రో కో 1.0లో తండ్రి హయాంలో జడ్చర్ల సెజ్‌లో 75ఎకరాల భూములు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో రూ.19.50కోట్లు పెట్టుబడి పెట్టారని సీబీఐ తొలి ఛార్జ్ షీటులో పేర్కొంది. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ల్యాబ్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ లిమిటెడ్‌పై, హెటిరో డైరెక్టర్ ఎం.శ్రీనివాస రెడ్డిపై ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి కాగానే మళ్లీ విశాఖలో వందల కోట్ల విలువైన బేపార్కు భూములను హెటిరో పరం చేయడం క్విడ్ ప్రో కో 2.0లో భాగమే. జగన్ కేసులలో కె.నిత్యానంద రెడ్డి ఏ7 కాగా, ఎం. శ్రీనివాస రెడ్డి ఏ6, శరత్ చంద్రారెడ్డి ఏ8 ముద్దాయిలుగా ఉన్నారు. జగన్‌పై ఆరవ ఛార్జి షీటులలో మరో కీలక ముద్దాయి జగతి పబ్లికేషన్సుకు గత రెండేళ్ళుగా ప్రతిరోజూ పెద్దఎత్తున ప్రభుత్వ ప్రకటనలు గుప్పిస్తూ వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. 


జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తం అతనికి సాగిలపడటాన్ని, అధికారం అండతో జగన్ రాష్ట్రంలోని పౌర హక్కులు, ప్రాథమిక హక్కులను కాలరాయడాన్ని, రాజ్యాంగానికి తూట్లు పొడవడాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. తనను జైలుకు పంపారన్న అక్కసుతో జగన్ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏవిధంగా కక్ష సాధిస్తున్నారో గత రెండేళ్ళుగా చూస్తూనే ఉన్నాం. తాను జైలుకు వెళ్లాను కాబట్టి అందరినీ జైలుకు పంపి తనకూ ఇతరులకూ తేడా లేదన్న భావన ప్రజల్లో కలిగించడమే లక్ష్యంగా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. చివరకు న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా నిందలు వేసి వదిలిపెట్టకుండా ఏవిధంగా వేధింపులకు, అవమానాలకు గురిచేశారో చూశాం. ఇలా కోర్టుల పట్ల, జడ్జీల పట్ల అగౌరవంగా, అవమానకరంగా ప్రవర్తించే ముద్దాయిని ఎవరూ ఎక్కడా చూసి ఉండరు. ఏకంగా జడ్జిలపైనే విషం కక్కుతూ కేంద్రానికి, రాష్ట్రపతికే లేఖ రాయడం బెయిల్ కండిషన్ల ఉల్లంఘనకు పరాకాష్ట. ఈ విచ్చలవిడి పోకడలకు అడ్డుకట్ట వేసి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను కాపాడాల్సింది అత్యున్నత న్యాయస్థానాలే. ఇప్పటికైనా జైళ్ళలో మగ్గాల్సిన వాళ్ళను చట్టసభలకు నెగ్గే వీలు లేకుండా పదునైన చట్టం చెయ్యడానికి పార్లమెంట్ సిద్ధపడాలి. 

యనమల రామకృష్ణుడు

ప్రతిపక్ష నాయకులు, ఏపీ శాసన మండలి

టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు

Updated Date - 2021-05-06T06:01:09+05:30 IST