నయవంచక నిత్య పెళ్లికొడుకు

ABN , First Publish Date - 2022-07-14T08:52:07+05:30 IST

ఓ నయవంచక నిత్య పెళ్లికొడుకు బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకుని, రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోని సైట్లలో ప్రకటనలు ఇచ్చిన యువతులే లక్ష్యంగా వల వేసి..

నయవంచక నిత్య పెళ్లికొడుకు

  • మ్యాట్రిమోనిలో ప్రకటనలే టార్గెట్‌.. 
  • విడాకులు తీసుకున్న యువతులే లక్ష్యం


పంజాగుట్ట, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఓ నయవంచక నిత్య పెళ్లికొడుకు బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విడాకులు తీసుకుని, రెండో పెళ్లి కోసం మ్యాట్రిమోని సైట్లలో ప్రకటనలు ఇచ్చిన యువతులే లక్ష్యంగా వల వేసి.. పెళ్లిళ్లు చేసుకుని.. వారి నుంచి డబ్బులు వసూలు చేసే గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన అడపా శివశంకర్‌ బాబు గుట్టును అతని చేతిలో మోసపోయిన ఇద్దరు యువతులు రట్టు చేశారు. బుధవారం  విలేకరుల సమావేశంలో బాధిత యువతులు వివరాలను వెల్లడించారు. శివశంకర్‌కు 2018లోనే పెళ్లయిందని, ఈ విషయాన్ని దాచిన శివశంకర్‌.. మ్యాట్రిమోని సైట్లలో తాను నెలకు లక్షల రూపాయలు సంపాదించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పరిచయం చేసుకుంటాడన్నారు. విడాకులు తీసుకుని, అందంగా ఉండే యువతులను ఎంచుకుంటాడన్నారు. ఇలా కొండాపూర్‌లో తమతోపాటు.. మరో యువతితో కాపురాలు పెట్టాడని చెప్పారు. తమ దగ్గర వేర్వేరుగా రూ. 25 లక్షల చొప్పున నగదు, రూ.7 లక్షలు విలువ చేసే బంగారం తీసుకున్నాడని వాపోయారు. 


ఆ డబ్బుల కోసం మే 16న రామచంద్రాపురం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని, అప్పుడు ష్యూరిటీగా తన పక్కన కూర్చున్న యువతిని తీసుకువచ్చాడని ఓ బాధితురాలు చెప్పారు. అప్పుడే.. అతనికి రెండు పెళ్లిళ్లయ్యాయని తెలిసిందని.. ఆ తర్వాత నిఘా పెడితే.. తమ కాలనీలోనే మరో అమ్మాయితో కాపురం పెట్టాడని తేలిందన్నారు. నైట్‌డ్యైటీ, డేడ్యూటీ, క్లైంట్‌ మీటింగ్‌ పేరుతో మూడు ఇళ్లలో కాపురం చేసేవాడని, నిజానికి అతను ఏ ఉద్యోగం చేయడని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు ఇతని బాధితులు ఆరుగురు ఉన్నట్లు తేలిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు కేసును తేలిగ్గా తీసుకుంటున్నారని, దీంతో.. శివశంకర్‌ తనకు ఏపీకి చెందిన ఓ మంత్రి, ఓ జాతీయ పార్టీ నేత పరిచయాలున్నాయని చెబుతూ భయపెడుతుంటాడని ఆందోళన వ్యక్తం చేశారు. శివశంకర్‌ తన తల్లిదండ్రులిద్దరూ కొవిడ్‌తో చనిపోయాడని చెప్పి.. తమ వద్ద డబ్బులు వసూలు చేశాడని, గుంటూరులోనూ ప్రభుత్వం నుంచి పరిహారం పొందాడని ఆరోపించారు. అతనిపై కేపీహెచ్‌బీ, రామచంద్రపురం, గచ్చిబౌలి, మాదాపూర్‌, బాలానగర్‌, ఎల్బీనగర్‌, ఏపీలోని గుంటూరు, అనంతపురం, మంగళగిరి తదితర పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నాయన్నారు.

Updated Date - 2022-07-14T08:52:07+05:30 IST