నయాజ్‌ నయా స్కెచ

ABN , First Publish Date - 2022-05-29T06:02:30+05:30 IST

చిరుద్యోగంలో వచ్చే జీతం సరిపోలేదో లేక భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ భారీ స్కెచ వేశాడు.

నయాజ్‌ నయా స్కెచ

రైతులకు ఆర్‌ లోచర్ల విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ టోకరా

సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో రూ.8 లక్షలు వసూలు

  రొద్దం, మే 28: చిరుద్యోగంలో వచ్చే జీతం సరిపోలేదో లేక భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలన్న అత్యాశతో విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ భారీ స్కెచ వేశాడు. రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు ఇప్పిస్తానంటూ పక్కాగా మోసం చేసి ఏకంగా రూ.8లక్షలు వసూలు చేశాడు. ఇలా ఒక్కో రైతు నుంచి రూ.50 వేలు చొప్పున పది మంది నుంచి రూ.5 లక్షలు, మరో రూ.3లక్షలు అధిక వడ్డీ ఆశ చూపి వసూలు చేశాడు ఆర్‌.లోచర్ల ఆర్బీకే విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నయాజ్‌. 

  రొద్దం మండలం ఆర్‌.లోచర్ల గ్రామంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేస్తున్న నయాజ్‌ ఆర్‌ఎల్‌ కొత్తూరు గ్రామంలో ముగ్గురు రైతులు, రాగిమేకలపల్లిలో ఒకరు, ఆర్‌ లోచర్లలో ఆరుగురు రైతులతో రూ.50 వేలు చొప్పున సబ్సిడీ ట్రాక్టర్లు ఇప్పిస్తానని స్వాహా చేసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే వడ్డీతో చెల్లిస్తానని మరో ముగ్గురు రైతులతో రూ.లక్ష చొప్పున రూ.3లక్షలు వసూలు చేశాడన్న ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రెండు రోజుల క్రితం ఆర్బీకే కేంద్రం నుంచి 141 బ్యాగుల సబ్సిడీ విత్తన వేరుశనగ కర్ణాటక ప్రాంతానికి తరలించి స్వాహా చేయడంపై వ్యవసాయాధికారులు విచారణ చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆర్బీకే కేంద్రంలో ఎరువులు, పప్పుశనగ విత్తనాలు, పక్కదారి పట్టించి రూ.2.5 లక్షలు స్వాహా జరిగినా సంబంధిత వ్యవసాయాధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సబ్సిడీతో ట్రాక్టర్లు ఒక్కోటి రూ.8లక్షలు విలువతో ఆర్బీకే కేంద్రం ద్వారా రూ.4లక్షలు సబ్సిడీపోను మిగిలిన రూ.4లక్షలు చెల్లించాలని, అడ్వాన్సగా రూ.50వేలు చొప్పున పది  మంది రైతులతో తీసుకుని ఒకరికొకరికి తెలియకుండా రూ.5లక్షలు వీఏఏ స్వాహా చేసిన విషయం బయట పడింది. ఈ విషయంపై శనివారం ఆర్‌ఎల్‌ కొత్తూరు గ్రామానికి చెందిన వడ్డె శ్రీనివాసులు, సబ్సిడీ ట్రాక్టర్‌ కోసం రూ.50వేలు నయాజ్‌కు ఇచ్చానని, బూచర్లలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు ఫిర్యాదు చేశాడు. పది మందిదాకా మోసపోయామని తమకు న్యాయం చేయాలని నయాజ్‌ రాసి ఇచ్చిన కాగితాన్ని శ్రీనివాసులు ఎమ్మెల్యేకు చూపించారు.


వీఏఏపై క్రిమినల్‌ కేసు నమోదు 

ఆర్‌.లోచర్ల ఆర్బీకే కేంద్రం నుంచి 141 ప్యాకెట్ల సబ్సిడీ విత్తన వేరుశనగ పక్కదారి పట్టించిన వీఏఏ న యాజ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. పెనుకొండ వ్యవసాయశాఖ ఏడీఏ స్వయంప్రభ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే రిమాండ్‌కు పంపుతామన్నారు. అదేవిధంగా వీఏఏ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 



Updated Date - 2022-05-29T06:02:30+05:30 IST