సినిమా రివ్యూ: ‘న‌యీం డైరీస్’

Published: Fri, 10 Dec 2021 16:28:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ: న‌యీం డైరీస్

మూవీ పేరు: న‌యీం డైరీస్
విడుదల తేదీ: 10, డిశంబర్ 2021
బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్
తారాగాణం: వశిష్ట సింహ, యజ్ఞా శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్
సంగీతం: అరుణ్ ప్రభాకర్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
నిర్మాత: సీఏ వరదరాజు
రచన-దర్శకత్వం: దాము బాలాజీ

నేర చ‌రిత్ర‌లో న‌యీమ్ కంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ పేజీలో తెలియని విషయం చాలా ఉందని, అదేమిటో చెప్పేందుకు ‘న‌యీం డైరీస్’‌ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ద‌ర్శ‌కుడు దాము బాలాజీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. సంచలన దర్శకుడు వర్మ చేయాలనుకున్న చిత్రమిదని కూడా ఆయన తెలిపారు. ‘కెజియ‌ఫ్’, ‘నార‌ప్ప’ వంటి చిత్రాల‌తో విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకున్న వ‌శిష్ట సింహను ప్రధాన పాత్రకు తీసుకుని, ఎన్ని బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా.. ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శకుడు చెప్పడంతో.. సహజంగానే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అలాగే విడుద‌ల‌కు ముందే చుట్టుముట్టిన వివాదాలు కూడా ఈ సినిమాని వార్తలో ఉండేలా చేశాయి. మ‌రి అన్నింటిని ఎదుర్కొని నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
భువ‌న‌గిరిలోని ఒక సాధార‌ణ కుటుంబానికి చెందిన న‌యీమ్‌‌కు చిన్న‌త‌నం నుండే కుటుంబం ప‌ట్ల బాధ్య‌త‌.. ఏదైనా స‌రే గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల ఉంటాయి. అక్క(యజ్ఞా శెట్టి)ని ఎవ‌రు ఏమ‌న్నా వారిని వ‌దిలిపెట్ట‌డు. అత‌ని ధైర్య సాహాసాలు చూసి మావోలు అతనిని న‌క్స‌లిజంలోకి తీసుకెళ్తారు. అక్క‌డ ఎదిగిన న‌యీం ఒక ఐజీ హత్య‌లో కీల‌క పాత్ర‌ను పోషించి హీరో అవుతాడు. జైల్లో న‌క్స‌ల్స్ ట్రైన‌ర్‌గా మార‌తాడు. జైలు అత‌ణ్ని మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకెళుతుంది. అయితే జైల్లో న‌క్స‌లిజంలోని ద్వంద నీతి న‌యీమ్‌ని ఎదురుతిరిగేలా చేస్తుంది. అక్కపై చేయి వేసిన మాజీ న‌క్స‌ల్‌ని చంప‌డం న‌యీం జీవితాన్ని మార్చివేస్తుంది. అప్పటి నుండి నక్సల్స్ పై అసహ్యం పెంచుకున్న నయిమ్‌ని పోలీసులు తమ ఇన్‌ఫార్మర్‌గా మార్చుకుని నక్సల్స్‌ని మట్టు పెట్టడం చేస్తుంటారు. ఇలా పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారి పోలీస్ శాఖలో ప‌వ‌ర్ పుల్ ప‌ర్స‌న్‌గా ఎదిగిన తర్వాత నయిమ్‌ జీవితం అనేక మ‌లుపులు తిరుగుతుంది. ఆ మలుపులు ఏంటి? న‌యీమ్ క‌థ ముగియ‌డానికి కార‌ణం ఎవ‌రు..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

న‌యీమ్ పాత్రకి వ‌శిష్ట సింహనే ఎందుకు దర్శకుడు తీసుకున్నాడనేది సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. త‌న పాత్ర‌కు వ‌శిష్ట సింహ వంద‌శాతం న్యాయం చేశాడు. అత‌ని వాయిస్‌తో న‌యీం క్యారెక్ట‌ర్‌కి ఇమేజ్ పెంచాడు. న‌యీం పాత్ర‌లోని భావోద్వేగాల‌ను చాలా బాగా ప‌లికించాడు. నటుడిగా తనకు ఏ పాత్ర అయినా ఇవ్వవచ్చు అనిపించేలా మెప్పించాడు. బిగ్‌బాస్ ఫేమ్ దివి ఉన్నంతలో చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించింది. వీరితో పాటు ఈ సినిమాలో నటించిన ప్ర‌తి పాత్ర‌కు ప్రాముఖ్యత ఉండేలా రియలిస్టిక్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాని మ‌లిచాడు. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి. డైలాగ్స్ కూడా క్లాప్స్ కొట్టిస్తాయి.  

గ్యాంగ్‌స్ట‌ర్ కథ అంటేనే భిన్న కోణాలుంటాయి. ఒక క్రిమిన‌ల్ కథని ప్రేక్ష‌కుల‌కు తెలియజేసే విషయంలో ద‌ర్శ‌కుడు దాము బాలాజీ ఈ విష‌యంలోనూ రాజీ ప‌డ‌లేదనిపిస్తోంది. ఎవరికీ భయపడకుండా న‌యీమ్ కథ ఇదని చెప్పిన తీరుకు అతనిని అభినందించాల్సిందే. మరొకరైతే ఈ చిత్రాన్ని కమర్షియల్ కోణంలో చూస్తూ.. వాస్తవాలు పక్కన పెట్టేవారేమో కానీ.. దాము బాలాజీ మాత్రం ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాడనేది న‌యీమ్ గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. తాను తెలుసుకున్న నిజాల‌ను చెప్ప‌డానికి ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌లేదు. దీంతో న‌యీం డైరీస్ చూసిన ప్రేక్ష‌కుల‌కు ఇంత‌కు ముందు న‌యీమ్ పై ఉన్న కోపం పోదు కానీ కాస్త త‌గ్గుతుంది అన‌డంలో సందేహాం లేదు. ఏ గ్యాంగ్‌స్ట‌ర్ జీవితమైనా సమాజంలోని వ్యక్తుల వల్లే ప్రభావితమై ఉంటుందని చెప్పిన తీరు అందరినీ ఆలోచింపజేస్తుంది. రెండు విరుద్ద‌మైన వ్య‌వ‌స్థ‌ల‌లో హీరోగా ఎదిగిన న‌యీమ్ జీవితం మాత్రం ఎప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ఉంటుంది. అయితే ముల్లుని ముల్లుతోనే తీయాల‌నే సూత్రం పాటించి, అతనిని పెంచిన పోలీసులే.. న‌యీమ్ సంఘ విద్రోహ శ‌క్తిగా మారేందుకు కూడా స‌హాక‌రించారు అని దాము బెదరకుండా ధైర్యంగా చెప్పాడు. సినిమాటిక్‌గా కథనం విషయంలో కాస్త తడబడినప్పటికీ ఓవరాల్‌గా న‌యీమ్ గురించి తెలుసుకున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఇందులో విశదీకరించాడు దర్శకుడు.

బెల్లీ ల‌లిత ప్ర‌జా గాయ‌ని ఎపిసోడ్‌, మావోయిస్టు అగ్రనేతలు వీరన్న, రవన్న, సోమన్న, మోహన్‌రెడ్డి, సాగరన్న, గణేష్‌, సాంబా శివుడి పాత్రలను, వారితో నయీంకి ఉన్న అనుబంధాన్ని, ఆ తర్వాత ద్వేషాన్ని, ఆ తర్వాత వారిని పక్కా స్కెచ్‌తో ఎన్‌కౌంటర్‌ చేయడం వంటివి రియలిస్టిక్‌గా ఉన్నాయి. పోలీసులు నయీమ్‌ని తమ ఇన్‌ఫార్మర్‌గా మలుచుకుని అడవులలోని మావోలను మట్టు పెట్టడం, ఆ తర్వాత నయీంకి స్వేచ్చ ఇచ్చి వ్యాపారాలు చేయించడం, దందాలు, కబ్జాలు, దోచుకోవడాలు, సెటిల్మెంట్లు ఇలా అన్నింటిని టచ్‌ చేశాడు దర్శకుడు. నయీం మాజీ నక్సలైట్‌ నుంచి రౌడీషీటర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడానికి దోహదపడిన ప్రతి అంశాన్ని బోల్డ్‌గా ఆవిష్కరించాడు. అతనిని అడ్డుపెట్టుకుని ఎవరెవరు ఎలా ఎదిగారు అనే విషయాలతో పాటు.. ఎలా అతనిని మట్టుపెట్టారనే విషయాలను కూడా చాలా క్లారిటీగా తెరరూపమిచ్చాడు. ఓవరాల్‌గా బాధ్యత కలిగిన ఒక యువకుడిని సమాజం ఎలా మార్చింది? అనేదే నయిమ్ డైరీస్.

ట్యాగ్‌లైన్: రియలిస్టిక్ అటెంఫ్ట్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International