ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉపాధిహామీ రికవరీలపై నజర్‌

ABN , First Publish Date - 2022-05-01T04:11:08+05:30 IST

ఉపాధిహామీ అక్రమాలపై నిగ్గుతేల్చాలని కేంద్రం ఆదేశించడంతో జిల్లా అధికారులు ఉరుకులు, పరుగుల మీద రికవరీ శాతాన్ని పెంచేందుకు లెక్కలతో కుస్తీ పడుతున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉపాధిహామీ రికవరీలపై నజర్‌

-కేంద్రం ఆదేశాలతో లెక్కలతో కుస్తీ

-రెండురోజుల్లోగా తేల్చాలని ఆదేశాలు

-నాలుగేళ్లలో రూ.60లక్షలకుపైగా దుర్వినియోగమైనట్టు నిర్ధారణ

-ఇప్పటికే రూ.55లక్షలు రికవరీ చేశామంటున్న అధికారులు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఉపాధిహామీ అక్రమాలపై నిగ్గుతేల్చాలని కేంద్రం ఆదేశించడంతో జిల్లా అధికారులు ఉరుకులు, పరుగుల మీద రికవరీ శాతాన్ని పెంచేందుకు లెక్కలతో కుస్తీ పడుతున్నారు. రెండురోజుల్లోగా పూర్తిస్థాయి రికవరీ గణాంకాలతో సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో గడిచిన నాలుగేళ్ల అంకెలతో అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో గడిచిన నాలుగేళ్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలని ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లుగా వివిధ సందర్భాల్లో జరిగిన సోషల్‌ ఆడిట్‌లో గుర్తించిన అక్రమాలకు సంబంధించిన రికవరీలు మందకొడిగా సాగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రస్తుతం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. జిల్లాకు సంబంఽధించి 2016నుంచి 2021నాటికి మొత్తం ఎంత మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయి..? సోషల్‌ ఆడిట్‌లో చేసింది ఎంత.? ఇప్పటివరకు ఎంత రివకరీ చేయాల్సి ఉంది? అధికారులు సంజాయిషీ ఎంటనేదానిపై కేంద్రం రెండు రోజుల్లో నివేదికలను కోరినట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో ఇప్పటివరకు మొత్తం రూ.60,73,973 దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఇందులో రూ.55,88,000 రికవరీ చేశామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మొత్తాన్ని రికవరీ చేయడం కోసం నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబు తున్నారు. ఉపాధిహామీలో జరిగిన అక్రమాల్లో దుర్విని యోగం అయిన మొత్తాన్ని రికవరీ చేయడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రోజు వారిగా రివకరీలకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇందులో క్షేత్రస్థాయి ఫీల్డు అసిస్టెంట్ల అక్రమాలకు సంబంధించి సాలరీలో కోత, రికవరీల శాతమే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రెండు, మూడు నెలల్లో మిగితా మొత్తాన్ని కూడా రికవరీ చేసి వందశాతం లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యచరణ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆచరణలో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని వాటిని అధిగమించేందుకు శాఖ పరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమాలకు సంబంధించి నిర్ధేశిత గడువులోగా తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కేంద్ర కోరడంతో అధికారులపై ఒత్తిడి స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన  సామజిక తనిఖీల్లో గుర్తించిన అక్రమాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాజిక తనిఖీలు జరుగాల్సిన పనులకు సంబంధించి ఇంకా ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  2020లో కొవిడ్‌ కారణంగా కేవలం ఆరు మండలాల్లో మాత్రమే సామాజిక తనిఖీ పూర్తి చేశారు. ఇందులో చింతలమానేపల్లి, కెరమెరి, కౌటాల, దహెగాం, లింగాపూర్‌, పెంచికల్‌పేట మండలాలుండగా వాంకిడి, ఆసిఫాబాద్‌, రెబ్బెన కాగజ్‌నగర్‌ సిర్పూరు(టి), సిర్పూరు(యూ), బెజ్జూరు, తిర్యాణి మండలాలకు సంబంధించి సామాజిక తనిఖీ పెండింగ్‌లో పడింది. వీటికి సంబంధించి ఇటీవల సామాజిక తనిఖీలు నిర్వహించారు. 2021-22కు సంబంఽధించి ఆసిఫాబాద్‌, బెజ్జూరు,జైనూరు, కాగజ్‌నగర్‌, లింగాపూర్‌, సిర్పూరు(టి), సిర్పూరు(యూ) వాంకిడి మండలాల్లో సామాజిక తనిఖీల ప్రక్రియ జరిగాక, మిగితా మండలాల్లో ఇంకా జరగాల్సి ఉంది. ఇందులో సోషల్‌ ఆడిట్‌కు సంబంధించిన వివరాలు కూడా అందాల్సి ఉంది.

సోషల్‌ ఆడిట్‌ జాప్యంతోనే..

నిబంధనల ప్రకారం సోషల్‌ ఆడిట్‌ అనేది పనులు జరిగిన ఆరు నెలల్లోపు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా 8నెలలు, సంవత్సర కాలం మేర చేస్తుండటం వల్ల అప్పటికే చేసిన పనులు నామ రూపాలు లేకుండా పోతున్నాయి.ఈ పరిస్థితుల్లో సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నా యని చెబుతున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో మేట్లు, చేసే పొరపాట్లు, బినామీ పేర్లపై సృష్టించిన జాబ్‌ కార్డులు వంటి కారణంగా కూడా సోషల్‌ ఆడిట్‌లో వాస్తవికంగా జరిగిన పనులు కూడా అక్రమాలుగా నమోదు అవుతున్నాయని గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది చెబుతున్నారు. వీటన్నీంటికి సోషల్‌ ఆడిట్‌ నిర్ణీత కాల వ్యవధి లోపు పూర్తి చేయక పోవడమే కారణమన్న ఆరోపణలున్నాయి.

ఎప్పటికప్పుడు రివకరీ చేస్తున్నాం

-కృష్ణమూర్తి, రివకరీ అధికారి 

సోషల్‌ ఆడిట్‌లో గుర్తించిన ఉపాధి హామీ అక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పగడ్బందీగా రికవరీ చర్యలు చేపడుతున్నాం. టైంఫ్రేం ప్రకారం రివకరీలను సాధించేం దుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో నాలుగేళ్ల కాలానికి సంబంధించి 90శాతానికి పైగా రివకరీ చేశాం. మిగితా మొత్తాన్ని కూడా త్వరలోనే పూర్తిచేసి వంద శాతం లక్ష్యాన్ని చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం.

Updated Date - 2022-05-01T04:11:08+05:30 IST