డిపాజిటర్లకు నజరానా

ABN , First Publish Date - 2022-08-18T12:04:01+05:30 IST

పండగ సీజన్‌లో పెరగనున్న రుణ డిమాండ్‌కు అనుగుణంగా నిధులు సమీకరించేందుకు బ్యాంక్‌లు ప్రత్యేక డిపాజిట్‌ పథకాల ద్వారా ఆకర్షణీయ రిటర్నులను..

డిపాజిటర్లకు నజరానా

ఎఫ్‌డీలపై ఆకర్షణీయ వడ్డీరేట్లు

రుణవృద్ధి అంచనాకు దీటుగా నిధుల వేట


న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో పెరగనున్న రుణ డిమాండ్‌కు అనుగుణంగా నిధులు సమీకరించేందుకు బ్యాంక్‌లు ప్రత్యేక డిపాజిట్‌ పథకాల ద్వారా ఆకర్షణీయ రిటర్నులను ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. 75 ఏళ్ల స్వాతంత్ర్యోత్సవాల సందర్భంగా ‘ఉత్సవ్‌ డిపాజిట్‌ స్కీమ్‌’ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన ఈ పథకం.. 75 రోజుల పాటు (అక్టోబరు 30 వరకు) అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌ ద్వారా 1000 రోజుల కాలపరిమితితో కూడిన రిటైల్‌ (రూ.2 కోట్లలోపు) డిపాజిట్‌పై ఎస్‌బీఐ 6.10 శాతం వార్షిక వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకైతే 6.60 శాతం వార్షిక వడ్డీ చెల్లించనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. అంతేకాదు, గతవారంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన ఎఫ్‌డీలపై వడ్డీని 0.15 శాతం వరకు పెంచింది.


బరోడా తిరంగా: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా బరోడా తిరంగా డిపాజిట్‌ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు అమలులో ఉండే ఈ పథకం ద్వారా బ్యాంక్‌ రెండు కాలపరిమితులతో కూడిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లను అందుబాటులోకి తెచ్చింది. 444 రోజుల కాలపరిమితి డిపాజిట్‌పై 5.75 శాతం, 555 రోజుల టర్మ్‌ డిపాజిట్‌పై 6 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు బీఓబీ తెలిపింది.  సీనియర్‌ సిటిజన్లకు 0.5 శాతం అదనపు వడ్డీ ఆఫర్‌ చేస్తోంది.


ప్రభుత్వ రంగానికే చెందిన కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కూడా ప్రత్యేక డిపాజిట్లను ప్రవేశపెట్టాయి. 666 రోజుల టర్మ్‌ డిపాజిట్‌పై కెనరా బ్యాంక్‌ 6 శాతం వార్షిక వడ్డీ ఆఫర్‌ చేస్తుండగా.. 1,111 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ పథకంపై 5.75 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు పీఎన్‌బీ వెల్లడించింది. 


ప్రైవేటు బ్యాంకులదీ అదే బాట

 నిధుల వేటలో భాగంగా ప్రైవేట్‌ బ్యాంక్‌లు సైతం కాస్త అధిక వడ్డీ చెల్లించేందుకు సిద్ధమయ్యాయి. దేశీయ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌.. 5-10 ఏళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. కాగా, 17-18 నెలల డిపాజిట్‌పై 6.05 శాతం వడ్డీ చెల్లించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అంతేకాదు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కూడా ఎఫ్‌డీ రేట్లు పెంచేశాయి. 


ఆర్‌బీఐ విధానమే ఆలంబనగా...

ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) గత మూడు సమీక్షల్లో రెపో రేట్లను 1.40 శాతం పెంచింది. దాంతో రెపో రేటు ప్రీ-కొవిడ్‌ స్థాయిని మించి 5.40 శాతానికి చేరుకుంది. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంక్‌లు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను కూడా పెంచాయి. దాంతో డిపాజిట్లపై ఆఫర్‌ చేసే వడ్డీని సైతం పెంచేందుకు బ్యాంక్‌లకు వెసులుబాటు లభించింది. తక్కువ వడ్డీ రుణాల డిమాండ్‌ను పెంచగా.. ఎఫ్‌డీలు మాత్రం ఆకర్షణ కోల్పోయాయి. ఈ ఏడాది జూలై 29 నాటికి బ్యాంక్‌ల మొత్తం డిపాజిట్ల వృద్ధి 9.1 శాతానికి పరిమితమైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి డిపాజిట్ల వృద్ధి 14.5 శాతంగా నమోదైంది. 

Updated Date - 2022-08-18T12:04:01+05:30 IST