కొత్త ఐటీ రూల్స్‌పై ఎన్‌బీఏ పిటిషన్... కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు...

ABN , First Publish Date - 2021-07-09T18:39:24+05:30 IST

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను సవాల్ చేసిన న్యూస్

కొత్త ఐటీ రూల్స్‌పై ఎన్‌బీఏ పిటిషన్... కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు...

తిరువనంతపురం : కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను సవాల్ చేసిన న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)కు అనుకూలంగా కేరళ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌బీఏలో భాగంగా ఉన్న వార్తా సంస్థలకు వ్యతిరేకంగా ఈ రూల్స్ ప్రకారం ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. 


ఈ కొత్త ఐటీ రూల్స్ వల్ల మీడియా హక్కులపై అసమంజసంగా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వాధికారులకు మితిమీరిన అధికారాలు లభిస్తాయని ఎన్‌బీఏ పిటిషన్‌లో ఆరోపించింది. ఎన్‌బీఏ తరపున సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ, ఐటీ రూల్స్, 2021 తన మాతృ చట్టానికి అతీతంగా, అధికార పరిధికి మించి ఉన్నట్లు తెలిపారు. ఈ రూల్స్ ప్రకారం ప్రభుత్వం చేపట్టదగిన చర్యలకు ఐటీ యాక్ట్ ప్రకారం అనుమతి లేదని పేర్కొన్నారు. మూడు అంచెల పర్యవేక్షక యంత్రాంగం ఏర్పాటుకు అవకాశం కల్పించడాన్ని కూడా ప్రశ్నించారు. న్యాయాధికారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రభుత్వ నిర్బంధ చర్యల నుంచి రక్షణ కల్పిస్తూ డిజిటల్ మీడియా సంస్థలకు అనుకూలంగా గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 


ఇదిలావుండగా, సామాన్యులను సాధికారులను చేయడానికే ఐటీ రూల్స్, 2021ని అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారత దేశంలో నివసించే గ్రీవియెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్‌ను నియమించాలని ఈ రూల్స్ చెప్తున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ తమ యూజర్ల సమస్యల పరిష్కారానికి మూడు అంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్తున్నాయి. యూజర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ఈ నిబంధనలు దోహదపడతారని ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2021-07-09T18:39:24+05:30 IST