ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలో అర్ధంతరంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్న డ్రగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలైంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాఖలు చేసిన ఈ చార్జ్ షీట్లో 33మంది పేర్లను నిందితులుగా చేర్చినట్లు సమాచారం. ఈ 33మందిలో సుశాంత్ మాజీ ప్రేయసి, మోడల్ రియా చక్రవర్తి కూడా ఉంది. అలాగే 200మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను కూడా దీనిలో పొందుపరిచారు. ‘‘12వేల పేజీలను హార్డ్ కాపీలుగా, డిజిటల్ ఫార్మాట్లో 50వేల పేజీలను కోర్టుకు సబ్మిట్ చేశాం’’ అని ఎన్సీబీ వెల్లడించింది. దేశం మొత్తం సంచలనం రేపిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుతో బాలీవుడ్లో డ్రగ్ మాఫియా బయటపడిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్ ముఠాతో సంబంధం ఉన్నట్లు భావించిన చాలా మందిని అధికారులు విచారించారు కూడా.