Aryan Khan Drugs Case : ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్

ABN , First Publish Date - 2022-05-27T20:06:06+05:30 IST

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు

Aryan Khan Drugs Case : ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) క్లీన్ చిట్ ఇచ్చింది. డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని శుక్రవారం తెలిపింది. గత సంవత్సరం అక్టోబరు 2న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ దొరికినట్లు ఆరోపిస్తూ, 14 మందిపై దాదాపు 6,000 పేజీల ఛార్జిషీటును దాఖలు చేసింది. 


ముంబైలో కొర్డెలియా యాట్‌పై గత ఏడాది అక్టోబరు 2న నిర్వహించిన దాడులకు సంబంధించిన కేసులో 14 మందిని నిందితులుగా ఎన్‌సీబీ శుక్రవారం దాఖలు చేసిన ఛార్జిషీటులో పేర్కొంది. ఈ ఛార్జిషీటులో నిందితుల జాబితాలో ఆర్యన్ ఖాన్‌ పేరు లేదు. ఆర్యన్ ఖాన్, మోహక్ మినహా మిగిలిన నిందితులందరి వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని ఎన్‌సీబీ అధికారి సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. 


ఇదిలావుండగా, ఈ నౌకపై దాడులు చేసిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే తాజా పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పారు. దీనిపై తాను వ్యాఖ్యానించాలని అనుకోవడం లేదన్నారు. 








Narcotics Control Bureau ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తులో ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు కనిపించలేదని ఈ ఏడాది మార్చిలో వార్తలు వచ్చాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు భారీ కుట్ర, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌తో సంబంధాలు వంటి ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు దొరకలేదని అప్పట్లో కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. 


సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఈ సిట్ ఈ కేసులో దర్యాప్తును కొనసాగించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని గుర్తించింది. ఎన్‌సీబీ విడుదల చేసిన ఓ ప్రకటనలో, ‘‘సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు చేసింది. సందేహాలకు అతీతంగా రుజువు కావాలనే సిద్ధాంతం గీటురాయిని వర్తింపజేశాం. సిట్ నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా, NDPS (మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల) చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం 14 మందిపై ఫిర్యాదు (ఛార్జిషీటు)ను దాఖలు చేశాం. మిగిలిన ఆరుగురిపైనా తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల వారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం లేదు’’ అని పేర్కొంది. 


Updated Date - 2022-05-27T20:06:06+05:30 IST