Sameer Wankhede సోదరి యాస్మీన్ వాంఖడే సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2021-10-28T13:33:20+05:30 IST

ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై యూనిట్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది...

Sameer Wankhede సోదరి యాస్మీన్ వాంఖడే సంచలన ఆరోపణలు

మంత్రి నవాబ్ మాలిక్ నన్ను బెదిరిస్తున్నాడు...జాతీయ మహిళా కమిషన్‌ కు ఫిర్యాదు 

ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబై యూనిట్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది.ఇప్పుడు నవాబ్ మాలిక్ తనను ఆన్‌లైన్‌లో వెంబడిస్తూ, బెదిరిస్తున్నాడని  ఎన్సీబీ అధికారి సోదరి యాస్మీన్ వాంఖడే సంచలన ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు నమోదు చేయాలని యాస్మీన్ వాంఖడే జాతీయ మహిళా కమిషన్‌ను అభ్యర్థించింది.


‘‘ఇటీవల పాలక రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ నా సోదరుడిని నిజాయితీగా విధులు నిర్వహించకుండా నిరోధించడానికి నాపై, నా కుటుంబ సభ్యులపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. నవాబ్ మాలిక్ నన్ను, నా కుటుంబ సభ్యుల పరువు తీయడానికి ప్రయత్నించి ఆన్‌లైన్‌లో నన్ను వెంబడించడం, నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మొదలైన వాటి నుంచి నా వ్యక్తిగత ఫోటోలను చట్టవిరుద్ధంగా తీసుకునే స్థాయికి చేరుకున్నాడు.నా వ్యక్తిగత ఫోటోలను మీడియాలో లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడు. నవాబ్ మాలిక్ నేరానికి పాల్పడటమే కాకుండా నా గోప్యతను ఉల్లంఘించినందుకు కూడా బాధ్యత వహించాలి’’ అని యాస్మీన్ వాంఖడే జాతీయ మహిళా కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొంది.


నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపడుతున్న దర్యాప్తును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో నిందితుడు నవాబ్ మాలిక్ మమ్మల్ని నేరుగా బెదిరింపులకు గురిచేస్తున్నాడని యాస్మీన్ లేఖలో పేర్కొన్నారు.‘‘ నా ఫిర్యాదును వెంటనే ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేయడం ద్వారా  నిందితుడిపై, అతని సహచరులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని యాస్మీన్ లేఖలో వివరించింది.


Updated Date - 2021-10-28T13:33:20+05:30 IST