
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్త ఒకరు బీజేపీ నేత చెంప చెళ్లుమనిపించారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ( Chandrakant Patil) షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. మహారాష్ట్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేద్కర్‌పై ఎన్సీపీ గూండాలు దాడి చేశారని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పాటిల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్సీపీ గూండాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన పోస్టు చేసిన ఆ వీడియోలో బీజేపీ నేత వినాయక్ అంబేద్కర్‌తో ఎన్సీపీ కార్యకర్తలు కొందరు వాగ్వివాదానికి దిగారు. గొడవ జరుగుతుండగానే కార్యకర్తల్లో ఒకరు వినాయక్ చెంప చెళ్లు మనిపించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత వినాయక్ అంబేద్కర్ పూణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోషల్ మీడియా పోస్టుపై క్షమాపణ చెప్పాలంటూ ఎన్సీపీ ఎంపీ గిరీష్ బపట్ తనను డిమాండ్ చేశారని అంబేద్కర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శరద్ పవార్‌పై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరాఠీ నటి కేతకి చితాలే, ఓ విద్యార్థి నిఖిల్ భమ్రేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేతికి కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. కాగా, ఆమెకు వ్యతిరేకంగా ఐదు కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి