నేడు సార్వత్రిక సమ్మె

ABN , First Publish Date - 2020-11-26T06:31:53+05:30 IST

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చిన కార్మిక, రైతు, ఉద్యోగుల చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈనెల 26నదేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి.

నేడు సార్వత్రిక సమ్మె
సార్వత్రిక గ్రామీణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నల్లగొండలో వామపక్షాల బైక్‌ర్యాలీ

27న ధర్నాలు, నిరసన కార్యక్రమాలు

ఉమ్మడి జిల్లాలో 650 పరిశ్రమల్లో 75వేల మంది కార్మికులు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘీభావం


నల్లగొండ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/యాదాద్రి: కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చిన కార్మిక, రైతు, ఉద్యోగుల చట్టాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈనెల 26నదేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బీజేపీ మినహా సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఇఫ్టూ,టీఆర్‌ఎస్‌ కేవీ, హెచ్‌ఎంఎ్‌సతోపాటు పలు కార్మిక ఉద్యోగ ఈనెల 26న గ్రామీణ సార్వత్రిక బంద్‌కు ఉమ్మడి జిల్లాలో ఐక్య కార్యాచరణ ప్రకటించాయి. 27న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. సమ్మె విజయవంతానికి నెల రోజులుగా ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ రకాల 650 పరిశ్రమల్లో పనిచేస్తున్న 75వేల మంది కార్మికులు ఈ సమ్మె లో పాల్గొంటున్నట్టు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ప్రధానంగా మూడు రకాల అంశాలు ఈ సమ్మెలో ఎజెండాగా ఉన్నాయి. 40 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌గా మార్చడం, లాభాల బాటలో ఉన్న ఎల్‌ఐసీ, టెలికాం, సింగరేణి, రక్షణ, అంతరిక్షం వంటి 8 ప్రభుత్వరంగ సం స్థల్లో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడం, వ్యవసాయాన్ని కార్పొరేటీకర ణ చేయడం, స్వేచ్చా వ్యాపా రం, పౌర సరఫరాల్లో సవరణలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు భోజన విరామంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నారు. 8గంటల పని విధానాన్ని 12 గంటలుగా మారుస్తూ కేంద్ర సర్కారు సర్క్యులర్‌ జారీ చేయడం, కనీస వేతనం రోజుకు రూ.178గా ఖరారు చేయడం, పీఎఫ్‌, ఈఎ్‌సఐ, బోనస్‌ చెల్లింపుల చట్ట సవరణలు రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో డిమాండ్‌ చేయనున్నాయి. వామపక్ష పార్టీలు బలంగా ఉన్న నల్లగొండ జిల్లాల్లో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎస్‌ వంటి రాజకీయ పార్టీలు సైతం బంద్‌లో పాల్గొంటున్నాయి.


కార్మికుల త్యాగాలకు విలువ లేకుండా చేస్తోంది : తుమ్మల వీరారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్మి

వేలాది మంది కార్మికులు తమ ప్రాణా లు అర్పించి 8 గంటల పని విధానాన్ని సాధించారు. ఇది 150 ఏళ్ల కిందటి పోరాటం. మోదీ సర్కారు రద్దు చేసిన 40 చట్టాలను యూపీఏ హయాంలో సెలక్షన్‌ కమిటీ వద్ద అడ్డుకున్నాం. కానీ, మోదీ మాత్రం కరోనా కాలంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరపకుండా కేంద్ర కేబినెట్‌లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి కార్మికుల త్యాగాలకు ఒక్క పెన్నుపోటుతో విలువ లేకుండా చేశారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల ఉనికి లేకుండా చేసే చట్టాలను అడ్డుకునేందుకు ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో కార్మికులు గురువారం సమ్మెలోకి వెళుతున్నారు.


టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు : గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కేవీ రాష్ట్ర నాయకులు 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈనెల 26న తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్‌కు టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలతో అన్నివర్గాల ప్రజలకు నష్టం వాటిల్లితోంది. దేశ సంపదను తాకట్టు పెడుతూ ప్రజలను కష్టాలపాల్జేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి ఈనెల 26న చేపడుతున్న సార్వత్రిక గ్రామీణ బంద్‌లో వివిధ కంపెనీలు, ఆటో, భవన నిర్మాణ, వివిధ వర్గాల ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొ ని విజయవంతం చేయాలి.


Updated Date - 2020-11-26T06:31:53+05:30 IST