కొత్త జిల్లాలు అవసరమా?

ABN , First Publish Date - 2020-11-27T06:02:24+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను విభజించి కొత్తగా 32–34 జిల్లాలు ఏర్పాటు చేయాలనే రాష్ట్రప్రభుత్వ ఆలోచన ఇప్పటి ఆర్థిక, రాజకీయ సంక్షోభ సమయంలో...

కొత్త జిల్లాలు అవసరమా?

ఇరవై కొత్త జిల్లాల కేంద్రాలలో కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తిచేయవచ్చును. సేద్యపు భూములు వ్యవసాయేతర భూములుగా మారిపోవటం, భూ మాఫియాలు, దందాలు పెచ్చరిల్లిపోవటం వంటి వాటిని ప్రతిపాదిత జిల్లాల్లో కూడా చూడాల్సివస్తుంది.


ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను విభజించి కొత్తగా 32–34 జిల్లాలు ఏర్పాటు చేయాలనే రాష్ట్రప్రభుత్వ ఆలోచన ఇప్పటి ఆర్థిక, రాజకీయ సంక్షోభ సమయంలో ఏమాత్రం సమర్థనీయం కాదు. అసలే కొవిడ్‌–19 మహమ్మారి విజృంభణ, వరుస వరదలు, వానలు, తుఫాన్ల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలింది. పోలవరం వంటి అత్యంత ప్రతిష్ఠాకరమైన ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయవలసిన అవసరం ఉండగా ప్రాధాన్యతలను పక్కనపెట్టి, ఎవరూ అడగని, ఏ మేనిఫెస్టోలోనూ లేని కొత్తజిల్లాల ఏర్పాటు వల్ల అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే ముప్పు ఉంది. ఆ జిల్లాలో కార్యాలయాలు, సిబ్బంది నివాసగృహాల కోసం వెంటనే కొన్ని వేల కోట్ల రూపాయలను వెచ్చించవలసి ఉంటుంది. ఆ సొమ్ముతో కేంద్రం సహాయం లేకుండానే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిని అందించవచ్చు. అనుత్పాదకమైన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. వాటికోసం మళ్లీ ప్రజలనే బాదుతూ వారిపై పన్నుల భారం మరింత మోపాల్సివస్తుంది. ఆ ప్రభావంతో పారిశ్రామికవేత్తలు వెనుతిరిగిపోవడం, పారిశ్రామిక ప్రగతి తిరోగమించడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.


ఆధునిక సమాచార రవాణా ఇంటర్నెట్‌, వీడియో వ్యవస్థల వల్ల పూర్వం రోజుల్లో జరిగే పనులు ఇప్పుడు నిమిషాలలో పూర్తవుతున్నాయి. కనీసం జీపులు, టెలిఫోన్లు లేని రోజుల్లోనే సువిశాలమైన జిల్లాల కేంద్రాల నుంచి అపరభగీరథులు సర్‌ ఆర్థర్‌ కాటన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ప్రముఖ ఇంజనీర్లు కేవలం గుర్రాలు, పడవల మీద పర్యటిస్తూ అద్భుతమైన అత్యంత పటిష్ఠమైన ప్రాజెక్టులను మనతరానికి అందించారు. ఇటీవల మన తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొన్న పెనుతుఫాన్లు, వరదలు, ఇతర విపత్తులను మన ముఖ్యమంత్రులు తమ కార్యాలయాల నుంచి కదలకుండా వీడియో, వాట్సాప్‌, ఇతర సదుపాయాల ద్వారా సమర్థంగా పర్యవేక్షించి నిర్వాసితులకు సత్వర సహాయ సహకారాలను అందించలేదా? జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్లు కూడా మంచి సమన్వయంతో క్షేత్ర సిబ్బందితో పనులను పర్యవేక్షిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడినందువల్ల రాష్ట్ర రాజధాని నిర్వహణ ఖర్చులు పన్నుచెల్లిస్తున్నారు కదా కొత్త రాష్ట్రం ఏర్పడినందువల్ల రాష్ట్రం రాజధాని నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి పన్ను చెల్లింపుదారులపై భారం దాదాపు రెట్టింపు అయింది. లోగడ తొమ్మిది కోట్ల మంది తెలుగు వారు భరించిన ఈ ఖర్చు ఇప్పుడు ఐదు కోట్ల మంది మాత్రమే భరించవలసివస్తున్నది. అదేవిధంగా ప్రస్తుతం 13 జిల్లా కేంద్రాల నిర్వహణభారం కేవలం సగటున 35 లక్షల ప్రజలు భరిస్తూ ఉండగా, కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఆ మొత్తం భారం కేవలం 15 లక్షల జిల్లా ప్రజానీకమే భరించవలసి ఉంటుంది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి ఇది అవసరమా?


విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల వంటి వాటి విస్తీర్ణం ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుతం ఆ జిల్లాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ అనేక రెట్లు మెరుగుపడింది. ఇటువంటి పెద్ద జిల్లాల పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాతమ్రే జాయింట్‌ కలెక్టర్లు, అదనపు పోలీసు సూపరింటెంట్లు, ఓఎస్‌డిలు, జిల్లాస్థాయిలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదా ఉన్నతాధికారుల నియామకాలు జరిగాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి ఏమూల ప్రాంతానికైనా చాలా తక్కువ సమయంలో వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదునిక సాంకేతికత వల్ల అధికారులు, ఉద్యోగుల పనిభారం రోజురోజుకూ తగ్గిపోతూనే ఉంది.


ఇరవై కొత్త జిల్లాల కేంద్రాలలో కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఆ నిధులతో పోలవరం ప్రాజెక్టునునిర్ణీత గడువులో పూర్తిచేయవచ్చును. ఇక కొత్త జిల్లా కేంద్రాలలో అకస్మాత్తుగా పెరిగే భూముల విలువలు, పాడిపంటనిచ్చే సేద్యపు భూములు వ్యవసాయేతర భూములుగా మారిపోవటం, భూ మాఫియాలు, దందాలు పెచ్చరిల్లిపోవటం వంటి వాటిని ఇక మీదట మరో 20 ప్రతిపాదిత జిల్లా కేంద్రాలలో మనం చూడనున్నాము. వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గితే మనకు పోలవరం ప్రాజెక్టు అవసరమే ఉండకపోవచ్చు. ఆహారధాన్యాల కోసం మన రాష్ట్రం దిగుమతులు చేసుకోవలసిన దుస్థితి ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పటి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వెనుక భారీస్థాయి రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణం దాగిఉందని, ఇప్పటి వరకు మనం కొత్త రాష్ట్రంలో చూస్తున్న వాస్తవాల ద్వారా అర్థమవుతుంది.


తెలంగాణలోని తొమ్మిది జిల్లాలను 33 జిల్లాలుగా పెంచినందువల్ల ఒనగూడిన ప్రయోజనం శూన్యమని ఇప్పటికే రుజువైంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తజిల్లాల ఏర్పాటు తేనెతుట్టెను అనవసరంగా కదిలించి ఇప్పటికే ఉన్నరాజకీయ, ఆర్థిక, కుల సంక్షోభాలను మరింతగా తీవ్రతరం చేయవద్దని సూచన.

యం.వి.జి. అహోబిలరావు

Updated Date - 2020-11-27T06:02:24+05:30 IST