మాట్లాడవలిసింది,‘శ్రామిక వర్గ అస్తిత్వం’ గురించే!

ABN , First Publish Date - 2021-01-07T09:51:06+05:30 IST

‘తెలంగాణా అస్తిత్వం ఏమైంది?’ అనే పేరుతో, హరగోపాల్ గారు రాసింది (ఆంధ్రజ్యోతి, డిసెంబరు 22) చదివాక, దాని మీద తప్పనిసరిగా...

మాట్లాడవలిసింది,‘శ్రామిక వర్గ అస్తిత్వం’ గురించే!

మిగతా అన్ని రాష్ట్రాలలోలాగే, తెలంగాణా జనాభాలో, అందరి అస్తిత్వాలూ ఒకటి కాదు. శ్రమ దోపిడీ మీద బ్రతికే వర్గం, శ్రమ చేసే వర్గం ఏకం కాకుండా వుండడానికి అనేక అసమానతల్ని సృష్టిస్తుంది: స్త్రీ-పురుష అసమానత్వాలూ, కుల భేదాలూ, మత ఘర్షణలూ, శారీరక-మేధా శ్రామికుల మధ్య అంతస్తుల భేదాలూ, ఇంకా నానా రకాల అసమానతల్నీ. ఈ సత్యాన్ని శ్రామిక జనాలకి వివరించి, వారి వర్గ అస్తిత్వాన్ని కాపాడాలే గానీ, అసమానతల్ని మరుగుపరిచే ‘ప్రాంతీయ అస్తిత్వం’ అనే భావనని కాదు.


‘తెలంగాణా అస్తిత్వం ఏమైంది?’ అనే పేరుతో, హరగోపాల్ గారు రాసింది (ఆంధ్రజ్యోతి, డిసెంబరు 22) చదివాక, దాని మీద తప్పనిసరిగా రాయాలనిపించింది నాకు. ప్రత్యేక తెలంగాణా అనే డిమాండుని సమర్థిస్తూనూ, వేరే రాష్ట్రం ఏర్పడినా, దాని పరిమితులు దానికి వుంటాయి-;అని చర్చిస్తూనూ, నేను గతంలో ఆంధ్రజ్యోతిలోనూ, ఇతర పత్రికల్లోనూ, (2009లోనూ, 2011లోనూ), నాలుగు వ్యాసాలు రాశాను. ప్రత్యేక తెలంగాణా వచ్చినా, గొప్ప మార్పులేవీ రావని కూడా రాశాను. 


గతంలో, రెండు ప్రాంతాల ‘పెద్ద మనుషులు’ (ఆ పెత్తందారులే!) చేసుకున్న ఒప్పందాన్ని, ఒక ప్రాంత ‘పెద్దలు’ పదే పదే ఉల్లంఘించారు కాబట్టి, విడిపోయే హక్కు తెలంగాణా వారికి వుంటుందనీ, అందుకే ఆ డిమాండుని సమర్థించాలనీ, రాశాను. 


‘ప్రత్యేక రాష్టం’ రాకముందు, అప్పటి ఉద్యమ నాయకుడూ, ఇప్పటి ముఖ్యమంత్రీ, ఫ్యూడల్ ప్రభువు నిజాంని ప్రశంసించి నప్పుడు, ఆ ప్రశంసని వ్యతిరేకిస్తూ, ‘‘దొరా, నా తోటి గాదు’’ అని, వీరాలాపాలు చేసి, అది వచ్చాక, ఆ పాలక పార్టీ నాయకుడికే విధేయులుగా మారిపోయి, పెద్ద పెద్ద పదవుల్ని అలంకరించిన మేధావుల రచనలు కూడా చదివాను. ఆ విధంగా, తెలంగాణా గురించి పాతా, కొత్తా చరిత్రలు కొంత తెలుసు. 


హరగోపాల్ గారు మాత్రం, మొదటి నించీ, పాలకపార్టీ పట్ల విమర్శగానే వున్నట్టు, ఆయన గత వ్యాసాలు చెబుతాయి. ఆయన రాసిన ఈ నాటి ‘తెలంగాణా అస్తిత్వం’ వ్యాసంలో మాత్రం, ఆ పార్టీకి హితబోధ చేయడం కనిపిస్తోంది: ‘ఇంకా మూడేళ్ళ సమయం వుంది; ఇప్పటికైనా మారడానికి ప్రయత్నించండ’ న్నట్టు, ఈ వ్యాసం సలహా ఇచ్చింది. 


నేటి వ్యాసంలో, హరగోపాల్ గారు వ్యక్తం చేసిన అనేక అభిప్రాయాలు అవాస్తవికంగానూ, పరస్పర వైరుధ్యాలతోనూ వున్నాయి. అదెలాగో, కొన్ని విషయాలు ఇక్కడ చర్చిస్తాను. 


1.‘నీళ్ళూ-నియామకాలూ-నిధులూ’ అనే ప్రధాన మైన, ప్రత్యేకమైన, పరిమితమైన నినాదాలతో సాగిన ఉద్యమాన్ని, ‘అస్తిత్వం’ కోసం ‘‘మరెక్కడా జరగని’’, ‘‘పెద్ద ఉద్యమం’’ అంటూ వర్ణించి, ఆ అస్తిత్వ స్పృహ ఈ నాడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.


ఈ మొట్టమొదటి ‘తెలంగాణా అస్తిత్వం’ అనే విషయంలో, తెలంగాణా ప్రాంతం అంతా, ఒకే రాతితో చెక్కిన ఒకే శిల్పం-అనే భావం వుంది. కానీ, తెలంగాణా మాత్రం, శతృవర్గాలు లేని, ఇతర ప్రాంతాలలో వున్న నిజ లక్షణాల లాగే, రకరకాల అసమానతలూ, దోపిడీ పీడనలూ లేని రాష్ట్రమా?. తెలంగాణా రాష్ట్రం జనాభాలో మెజారిటీగా వున్న శ్రామిక ప్రజలు, ఇతర రాష్ట్రాలలో లాగే, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, గనుల్లో, రవాణాలో, ఇంకా ఇతర అనేక రంగాల్లో, స్వంత శ్రమల మీదే ఆధారపడుతూ, ఆ శ్రమలలో భాగాలనే పోగొట్టుకుంటూ, పెత్తందారుల ఆగ్న్యల కింద జీవిస్తున్నారు. పెత్తందారులేమో, లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ, కమిషన్లూ వంటి శ్రమ దోపిడీ ఆదాయాలతో, నిన్నా, నేడూ, రేపూ ఆస్తుల్ని పెంచుకుంటూనే వుంటారు. వీరు జనాభాలో, అల్ప సంఖ్యే అయినా, వీరూ, వీరి రాజకీయ ప్రతినిధులూ కలిసే, తెలంగాణానికి పాలకవర్గం కదా? కానీ, తెలంగాణా జనాభా అస్తిత్వానంతా ఒకే రకంగా చూడాలా? మొత్తం రాష్ట్ర జనాభాని, ఒకే అస్తిత్వంలో వున్నవారిగానే కలగలిపి చూడడమేనా? ‘తెలంగాణా అస్తిత్వం’ అనే అవగాహనతో, వర్గ భేదాల మౌలిక వాస్తవాన్ని గుర్తించరా? 


2. ‘‘ఉమ్మడి రాష్ట్ర నిర్బంధ సంస్కృతి, మరింత ఉధృతంగా తెలంగాణాకు వచ్చేసింది’’ అని, హరగోపాల్ గారు విస్తుపోతున్నారు. పోలీసు శాఖా, గూఢచార విభాగమూ, గ్రే-హౌండ్స్ దళాలూ-వంటి నిర్బంధ యంత్రాంగం వున్న రాష్ట్రం పేరు ఏదైతే ఏమి? ఆ రాష్ట్ర సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఏమి? ఆ పాలకులు, తమ అధీనంలో వున్న ఆ నిర్బంధ యంత్రంగాన్ని ప్రయోగించకుండా పాలన చేస్తారా? తెలంగాణా రాష్ట్రం వస్తే, ఏ నిర్బంధాలూ, ఏ అణచివేతలూ వుండవని, ఏ తరగతిలోనూ చదవని, ఏ శాస్త్రాన్నీ ఎరగని, ఏ శ్రామిక అమాయకుడైనా భావించవచ్చునేమో గానీ; రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసరూ, పౌర హక్కుల ఉద్యమంలో, 40 ఏళ్ళగా కృషి చేసిన నాయకుడూ అయిన హరగోపాల్ గారికి తెలియదని ఎలా అనుకోగలం? ‘‘రాజకీయ అధికారం అన్నది, సరైన అర్థంలో, ఒక వర్గాన్ని అణచడానికి, ఇంకో వర్గం చేతిలో వుండే వ్యవస్తీకృత అధికారం మాత్రమే’’- అన్న మార్క్స్ - ఎంగెల్సుల మాటలు హరగోపాల్ గారికి తెలియదని అనుకుంటామా? అనుకోము. వర్గ భేదాల్లో, ఏ చిన్న మాటని మర్చిపోయినా, ‘పాలకులు’ అనే మాట మీద ఆగ్రహాన్ని హరించి వేస్తుంది. అందుకేనేమో, ప్రత్యేక తెలంగాణా కోసం మద్దతు పలికిన వారి మీద, తెలంగాణా రాష్ట్ర పాలకులు క్రూరమైన చట్టాల పేరుతో కేసులు పెట్టారని కొంత ఆశ్చర్యం చూపారు. ప్రత్యేక తెలంగాణా పాలకులైనా, ఏ రాష్ట్ర పాలకులైనా, దేశ పాలకులు నిర్దేశించిన క్రూర చట్టాలతో పాలించవలిసిందే కదా? 


3. ‘‘తెలంగాణా పౌర సమాజాన్ని’’ ప్రశంసిస్తూ, హరగోపాల్ గారు, ఆ పౌరులలో రక రకాల వారిని సమాన స్తాయిలో, వాస్తవానికి విరుద్ధంగా, నిలబెట్టారు. చట్టవిరుద్ధంగా, ముసుగు పోలీసు దళాల హత్యాకాండకు బలైన పురుషోత్తం వంటి ఆరుగురు పౌర హక్కుల నేతలతో, వేరే రకం నేతలని సమానం చేశారు. పెట్టుబడిదారీ సంస్కరణల నేత, పి.వి. నరసింహారావు ఇచ్చిన ‘పద్మ విభూషణ్’ బిరుదుని పుచ్చుకున్న కాళోజీనీ; ‘ఆంధ్రా వలస’ పాలకులు నడిపిన ప్రభుత్వ హయాంలో వైస్-చాన్సలరు పదవి అనుభవించిన జయశంకర్నీ, ప్రాణత్యాగం చేసిన పౌర హక్కుల నేతలతో సమానం చేయడానికి హరగోపాల్ గారికి మనసు ఎలా అంగీకరించింది? 


4. ‘‘పునర్నిర్మాణం అనే స్పూర్తితో పాలన ప్రారంభం’’ కాలేదని వాపోయారు, హర గోపాల్ గారు. ఆంధ్ర పెత్తందారులు పోయి, వారి స్తానంలో తెలంగాణా పెత్తందారులు వస్తే, గొప్ప రకం పునర్నిర్మాణం జరుగుతుందని భావించారా ఈయన? 

‘‘పునర్మిర్మాణం’’ ఏయే విషయాలకీ? ‘నీళ్ళూ-నియామకాలూ-నిధులూ’ కోసమే కదా జరగవలిసింది? 


కీలక స్తానాల్లో, పాత పెత్తందారులు తమ అనుయాయుల్ని పెట్టుకుంటే, కొత్త పెత్తందారుడు మాత్రం, తన అనుయాయుల్ని పెట్టుకోడా?

నీళ్ళ కోసం, కొత్త ప్రాజెక్టులు పెట్టుకుని, కావలిసిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు సాధించవచ్చు. 

నియామకాల విషయానికి వస్తే, ప్రైవేటీకరణ విజృఁబించడం వల్ల, తగ్గిపోయిన ప్రభుత్వ ఉద్యోగాలలో కొంతమంది స్తానికుల్ని నియమించి, మిగతా వారిని ఆశలలో ఓలలాడించ గలరు. అంతకంటే మించిన ‘‘పునర్నిర్మాణం’’ సాధ్యం కాదు. అలాగే నిధుల సంగతి కూడా.


తెలంగాణా అనేది, దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా ఎలా వుండగలుగుతుంది? అవే ఆర్ధిక విధానాలు! అవే రాజకీయాలు! కొత్తవి ఎక్కణ్ణించీ తెస్తారు? 


5. ‘‘అన్నిటికీ మించి సాంస్కృతిక రంగంలో బాగా దెబ్బతిన్నాం’’ అని, కొందరు కవుల్నీ, కొన్ని గీతాల్నీ ప్రస్తావించారు. ‘‘జయ, జయహే తెలంగాణా’’ అన్నా, ‘‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండా’’ అన్నా, ‘‘అమార్ సోనార్ బాంగ్లా!’’ అన్నా అవన్నీ, స్వోత్కర్షలు. రైతుల ఆత్మ హత్యలూ, ‘‘పుణ్య క్షేత్రాల’’లో వ్యభిచార గృహాల్లో ఇరుక్కు పోయి వున్న గతిలేని స్త్రీలూ; అరకొర జీతాలతో బ్రతికే చిరుద్యోగులూ, పూర్తి నిరుద్యోగులూ; భిక్షాటన మీద బ్రతికే కడు నిరుపేదలూ వుండే ఏ ప్రాంతాన్నయినా ‘జయ, జయహే’ అనో, ‘‘అన్నదాత ఆంధ్రప్రదేశ్’’ అనో, ‘‘భారత్ మాతాకీ జై!’’ అనో, ‘‘అమార్, సోనార్ బాంగ్లా’’ అనో, ‘‘గుజరాత్ అస్మిత’’ అనో, ‘‘మరాఠీ మానుశ్’’ అనో పొగుడుకోవడం వల్ల శ్రామిక జనాలకి వొరిగేదేమిటి? ప్రతి ప్రాంతంలో లాగే, తెలంగాణాలో కూడా కొందరు పేరుగాంచిన కవులు రాజకీయ పదవుల్లోనూ, ప్రత్యేక అధికారులు గానూ, సాహిత్య పీఠాధిపతులు గానూ, ప్రత్యేక సలహా దారులు గానూ, మారిన సంగతుల్ని గట్టిగా ఖండించక, ఎంత వాపోయినా, ఏమి ప్రయోజనం? 


6. ‘‘తెలంగాణా అస్తిత్వాన్ని కాపాడుకోవాలని’’, హరగోపాల్ గారు పిలుపునిచ్చారు. మిగతా అన్ని రాష్ట్రాలలోలాగే, తెలంగాణా జనాభాలో, అందరి అస్తిత్వాలూ ఒకటి కాదు. శ్రమ దోపిడీ మీద బ్రతికే వర్గం, శ్రమ చేసే వర్గం ఏకం కాకుండా వుండడానికి అనేక అసమానతల్ని సృష్టిస్తుంది: స్త్రీ-పురుష అసమానత్వాలూ, కుల భేదాలూ, మత ఘర్షణలూ, శారీరక-మేధా శ్రామికుల మధ్య అంతస్తుల భేదాలూ, ఇంకా నానా రకాల అసమానతల్నీ. ఈ సత్యాన్ని శ్రామిక జనాలకి వివరించి, వారి వర్గ అస్తిత్వాన్ని కాపాడాలే గానీ, అసమానతల్ని మరుగుపరిచే ‘ప్రాంతీయ అస్తిత్వం’ అనే భావనని కాదు. 

రంగనాయకమ్మ

Updated Date - 2021-01-07T09:51:06+05:30 IST