నీట్‌ : వెంటాడుతున్న వేదన

ABN , First Publish Date - 2021-12-03T05:57:58+05:30 IST

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మొదలైన వైద్యవిద్య కోర్సులలో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించిన ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్’ (నీట్‌)లో ఈ ఏడాది ఎప్పుడూ లేనంత గందరగోళం నెలకొంది....

నీట్‌ : వెంటాడుతున్న వేదన

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మొదలైన వైద్యవిద్య కోర్సులలో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించిన ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్’ (నీట్‌)లో ఈ ఏడాది ఎప్పుడూ లేనంత గందరగోళం నెలకొంది. విద్యార్థులు ప్రతిక్షణం మానసిక ఒత్తిడికి లోనయ్యారు. రిజర్వేషన్లపై వివాదం, ప్రశ్నపత్రాల లీకేజ్‌, ఫలితాల వెల్లడిలో జాప్యం, విద్యార్థుల ఆత్మహత్యలు, నీట్‌ రద్దుపై రాష్ర్టాల డిమాండ్‌, కౌన్సెలింగ్‌లో జాప్యం, కోర్టు కేసులు, జూనియర్‌ డాక్టర్ల ఆందోళనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రెండు నెలల్లో పూర్తయ్యే ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ ఏడాది సెప్టెంబరు 12న దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరిగిన 50 రోజుల తర్వాత నవంబరు 1న ఫలితాలు వెలువడ్డాయి. ఇంగ్లీష్‌, హిందీతోపాటు 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు నీట్‌లో 180 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు పరీక్ష నిర్వహించేవారు. సమయం మూడు గంటలు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు సమానంగా ఉండేవి. ఈసారి పరీక్షల్లో చాయిస్‌ ఇచ్చారు. అన్ని విభాగాల నుంచి మరో 20 ప్రశ్నలను పెంచి 200 చేశారు. 180 ప్రశ్నలకే సమాధానాలు రాస్తే సరిపోతుంది. చాయిస్‌ ఇచ్చినప్పటికీ సమయం మాత్రం మూడు గంటలే ఉండడంతో చాలామంది ఒత్తిడికి గురయ్యారు. ఈ ఏడాది ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయి. చదివి అర్థం చేసుకునే సరికే సమయం పట్టింది. చాలా మంది ప్రశ్నలన్నింటిని ఆన్సర్‌ చేయలేదు. ఇది విద్యార్థుల మనోవేదనకు కారణమైంది. తమిళనాడులో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై పౌర సమాజం తీవ్ర ఆందోళనకు గురైంది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు సినీ ప్రముఖులు సైతం పిలుపునిచ్చారు. దీనితో, నీట్‌ను జాతీయ స్థాయిలో కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేలా చేయాలని కేంద్రాన్ని ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర కోటాలో సీట్ల భర్తీకి నీట్‌ను రద్దు చేసి, గతంలో మాదిరి పరీక్షలను రాష్ట్రంలోనే నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతను పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదంటూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్‌ లేఖలు రాశారు. ఇందులో నీట్‌కు ప్రత్యామ్నాయంగా వైద్యవిద్య ప్రవేశపరీక్షకు సంబంధించి ఏకే రాజన్‌ కమిటీ నివేదికను పొందుపరిచారు. మహారాష్ట్రలోని ఓ కోచింగ్‌ సెంటర్‌ మెడికల్‌ సీట్లు ఇప్పిస్తామంటూ ఫేక్‌ విద్యార్థులతో పరీక్ష రాయించి రూ.50 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్న వ్యవహారం మరోపక్క తీవ్ర కలకలం రేపింది. పరీక్ష నిర్వహణలో తమ ఓఎంఆర్‌ షీట్లు తారుమారైనట్లు ఇద్దరు విద్యార్థులు ముంబయి కోర్టును ఆశ్రయించడంతో అది ఫలితాల ప్రకటన నిలిపివేసింది. ఆ తరువాత సుప్రీంకోర్టు ఇద్దరు విద్యార్థుల కోసం లక్షల మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయలేమని తీర్పు ఇవ్వడంతో నవంబరు ఒకటో తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. చివరకు, వీటిని చూసి ఎప్పుడూ మార్కులు, ర్యాంకులు ఎక్కువగా వచ్చే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఈసారి ఉత్తరాది రాష్ట్రాలకు మెరుగైన ఫలితాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిజిక్స్‌, కెమిస్ర్టీ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్‌ మార్కులు తక్కువగా ఉంటాయని అంతా అంచనా వేశారు. కానీ, ఫలితాలు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో భారీగా మార్కులు తగ్గగా, ఆంధ్రలో కాస్త పెరిగాయి. ఇక జాతీయ ర్యాంకులు విడుదలైన వారం, పది రోజుల్లో రాష్ర్టాల ర్యాంకులు విడుదల చేయాలి. తెలంగాణ ముందుగానే నవంబరు 20న విడుదల చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయం. ఎన్‌టీఏ నుంచి వచ్చిన ఫలితాల సీడీ ఓపెన్‌ కాకపోవడంతో చివరకు 23న విడుదల చేశారు. కౌన్సెలింగ్‌ ఎప్పుడు మొదలవుతుందా? అని అందరూ ఎదురుచూస్తుండగా నీట్‌ భౌతిక శాస్త్రంలో ఓ ప్రశ్నకు హిందీ, ఇంగ్లీష్‌ వెర్షన్‌లకు సమాధానం వేర్వేరుగా ఉందని ఆరోపిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రెండు భాషల్లోనూ సమాధానం ఒకేలా ఉందని కమిటీ తేల్చడంతో కేసును నవంబరు 30వ తేదీన కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇప్పుడు రిజర్వేషన్ల కేసు ఒకటి ఉన్నత న్యాయస్థానం ముందు విచారణలో ఉంది. 


అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులతో పాటు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో అఖిల భారత కోటా కింద సీట్లను ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన(ఈడబ్ల్యూఎస్‌) వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో జనరల్‌ కోటాలో విద్యార్థులు మైనారిటీలుగా మిగిలిపోతారని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రప్రభుత్వంతో పాటు ‘మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ’ (ఎంసీసీ)కి సెప్టెంబరు 17న నోటీసులు జారీచేసింది. దీనిపై కేంద్రప్రభుత్వం సెప్టెంబరు 26న సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. నీట్‌ ప్రవేశాల్లో పేదల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద అర్హులను నిర్ణయించేందుకు రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధించామని, దీనిపై మరోసారి పునఃపరిశీలన చేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టుకు విన్నవించారు. నాలుగు వారాల్లో నివేదిక సమర్పిస్తామని, అప్పటి వరకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలుపుదల చేస్తామని తెలిపారు. దీనిపై న్యాయస్థానం కేసును జనవరి ఆరో తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు ప్రభావం నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌పైన పడింది. అది పదే పదే వాయిదా పడుతుండడంతో కెరీర్‌పై భయాందోళన పెరిగిపోతోందని ఆరోపిస్తూ రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నవంబరు 27వ తేదీ నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టుల నుంచి సరైన స్పందన రాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ రెసిడెంట్‌ డాక్టర్లు రోడ్లెక్కుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం డాక్టర్స్‌ అసోసియేషన్‌తో సంప్రదింపులు జరిపింది. మూడు వారాల్లో ఈడబ్ల్యూఎస్‌పై సమీక్ష జరిపి నివేదిక సమర్పించాలంటూ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ ఏడాది నీట్‌ యూజీ, పీజీ పరీక్షలు జరిగి నెలలు గడుస్తున్నా అడుగడుగునా ఎదురవుతున్న అవాంతరాలు కేంద్ర ప్రభుత్వ పనితీరును స్పష్టం చేస్తున్నాయి. శాసనవ్యవస్థ తాను ఆమోదించే చట్టాల ప్రభావంపై అధ్యయనం చేయడం లేదని, అందువల్ల కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నది ఇలాంటి కేసుల వల్లనే కావచ్చు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యాసంవత్సరం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించడమే కాదు. ఫలితాల వెల్లడిలోను, సీట్ల కేటాయింపుల్లోనూ ఎలాంటి జాప్యం లేకుండా చూడాలి. నెలల తరబడి నిద్రాహారాలు మానేసి పరీక్షల కోసం సిద్ధమైన విద్యార్థులపై మరింత ఒత్తిడి పడుతుంది. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ల పేరిట లక్షలు వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు ఆర్థికభారంతో పాటు, మానసిక వేదన మిగులుతోంది. నీట్‌ కౌన్సెలింగ్‌ జరగకపోవడం వల్ల ఇందులో సీటు వస్తుందో? రాదో? తెలియక, లాంగ్‌ టర్మ్‌కు వెళ్లాలో, లేక వేరే కోర్సుల్లో చేరాలో అర్థం కాక విద్యార్థులు అయోమయంలో పడిపోతున్నారు.

దేవగళ్ల రామకృష్ణ

జర్నలిస్‌్ట

Updated Date - 2021-12-03T05:57:58+05:30 IST