‘నీట్’కు మరో విద్యార్థిని బలి

ABN , First Publish Date - 2022-09-09T14:42:17+05:30 IST

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు ఓ విద్యార్థిని బలికాగా, మరో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. రాష్ట్రంలో నీట్‌లో ఉత్తీర్ణత

‘నీట్’కు మరో విద్యార్థిని బలి

                          - మరొకరి ఆత్మహత్యాయత్నం


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 8: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)కు ఓ విద్యార్థిని బలికాగా, మరో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించి మృత్యువుతో పోరాడుతోంది. రాష్ట్రంలో నీట్‌లో ఉత్తీర్ణత సాధించని కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య సీరియల్లా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20 మందిని నీట్‌ బలికొంది. స్థానిక ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్‌ చోళాంబేడు ఇందిరా నగర్‌కు చెందిన అముద ఈరాపురం సమీపంలోని బండేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఏకైక కుమార్తె లక్ష్మణశ్వేత (19) ఒకటి నుంచి 12వ తరగతి వరకు అంబత్తూర్‌ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంది. అనంతరం ఫిలిఫ్పైన్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతూ జూలై 17న నీట్‌ రాసింది. బుధవారం విడుదలైన ఫలితాలలను ఆన్‌లైన్‌(Online)లో చూసిన లక్ష్మణశ్వేత ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో బోరున విలపించింది. తల్లి ఆమెను ఓదార్చినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న సమయంలో గురువారం వేకువజామున లక్ష్మణశ్వేత ఇంటి హాలులో ఫ్యానుకు ఉరేసుకు ని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు గంటలకు మేల్కొన్న అముద తమ కుమార్తె ఉరేసుకొని వేలాడుతుండడం చూసి వెంటనే 108కు ఫోన్‌ చేయడంతో, అంబులెన్స్‌ సిబ్బంది ఆమెను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు.


యాసిడ్‌ తాగిన విద్యార్థిని...

నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపానికి గురైన తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణికి చెందిన జయసుధ (18) టాయిలెట్‌ శుభ్రం చేసే యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. జయసుధ ప్లస్‌ టూ పూర్తయిన తరువాత తిరుపతిలోని ఓ శిక్షణా కేంద్రంలో చేరి నీట్‌  రాసింది. నీట్‌లో ఫెయిల్‌ అయ్యాయని తెలుసుకున్న జయసుధ యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స నంతరం చెన్నై(Chennai)లోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి మెరుగైన చికిత్సల కోసం తరలించారు.


కొనసాగుతున్న విషాదం...

రాష్ట్రంపై  కేంద్రప్రభుత్వం బలవంతంగా నీట్‌ పరీక్షలను ప్రవేశపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు 17 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అరియలూరు జిల్లా కుళుమూరుకు చెందిన అనిత, సేలయూరుకు చెందిన ఏంజిలిన్‌ శృతి, తిరుప్పూర్‌ రీతుశ్రీ, విల్లుపురం జిల్లా మరక్కాణం కూనిమేడుకు చెందిన మోనీషా, పట్టుకోటకు చెందిన వైశ్య, తిరునల్వేలి ధనలక్ష్మి, కోయంబత్తూర్‌ శుభశ్రీ, మదురై జ్యోతిశ్రీదుర్గ, సెంధురై విఘ్నేష్‌, ధర్మపురి ఆదిత్య, తిరుచెంగోడు మోతీలాల్‌ తదితరులు నీట్‌ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది సేలం జిల్లా మేట్టూరుకు చెందిన ధనుష్‌, అరియలూరు జిల్లా ద్వారంకుట్టికి చెందిన కనిమొళి ఆత్మహత్య చేసుకోగా, గురువారం లక్ష్మణశ్వేత కూడా నీట్‌  కారణంగా బలైపోవడం విషాదకరం.

Updated Date - 2022-09-09T14:42:17+05:30 IST