విద్యార్థులకు నెగటివ్‌

ABN , First Publish Date - 2021-12-06T04:46:03+05:30 IST

తూప్రాన్‌ పట్టణ పరిధిలోని హైదర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

విద్యార్థులకు నెగటివ్‌
హైదర్‌గూడ పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం

హైదర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, 

హవేళీఘణపూర్‌ గురుకులంలో విద్యార్థులకు కరోనా టెస్టులు


తూప్రాన్‌, డిసెంబరు 5 : తూప్రాన్‌ పట్టణ పరిధిలోని హైదర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో బీడీ కాలనీ, హైదర్‌గౌడ్‌ గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. తూప్రాన్‌ పట్టణ పరిధి హైదర్‌గూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు, ఆమె ఇద్దరు కుమారులకు శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. శనివారం ఉపాధ్యాయురాలు విధులకు హాజరై తరగతులు బోధించిన నేపథ్యంలో విద్యార్థులకు కరోనా సోకుతుందని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కరోనా పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేయడంతో ఆదివారం క్యాంపు ఏర్పాటు చేసి టెస్టులు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేపట్టారు. పాఠశాలలో చదువుకుంటున్న 38 మంది హైదర్‌గూడ, బీడీకాలనీ విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. విద్యార్థులందరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తూప్రాన్‌ పట్టణ పరిధిలో ఓ అంగన్‌వాడీ టీచర్‌కు పదిరోజుల క్రితం సైతం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్యులు రహస్యంగా ఉంచడంపై కౌన్సిలర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


హవేళీఘణపూర్‌ గురుకులంలో ...

హవేళీఘణపూర్‌; మండల కేంద్రంలోని మహాత్మజ్యోతిబాపూలే (బాలికల) గురుకుల విద్యాలయంలో ఆదివారం నిర్వహించిన కరోనా టెస్టుల్లో విద్యార్థినులందరికీ నెగటివ్‌గా తేలిందని మండల వైద్యాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌రావు తెలిపారు. శనివారం నిర్వహించిన టెస్టుల్లో ముగ్గురికి పాజిటివ్‌గా వచ్చిన విషయం విధితమే. ఆదివారం 121 మంది విద్యార్థినులకు కరోనా టెస్టులు నిర్వహించగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటీన తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. శనివారం పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు విద్యార్థులను హోం ఐసోలేషన్‌కు తరలించినట్లు చెప్పారు. విద్యార్థులకు స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా వచ్చిందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారి సూచించారు. 



Updated Date - 2021-12-06T04:46:03+05:30 IST