సాగర్‌ డ్యాం భద్రతపై నిర్లక్ష్యం

Published: Wed, 17 Aug 2022 01:05:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాగర్‌ డ్యాం భద్రతపై నిర్లక్ష్యంప్రధాన డ్యాంపై వాహనాల రద్దీ

ప్రధాన డ్యాంపైకి భారీగా పర్యాటకుల వాహనాలకు అనుమతి


నాగార్జునసాగర్‌, ఆగస్టు 16: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం, ఎగువ నుంచి ఇనఫ్లో భారీగా వస్తుండటంతో 26 క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా, కృష్ణమ్మ అందాలు చూసేందుకు భారీగా పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ప్రధాన డ్యాంపైకి పర్యాటకుల వాహనాలను అనుమతిస్తుండటంతో తరచూ ట్రాఫిక్‌జాం ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలు పెరగడంతో డ్యాం భద్రత ప్రమాదంలో పడిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


1955లో సాగర్‌ ప్రధాన డ్యాం నిర్మాణ సమయంలో ఏపీ-తెలంగాణకు రవాణా మార్గం నిమిత్తం ప్రధాన డ్యాం ముందు బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి 1964లో డ్యాంకు గేట్లు అమర్చక ముందు(1967లో గేట్లుఅమర్చారు) ఎగువ నుంచి వచ్చిన భారీ వరద ఉథృతికి కొట్టుకుపోయింది. దీంతో 1964 నుంచి సాగర్‌ ప్రధాన డ్యాంపైనుంచే ఏపీ -తెలంగాణకు వెళ్లే  భారీ వాహనాలను, ఆర్టీసీ బస్సులను, ప్రైవేటు వాహనాలను కూడా వెళ్లనిచ్చేవారు. ఆ తర్వాత నిపుణులు డ్యాం పటిష్ఠత దెబ్బతింటుందని, డ్యాం పై నుంచి భారీ వాహనాలు వెళ్లరాదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో 2004లో నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయు డు రూ.24 కోట్ల వ్యయంతో ప్రధాన డ్యాంకు కిలో మీటరు దూరంలో నూతన వంతెనన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2005లో వంతెన నిర్మాణం పూర్తి కావడంతో నాటి ఉమ్మ డి ఏపీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సాగర్‌ ప్రాజెక్టు స్వర్ణోత్సవాల సందర్భంగా సాగర్‌కు వచ్చి ప్రారంభించారు. సాగర్‌ ప్రధాన డ్యాం భద్రత, పటిష్ఠత దృష్ట్యా 2005 నుంచి వాహనాలను అనుమతించకుండా డ్యాంకు ఇరువైపులా గేట్లు ఏర్పాటు చేసి డ్యాంకు 24 గంటలు ఎస్పీఎఫ్‌ సిబ్బందిచే పహారా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి డ్యాంపై పనిచేసే సిబ్బంది వాహనాలు, వీఐపీలు వచ్చినప్పుడు వారి వాహనాలను మాత్రమే డ్యాంపైకి అనుమతించేవారు. గత ఆరు రోజులుగా సాగర్‌ ప్రాజెక్టు 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపఽథ్యంలో వరుస సెలవు దినాలు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు సాగర్‌కు వస్తున్నారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు ది నం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సాగర్‌కు వచ్చారు. దీంతో గతంలో ఎన్నడూలే ని విధంగా సాగర్‌ ప్రధాన డ్యాంపై ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ట్రాఫిక్‌ జాం అయ్యిం ది. ప్రధాన డ్యాం పైకి సుమారు 300 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు వచ్చి ఉండవచ్చునని అధికారుల అంచనా. ప్రధాన డ్యాంపై భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో ఎస్పీఎఫ్‌ సిబ్బంది అరగంటకు ఒకసారి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తూ అనుమతులు తీసుకుని వస్తున్న మరికొన్ని వాహనాలను డ్యాం పైకి పంపించారు. కొందరు పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదంగా గడుపుతూ గంటల కొద్దీ డ్యాంపై ఉన్నారు. భారీ స్థాయిలో కార్లు, ద్విచక్ర వాహనాలు డ్యాం పైకి రావడంతో వాహనాల హారన్‌ల మోతతో నడిచి వెళుతున్న తమకు ఇబ్బంది కలిగిందని పలువురు పర్యాటకులు తెలిపారు. అంతే కాకుండా డ్యాంపై ఏమైన తోపులాట జరిగితే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు పర్యాటకులు వాపోతున్నారు. కొందరు పర్యాటకులు తమ చిన్నారులకు క్రస్ట్‌ గేట్లను చూపించడం కోసం రక్షణ గోడ పైకి ఎత్తుతున్నారు. కొందరు చిన్నారులు తల్లిదండ్రుల సహాయం లేకుండా రక్షణ గోడ ఎక్కి చూస్తున్నారు. ఈ క్రమంలో పట్టు తప్పితే స్పిల్‌వేపై పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక దశలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన డ్యాం పైకి ఇంత పెద్ద సంఖ్యలో వాహనాలను అనుమతించడం ఏమిటని పలువురు పర్యాటకులు భయందోళనకు గురయ్యారు.


అబ్బురపరుస్తున్న కృష్ణమ్మ సోయగం

నాగార్జునసాగర్‌/ కేతేపల్లి: గలగలపారే కృష్ణమ్మ సోయగం కనులకు కనువిందు చేస్తోంది. ఎటూ చూసినా జలసవ్వడి సందడి చేస్తుండడంతో పర్యాటకులు తనివితీరా వీక్షిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్‌కు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తం 4,37,896 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టుకు గత ఐదు రోజుల కంటే వరద రాక పెరగడంతో 26క్రస్ట్‌ గేట్లల్లో 20క్రస్ట్‌ గేట్లను 20అడుగుల మేర, ఆరు క్రస్ట్‌గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 3,31,406 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 586.2అడుగులుగా (301.3570 టీఎంసీలకు) ఉంది.  ఇదిలా ఉండగా, మూసీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రానికి 2,075క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు మూడు క్రస్ట్‌గేట్లను అర అడుగు మేర ఎత్తి 1,312క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 639అడుగులు(2.99టీఎంసీలు)గా ఉంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.