నిర్లక్ష్యమా.. పని భారమా..!

ABN , First Publish Date - 2021-04-11T04:56:10+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులంటే సమాజంలోని విద్యావంతుల శ్రేణిలో అగ్రభాగాన ఉండేవారు. ఓటుకు ఉన్న విలువ గురించో, ప్రజాస్వామ్యంలో దాని గొప్పతనం గురించో సామాన్య ప్రజానీకానికి వివరించడానికి వీరిలో చాలామంది పలు వేదికలపై గళమెత్తుతూ ఉంటారు.

నిర్లక్ష్యమా.. పని భారమా..!

జిల్లాలో సర్వీసు ఓట్లు మినహా

20వేలకు పైగా పోస్టల్‌ బ్యాలెట్లు

పరిషత్‌ ఎన్నికల్లో వీటిలో

30శాతం నమోదైతే గగనమే

కోర్టు తీర్పుతో సాంకేతిక సమస్యలు

ఒంగోలు (జడ్పీ), ఏప్రిల్‌ 9 : ప్రభుత్వ  ఉద్యోగులంటే  సమాజంలోని విద్యావంతుల శ్రేణిలో అగ్రభాగాన ఉండేవారు. ఓటుకు ఉన్న విలువ గురించో, ప్రజాస్వామ్యంలో దాని గొప్పతనం గురించో సామాన్య ప్రజానీకానికి వివరించడానికి వీరిలో చాలామంది పలు వేదికలపై గళమెత్తుతూ ఉంటారు. ఓటు విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారు ఆచరణలో మాత్రం విఫలమౌతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరమవుతున్నారు. తాజా పరిషత్‌ ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికలు స్వల్ప సమయంలో నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం కూడా వారు పోస్టల్‌ ఓటుకు దూరమవడానికి ఒక కారణంగా ఉంది. ఇటీవల వరుసగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి ప్రాతినిథ్యాన్ని గణిస్తే నానాటికీ తీసికట్టుగానే ఉంది. పరిషత్‌ ఎన్నికల్లో అయితే ఇది మరీ కిందకు పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకునే విషయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం ఒక ఎత్తుకాగా, ఎస్‌ఈసీ స్వల్ప సమయంలో ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో పనిభారం పెరగడం కూడా పోస్టల్‌ బ్యాలెట్ల తగ్గుదలకు కారణాలుగా ఉన్నాయి.


ఉద్యోగం ఒక చోట.. ఓటు మరో చోట

జిల్లాలో ఉన్న ఉద్యోగుల్లో చాలామందికి వారి స్వగ్రామాల్లోనే ఓటుహక్కు ఉంది. వీరంతా ఒంగోలులోనో లేక ఆయా మండల కేంద్రాల్లోనో నివాసం ఉంటున్నారు. ఎన్నికల విధులకు నియమితులైన వీరంతా పోస్టల్‌ బ్యాలెట్‌ తీసుకెళ్లి ఎంపీడీవో కార్యాలయంలో ఉంచిన బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. వీరికి ఏగ్రామంలో అయితే ఓటుహక్కు ఉందో ఆ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఈ వెసులుబాటును వీరు కౌంటింగ్‌ రోజు ఉదయం వరకూ ఉపయోగించుకునే వీలుంది. ఇప్పటి వరకూ ఉన్న అంచనా ప్రకారం కనీసం 30శాతం మంది ఉద్యోగులు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది.


సమయాభావానికి నిర్లక్ష్యం తోడు..

పరిషత్‌ ఎన్నికల విధులు నిర్వహించే వారికి ఈనెల 3న పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారు. వాటిని అందుకున్న వారంతా 4 నుంచి శిక్షణ తరగతులు, మెటీరియల్‌ తీసుకెళ్లడం తదితర పనుల మీద బిజీగా గడిపారు. దీంతో తమ మండల కేంద్రానికి వెళ్లి ఓటు వేసే సమయం కూడా లేకపోయింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీచేసేటప్పుడు పోస్టల్‌ బ్యాలెట్‌లు వేయడానికి కావాల్సిన సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంతో తాము ఓటుహక్కును వినియోగించుకోలేక పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

Updated Date - 2021-04-11T04:56:10+05:30 IST