పొరుగు మద్యం పోటు

ABN , First Publish Date - 2021-10-04T05:02:57+05:30 IST

పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కార్లలో జిల్లాకు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మార్గమధ్యంలో తనిఖీలు చేసే ప్రదేశాలను గుర్తించి దారి మార్చి చాకచక్యంగా తీసుకొస్తున్నారు. అనేకమంది కొత్తగా కార్లు కొనుగోలు చేసి డ్రైవర్లుగా అవతారం ఎత్తి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒంగోలు సంతపేటలో పట్టుబడిన వారిలో ట్రావెల్స్‌ డ్రైవర్‌ కూడా ఉండటం అందుకు నిదర్శనం

పొరుగు మద్యం పోటు
భారీగా పట్టుబడిన మద్యం బాటిళ్ల వద్ద ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

తెలంగాణ నుంచి 

జోరుగా అక్రమ రవాణా

జిల్లాలో విచ్చలవిడిగా విక్రయం

ముఠాలుగా ఏర్పడి వ్యవహారం

కొన్నిచోట్ల అధికార పార్టీ 

నేతలే సూత్రధారులు

డ్రైవర్ల ముసుగులో 

తరలిస్తున్న మరికొందరు

అలంకారప్రాయంగా చెక్‌పోస్టులు 

ఒంగోలు (క్రైం), అక్టోబరు 3 :

కందుకూరు మండలంలోని మహదేవపురంలో గత గురువారం పెద్దఎత్తున తెలంగాణ  మద్యం పట్టుబడింది. ఎస్‌ఈబీ అధికారులు దాడిచేసి 63 బాక్సులలో ఉన్న ఫుల్‌బాటిల్స్‌ పట్టుకున్నారు. ఈ మద్యం విలువ తెలంగాణ ప్రకారం రూ.4.49లక్షలు, మన దగ్గర అయితే రూ.9లక్షలు ఉంటుంది. 

ఒంగోలు సంతపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలో శుక్రవారం ఉదయం కారులో తరలిస్తున్న మద్యంను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు.  కారును స్వాధీనం చేసుకున్నారు.

ముండ్లమూరులో ఒక ఇంటిలో ఉన్న 44 బాటిళ్ల తెలంగాణ మద్యం, 62 బాటిల్స్‌ ఆంధ్రా మద్యంను శనివారం ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. 

వరుసగా ఇటీవల కాలంలో ఒంగోలులోనే పలుమార్లు తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఇలా పొరుగా రాష్ట్రాల మద్యం జిల్లాలో పరవళ్లు తొక్కుతోంది. అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ అక్రమార్కులు సరికొత్త పంథాలతో వ్యాపారం సాగిస్తున్నారు. ఏపీలో మద్యం ధరలు తెలంగాణతో పోలిస్తే రెండింతలున్నాయి. దీంతో తెలంగాణ, గోవా మద్యంకు డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకొని కొందరు ఇతర రాష్ట్రాల మద్యాన్ని అడ్డదారుల్లో ఇక్కడికి తెప్పించి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో అనేక చోట్ల అధికార పార్టీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. 


 పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి మద్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కార్లలో జిల్లాకు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మార్గమధ్యంలో తనిఖీలు చేసే ప్రదేశాలను గుర్తించి దారి మార్చి చాకచక్యంగా తీసుకొస్తున్నారు. అనేకమంది కొత్తగా కార్లు కొనుగోలు చేసి డ్రైవర్లుగా అవతారం ఎత్తి మద్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒంగోలు సంతపేటలో పట్టుబడిన వారిలో ట్రావెల్స్‌ డ్రైవర్‌ కూడా ఉండటం అందుకు నిదర్శనం. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్‌లోనూ మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఉదంతాలు ఇటీవల బహిర్గతమయ్యాయి. ఎస్‌ఈబీ అధికారులు అరకొర దాడులకే పరిమితమవుతుండటంతో అక్రమ వ్యాపారం మూడు బాటిళ్లు.. ఆరు పెట్టెలుగా సాగుతోంది.


అక్రమ మార్గాల్లో రవాణా

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తోంది. దీంతో గతంలో అలవాటున్న, తక్కువ ధరకు లభించే బ్రాండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ పరిస్థితిని అసరా చేసుకొని కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో తెలంగాణ, గోవా రాష్ట్రాల నుంచి  మద్యాన్ని దిగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా అందులో రాయల్‌ స్టాగ్‌, మ్యాన్‌షన్‌ హౌస్‌ బ్రాండ్లను భారీగా తరలిస్తున్నారు. రాయల్‌స్టాగ్‌ ఫుల్‌ బాటిల్‌ రూ.1100 నుంచి రూ.1500 వరకూ విక్రయిస్తున్నారు.


జిల్లాకు తెలంగాణ మద్యం

తెలంగాణ మద్యానికి డిమాండ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి ముందుగా ఒప్పందం కుదుర్చుకుని మద్యం బాటిళ్లను గుట్టుగా తరలిస్తున్నారు. అక్కడ రూ.500కు కొనుగోలు చేసిన బాటిల్‌ ఇక్కడ రూ.1200 వరకు విక్రయిస్తుండటంతో భారీగా ఆదాయం లభిస్తోంది. దీంతో అనేక మంది అక్రమ రవాణా వైపు మరలుతున్నారు. గతంలో మద్యం వ్యాపారంలో ఉన్నవారు, దుకాణాల్లో పనిచేసినవారు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు.  తెలంగాణలో ఎక్కువగా మన మందుబాబులు వినియోగించే బ్రాండ్లు దొరుకుతున్నాయి. ఇక్కడ అవసరమైన బ్రాండ్లు లభించకపోవడం కూడా తెలంగాణ మద్యానికి డిమాండ్‌ పెరగడానికి కారణమైంది.


చోద్యం చూస్తున్న ఎస్‌ఈబీ అధికారులు

రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులు పటిష్టంగా పనిచేస్తే ఇతర ప్రాంతాల నుంచి మద్యం వచ్చే అవకాశం లేదు. అయితే ఆయా ప్రాంతాలలో ఉన్న చెక్‌పోస్టులలో సిబ్బంది అంటీముట్టనట్లు వ్యవహరించడంతో భారీగా తెలంగాణ మద్యం జిల్లాకు చేరుతుంది. కొందరైతే అక్కడి చెక్‌పోస్టుల సిబ్బందితో  బేరాలు కుదుర్చుకొని  యథేచ్ఛగా మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరైతే దారి మార్చి రాష్ట్రంలోకి మద్యాన్ని తెస్తున్నారు. అదేవిధంగా  ట్రావెల్స్‌పై ఎస్‌ఈబీ అధికారుల నిఘా లేకపోవడంతో జోరుగా విక్రయాలు చేసుకుంటున్నారు.


జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు పెడతాం

ఆవులయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

ఇప్పటివరకు జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టు లేదు. అందువల్ల పక్క మద్యాన్ని నియంత్రించడం కష్టంగా ఉంది. అయితే తనిఖీల కోసం సంతమాగులూరు అడ్డరోడ్డులో చెక్‌పోస్టు పెట్టాం. జూలై నుంచి ఇప్పటివరకు ఎస్‌ఈబీ అధికారులు ఎనిమిది కార్లు, 14 బైక్‌లను పట్టుకున్నారు. ఒక్క ఒంగోలులోనే మద్యం తరలిస్తున్న ఆరు కారులను సీజ్‌ చేశారు. ఉదయం 4గంటల నుంచి 6గంటల వరకు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేస్తాం. రెండు రోజుల కిందట కందుకూరులో భారీగా మద్యం పట్టుకున్నాం. బయట మద్యం రాకుండా తనిఖీలు ముమ్మరం చేస్తాం.



Updated Date - 2021-10-04T05:02:57+05:30 IST