పొరుగు మద్యం ఫుల్‌

ABN , First Publish Date - 2021-11-29T04:30:21+05:30 IST

జిల్లాలో పొరుగు మద్యం పరవళ్లు తొక్కుతోంది. చిటికేస్తే క్షణాల్లో బాటిళ్లు మందుబాబుల ముందు ప్రత్యక్షమవుతోంది. కొందరు అక్రమార్కులు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్నవారు ము ఠాలుగా ఏర్పడి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి గుట్టుగా విక్రయిస్తున్నారు.

పొరుగు మద్యం ఫుల్‌
ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఇటీవల పట్టుబడిన తెలంగాణ మద్యం


క్షణాల్లో అడిగిన వారి చెంతకు

చెలరేగుతున్న లిక్కర్‌ మాఫియా

ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా దిగుమతి

ముఠాలుగా ఏర్పడి విక్రయాలు

రైళ్లు, ట్రావెల్స్‌, కంటైనర్లలో తరలింపు

అధికార పార్టీ నేతల సహకారం


ఒంగోలు (క్రైం), నవంబరు 28 : జిల్లాలో పొరుగు మద్యం పరవళ్లు తొక్కుతోంది. చిటికేస్తే క్షణాల్లో బాటిళ్లు మందుబాబుల ముందు ప్రత్యక్షమవుతోంది. కొందరు అక్రమార్కులు, గతంలో మద్యం వ్యాపారంలో ఉన్నవారు ము ఠాలుగా ఏర్పడి  పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి గుట్టుగా విక్రయిస్తున్నారు. వీరికి అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారివైపు చూసేందుకు పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు జంకుతున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు చుక్కలనంటాయి.  మందుబాబులకు అవసరమైన బ్రాండ్లు దొరకడం లేదు. దీనిని ఆసరాగా చేసుకొని కొంతమంది ముఠాలుగా ఏర్పడి పక్క రాష్ర్టాల మద్యం అక్రమ రవాణాకు తెరతీశారు. కొంతమంది అధికార పార్టీని అడ్డుపెట్టుకొని మద్యం విక్రయాలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇందుకు గురువారం ఒంగోలులో పట్టుబడ్డ వారే నిదర్శనం. మద్యం అక్రమ రవాణా ముఠాలు ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా, పాండిచేరి తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు మద్యం దిగుమతి చేస్తున్నారు. 


రకరకాల మార్గాల్లో తరలింపు

మద్యం తరలించేందుకు అక్రమార్కులు రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. కొందరు కంటైనర్లు ఎంపిక చేసుకోగా, మరి కొంతమంది ట్రావెల్స్‌ బస్సులు, రైళ్లలో మద్యం రవాణా చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా కార్లు కొనుగోలు చేసి మద్యం రవాణాకు వినియోగించి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయి.  


ఒంగోలులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

నగరంలో తెలంగాణ నుంచి వచ్చిన మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. కొంతమంది అక్రమ రవాణాను వృత్తిగా మార్చుకున్నారు. అక్రమార్కులకు పలుకుబడి ఉండటంతో వారి జోలికి పోవడానికి పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు భయపడుతున్నారు. కొందరైతే వారి వద్ద వాటాలు తీసుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. 


పల్లెలో నిల్వ చేసి పట్టణాలకు

అక్రమంగా మద్యం తరలిస్తూ పటుబడిన వారు అనేకమంది గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు. ఇటీవల ఒంగోలు రైల్వేస్టేషన్‌ వద్ద పట్టుబడిన వారు తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం చెందిన వారు. అదేవిధంగా గతంలో కార్లలో మద్యం తరలిస్తూ పట్టుబడిన వారు కొండపి, కందుకూరు ప్రాంతాల వారు. ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాల్లో నిల్వలు ఉంచి  ఒంగోలు నగరంతోపాటు, ప్రధాన పట్టణాలకు తెచ్చి విక్రయిస్తున్నారు. 


ఇటీవల పట్టుబడిన మద్యం

ఈనెల 10న చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే కంటైనర్‌లో రూ.3.50 లక్షల విలువైన 6,152 మద్యం బాటిళ్ల గోవా మద్యాన్ని వేటపాలెంలో దించుతుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. మద్యం బాక్సులు ముందు ఉంచి వెనుక భాగం చేపలు, రొయ్యలు ప్యాక్‌ చేసే బాక్సులు పెట్టుకున్నారు. 

 ఈనెల 25 తెల్లవారుజామున చార్మినార్‌ ఎక్స్‌ప్రె్‌సలో తాళ్లూరు మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పది బాక్సుల మద్యంను ఖమ్మం నుంచి తీసుకొస్తూ ఒంగోలులో పోలీసులకు పట్టుబడ్డారు.

రెండు నెలల క్రితం ఒంగోలు మదర్‌థెరిస్సా కాలనీలో భారీగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యంను ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద బైకులు స్వాధీనం చేసుకున్నారు.


నిఘా పటిష్టం చేశాం

ఆవులయ్య, ఈఎస్‌, ఎస్‌ఈబీ

పోలీసు, ఎస్‌ఈబీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.  నిందితుల కదలికలపై నిఘా ఉంచాం.  ఇటీవల రైళ్లు, ట్రావెల్స్‌ బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నాం.

Updated Date - 2021-11-29T04:30:21+05:30 IST