Advertisement

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు

Jan 24 2021 @ 18:04PM

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా 2021 నూతన సంవత్సరంలో జరిగిన 162వ సాహితీ సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిన్నారులు సాహితీ వేముల, సిందూర వేములు “నమో నమో మారుతి” అనే కీర్తనతో సభ‌ను ప్రారంభించారు. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా బలుసు వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా.. “రామాయణ కల్ప వృక్షము - వైశిష్ట్యము ” అన్న అంశంపై మాట్లాడుతూ విశ్వనాథ కవితా గుణాలను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. కాగా.. మధురకవిగా పాఠకుల హృదయాలలో ముద్ర వేసిన బులుసు వెంకటేశ్వర్లు.. సమకాలీన పద్యకవులలో విశిష్ఠమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. ప్రతి పద్యంలోని ప్రతీ పాదంలోనూ కవి విశ్వనాథ ఎంతటి చమత్కారాన్ని, భావుకతను చూపారో బులుసు వెంకటేశ్వర్లు సోదాహరణంగా విశ్లేషించి నిరూపించారు. విశ్వనాథ పద్య పాదాలు పోటాపోటీగా ఒలికించిన రసమాధుర్యాన్ని వడపోసి పట్టి సభికులకందించారు. తెలుగు ప్రజల ఆచార సాంప్రదాయాలను కలగలిపి కవి విశ్వనాథ.. తెలుగు రామాయణంగా ఎలా తీర్చిదిద్దారో వివరించారు. 


ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న“మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి ‘ఆధునిక కవుల ఉక్తులు సూక్తులు’ అన్న శీర్షిక కింద మహాకవుల ప్రసిద్ధ కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేశారు.  ఉపద్రష్ట సత్యం గారు “పద్య సౌగంధం” శీర్షికన కృష్ణ రాయల వారి ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని వివరించారు. రాయల వారు నాటి జనజీవనాన్ని తన కావ్యంలో ఎలా ప్రతిబింబింప చేశారో చెప్పారు. సమకాలీన ప్రజా జీవితాన్ని తమ కావ్యాలలో పొందుపరచిన కొద్ది మంది ప్రాచీన కవులలో ఒక రాజ్యాన్ని ఏలిన మహారాజు ఉండడం విశేషంగా సభికులు గుర్తించే విధంగా ఉపద్రష్ట ప్రసంగించారు.


 

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం.. “మాసానికో మహనీయుడు” అనే శీర్షిక కొనసాగింపుగా జనవరి మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులైన మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి, స్మరణకు తెచ్చారు. లెనిన్ బాబు వేముల హిందూ సౌర్య కాలమానంలోని మకర రాశి( మకర సంక్రాంతి ఈ రాశిలోనే వస్తుంది!), దానికి సరి పోలిన గ్రీకు రాశి కాప్రికార్న్కి ఉన్న పోలికను తేడాలను ఖగోళశాస్త్ర దృష్టి కోణం నుంచి చెప్పారు. బల్లూరి ఉమాదేవి.. సంక్రాంతిపై స్వీయ రచనలను కవితాగానం చేసి రంజింపజేశారు.


ఈ కార్యక్రమానికి 2021వ సంవత్సర అధ్యక్షులు లక్ష్మి పాలేటి ,నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్వవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు ,స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 2020 అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ముఖ్య అతిథి బులుసు వేంకటేశ్వర్లుకు, ప్రార్థనా గీతం పాడిన సాహితి, సింధూరలతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.