టీడీపీలోని ఈ నేతలంతా YSRCPతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారా.. ఇదేం విచిత్రమో.. ఏం జరుగుతుందో..!?

Nov 8 2021 @ 15:05PM

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. వైసీపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారని టీడీపీ నేతలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ సీనియర్లు సోమిరెడ్డి, బీద రవిచంద్ర సైలెంట్‌ అయినట్లుగా ప్రచారం ఎందుకు జరుగుతోంది. తాజా ఇంఛార్జులు స్వలాభం చూసుకుంటున్నారని విమర్శలు ఎందుకొస్తున్నాయి..? వైసీపీలో రెబల్స్‌ రెచ్చిపోతుంటే వాళ్లను టీడీపీ ఎందుకు క్యాష్‌ చేసుకోలేపోయింది. టీడీపీతో పొత్తుకోసం ఆరాటపడ్డ కమ్యూనిస్టులు ఇప్పుడెందుకు దూరమయ్యారు..? అనే విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.

టీడీపీ ఇంఛార్జ్‌ల ఇష్టానుసారమే టికెట్లు!

నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీపై వ్యతిరేకత, అధికారపార్టీలో ధిక్కార స్వరాలను ప్రతిపక్ష టీడీపీ క్యాష్ చేసుకోలేకపోతుందనే టాక్‌ వస్తోంది. మొత్తం 54 డివిజన్లు ఉండగా టీడీపీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నగర ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలు తమ ఇష్టానుసారం టిక్కెట్లు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారంటూ పార్టీ శ్రేణులు, సీనియర్ నేతలు మండిపడుతున్నారు‌. తమ అనుచరులు పోటీచేసే స్థానాల్లో వైసీపీ నుంచి బలం లేని అభ్యర్ధులని నిలబెట్టించి మిగిలిన డివిజన్లలో తక్కువ బలం ఉండేవారికి టిక్కెట్లు ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి.

రూరల్‌లో ఆనంకి పట్టున్నా పట్టించుకోలేదా..?

అబ్దుల్ అజీజ్ గతంలో వైసీపీ నుంవి మేయర్‌గా గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక... అజీజ్ టక్కున పార్టీ మారారు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయం వస్తే, పార్టీ నేతలందర్నీ సంప్రదించి, గెలుపు అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు కేటాయించేవారు. ఈ దఫా సీనియర్ నేతల్ని‌ సైతం పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సొంత బాబాయ్ ఆనం వివేకాపై గతంలో రూరల్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. రూరల్‌లో ఆనంకి మంచి పట్టుందని నేతల విశ్వాసం.

తప్పుకున్నారా..!?

ఈ సారి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆయన ప్రమేయమే లేకుండా చేశారని విమర్శలు వస్తున్నాయి. క్లస్టర్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇస్తున్నట్టు చెప్పడంతో ఆయన తీవ్రంగా హర్ట్ అయి ముఖం చాటేశారు. గతంలో ఆరుగురుని కార్పోరేటర్లగా గెలిపించడంలో కీలకపాత్ర పోశించిన  సీనియర్ నేత కిలారి వెంకటస్వామినాయుడుతో అభ్యర్థుల ఎంపికపై చర్చించకుండా ఆయన్ని పక్కనపెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఆనమోళ్లలతో‌ వీరోచితంగా పోరాడిన సికింధర్‌రెడ్డినీ పరిగణలోకి తీసుకోలేదని టాక్‌ వస్తోంది. మన్నెం పెంచలనాయుడు, సత్య నాగేశ్వరరావు, మండవ రామయ్య వంటి వారంతా కనీస మర్యాద దక్కకపోవడంతో పక్కకి తప్పుకున్నారనే ప్రచారం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది.

చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారా!

టీడీపీలో టిక్కెట్లు పొందిన కొందరు అభ్యర్ధులు, వారి డివిజన్లలో అధికారపార్టీ తరుపున పోటీచేసిన వారితో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు శ్రేణుల నుంచి వస్తున్నాయి. ఎవరిస్థాయిలో వారు తమ లబ్దిప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం... అసలుసిసలు టీడీపీ శ్రేణులకి అస్సలు మింగుడు పడటం లేదు. అందర్నీ కలుపుకుని పోకపోవడంపై సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెబల్స్‌ సంకేతాలు ఇచ్చినా.. టీడీపీ పట్టించుకోలేదా?

వైసీపీలో చాలా మంది రేయింబవళ్ళు పనిచేసిన వారికి టిక్కెట్లు దక్కలేదు. వారంతా ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగుతుంటే.. వారిని తమ పార్టీలోకి తెచ్చుకోవడంపై అస్సలు దృష్టిసారించలేదనే విమర్శలు వస్తున్నాయి. టీడీపీలోకి వస్తామని వైసీపీ రెబెల్స్‌ సంకేతాలు ఇచ్చిన వారితోనూ సంప్రదింపులు‌ జరపలేదనే టాక్‌ వస్తోంది.

వీళ్లంతా పట్టించుకోవడం లేదా..?

మున్సిపోల్స్‌కు సంబంధించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రలు తమకి పట్టిందికానట్టు ఉంటున్నారట. చివరికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రెండు, మూడు రోజులు తిష్ట వేసినా పరిస్థితిలో ఏ మార్పులేదని పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.పొత్తు వ్యవహారంపై చర్చలు సాగించిన సీపీఎం పది సీట్లు వరకు డిమాండ్ చేయడంతో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోలేకపోయింది.

ఇంఛార్జ్‌ల ఎత్తుగడ.. ?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డి , సిటీ నుంచి నారాయణ పోటీకి దిగుతారనే ఆలోచనతో ప్రస్తుత ఇన్‌ఛార్జ్‌లు అజీజ్, కోటంరెడ్డిలు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరైతే.. ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్యే ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో మామూళ్లు వసూలు చేసుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అధినేత చంద్రబాబు ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు.. నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి ఈ ఎన్నికలు టీడీపీకి ఎలాంటి గుణపాఠాలు చెబుతాయోనని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నారు. ఏం జరుగుతుందో.. ఫలితాలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే అంటున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.