నేను

ABN , First Publish Date - 2022-05-30T06:03:07+05:30 IST

కంసాలి తీరైన రంగురాళ్ళను సవనంతో సున్నితంగా తీసుకొని బంగారు నెక్లెస్‌ డిజైన్‌లో పొదిగినట్టు నేను ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని...

నేను

కంసాలి తీరైన రంగురాళ్ళను

సవనంతో సున్నితంగా తీసుకొని

బంగారు నెక్లెస్‌ డిజైన్‌లో పొదిగినట్టు

నేను ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని

కవిత్వంలో ఒదుతాను


కాని నా కవిత ఆభరణం కాదు

జనన మరణాలు

సుఖసంతోషాలు వెరసి

ప్రజలపరం చేసిన భరణమే కవిత


అంబాడీ అంబాడి

చిన్నపిల్లలు మెల్లమెల్లగా

గోడలు పట్టుకొని లేచి

వడ్లోల్ల నారాయణ తాత చేసి ఇచ్చిన

మూడు గీరల కట్టె బండిని పట్టుకొని 

అడుగులు వేసినట్టు

అప్పుడప్పుడు తల్లి అందించిన

చిటికెన వేలు ఆసరాతో

తప్పటడుగులు వేయని

నడక తర్ఫీదు పొందినట్టు

అంతా వైయక్తికంలోకి తప్పిపోకుండా

ఊరుఊరంతా తిప్పి కవితను

ఒక జానపద పాట ఊటలా

శిశిరం నుంచి హేమంత వసంతంలోకి

తీవ్ర వడగాడ్పుల నుంచి

తొలకరి వానలోకి

సకల జనుల ఆశగా ఆశ్వాసంగా నడిపిస్తాను


ఎక్కడో ఒకచోట

చమక్కున మెరిసే మెరుపు కాదు కదా

కన్నీటి చెమ్మ భూకంప కవిత జన్మ స్థానం


ప్రభుత్వం నడిపే

బడి విద్యార్థి

నిరుపేద పిల్లవాడి

రెండు పిర్రల మీద చినిగిన నిక్కరును

మేర సలాకల భూమయ్య కుట్టే

రెండు నిండు చత్వారం చందమామల్లాటి

మాసికాల కళ్ళ అద్దాలు నుంచి చూడడమే 

              గోసను నమోదు చేయడమే

నా కవిత సారాంశ వర్ష పరవశం


ఎండాకాలం

కోసెడు దూరం నుంచి

కడివెడు నీళ్లను

నల్లని కాయలు కాసిన భుజం మీద

మోసుకు వచ్చే ఆదివాసీ మహిళ 

ముళ్ళు విరిగిన నెత్తుటి

తడి పాదాల పాదముద్రలో రౌద్రంగా


వెల్డింగ్‌ షాపు ముందు

ఉదయం ఐస్కాంతంతో

ఇనుప ముక్కల రజనును

పోగు చేసుకుంటున్నది

రోడ్డు వెంట చెత్తకుప్పల్లో

ప్లాస్టిక్‌ సామాన్లను ఏరుకుంటున్నది


రాజకీయ నాయకుడి సభలో కట్టి

పడేసిన బ్యానరే నా గూడు


ప్రజాధనస్వామ్యం ఎంత దూరము వెళ్లిందంటే

ప్లాస్టిక్‌ కర్మాగారాలకు

ఎడాపెడా అనుమతులిస్తూ

మళ్లీ అదే వాడవద్దని

నిషేధం జుర్మానా విధిస్తున్నంతగా


ఇంటిగదుల్లో చెత్తను నింపి

నదులను ప్రక్షాళన చేస్తుంటుంది


సైబర్‌ నెట్‌ వలలో

నికరంగా చిక్కుకుని

గిలగిలా కొట్టుమిట్టాడుతున్నది

సిగ్నల్స్‌ అందని చోట

తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన

పిల్లాడిలా ఏడుస్తూ సంభాషిస్తున్నది

అచ్చంగా స్వచ్ఛంగా

నేనే నేనే నేనే కాకుండా ఎవరు ఉంటారు చెప్పు

జూకంటి జగన్నాథం

94410 78095


Updated Date - 2022-05-30T06:03:07+05:30 IST