Nepal: ఆ విమానం కూలిపోయింది: నిర్ధారించిన అధికారులు

ABN , First Publish Date - 2022-05-29T22:34:16+05:30 IST

నలుగురు భారతీయులు సహా 22 మంది ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు

Nepal: ఆ విమానం కూలిపోయింది: నిర్ధారించిన అధికారులు

న్యూఢిల్లీ: నలుగురు భారతీయులు సహా 22 మందితో ప్రయాణిస్తూ గల్లంతైన నేపాల్ తారా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. పర్యాటక నగరమైన పోఖరా నుంచి ఈ ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం 15 నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ చిన్న విమానం మిస్సయిన వెంటనే సెర్చ్ ఆపరేషన్ కోసం రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.


తాజాగా ఈ విమాన శకలాలను కోవాంగ్ గ్రామంలో గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మనపతి హిమాల్‌ కొండచరియల కింద లాంచే నది ఒడ్డున విమానం కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ ఆర్మీ రోడ్డు, వాయు మార్గాల్లో ఘటనా స్థలానికి బయలుదేరినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు.


విమానంలో ముంబైకి చెందిన అశోక్ కుమార్ త్రిపాఠి, ధనుష్ త్రిపాఠి, రితికా త్రిపాఠి, వైభవి త్రిపాఠిలతో పాటు ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలి ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఉదయం 9.55 గంటలకు టేకాఫ్ అయిన విమానం 10.15 గంటలకు జోమ్సోమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. విమాన శకాలను గుర్తించినప్పటికీ అందులోని ప్రయాణికుల సంగతేంటన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-05-29T22:34:16+05:30 IST