భారత్‌కు రైలులో ఇతర దేశాలవారు ప్రయాణించేందుకు అనుమతి లేదు : నేపాల్

ABN , First Publish Date - 2021-11-20T22:34:53+05:30 IST

నేపాలీలు, భారతీయులు మినహా ఇతర దేశాలవారు

భారత్‌కు రైలులో ఇతర దేశాలవారు ప్రయాణించేందుకు అనుమతి లేదు : నేపాల్

ఖాట్మండు : నేపాలీలు, భారతీయులు మినహా ఇతర దేశాలవారు కుర్తా-జయ నగర్ రైల్ రోడ్ ద్వారా భారత దేశానికి ప్రయాణించేందుకు అనుమతించబోమని నేపాల్ ప్రకటించింది. భారత దేశం భద్రతా సంబంధమైన ఆందోళన వ్యక్తం చేసినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ రైల్వే శాఖ తెలిపింది. 


నేపాల్ రైల్వే శాఖ డైరెక్టర్ జనరల్ దీపక్ కుమార్ భట్టారాయ్ మాట్లాడుతూ, క్రాస్ బోర్డర్ రైల్వే ఆపరేషన్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖరారు సమయంలో ఈ అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఖరారవడంలో జరిగిన ఆలస్యానికి కారణం భద్రత పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేయడమేనని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దులో భద్రత అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఉగ్రవాదులు, నేరగాళ్ళు చొరబడే అవకాశం ఉందని భారత్‌ అభిప్రాయపడిందన్నారు. ఇరు దేశాలు అనేక సంవత్సరాల నుంచి క్రాస్ బోర్డర్ నేరాల వల్ల ఇబ్బందులు పడుతున్నాయన్నారు. భారత దేశానికి వెళ్ళే ప్రయాణికుల వివరాలను ఆ దేశ అధికారులకు తెలియజేస్తామని, తద్వారా ప్రయాణికుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. 


Updated Date - 2021-11-20T22:34:53+05:30 IST