నేతాజీ నీడలు

ABN , First Publish Date - 2021-01-26T07:01:23+05:30 IST

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అవాంఛనీయమైనవి...

నేతాజీ నీడలు

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ 125వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అవాంఛనీయమైనవి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్‌ నినాదాలు చేయడంతో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను పిలిచి మరీ అవమానించారంటూ ఆగ్రహించారు. విక్టోరియా మెమోరియల్‌ హాల్‌లో జరుగుతున్న అధికారిక కార్యక్రమాన్ని సైతం బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న ఆరోపణతో ఆమె ప్రసంగించకుండానే కూచున్నారు. ఈ జయంతి వేడుకలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తే, రాష్ట్రంలోని తృణమూల్‌ ప్రభుత్వం దేశ్‌నాయక్‌ దివస్‌గా పాటించడం తెలిసిందే. నేతాజీ ఘన వారసత్వాన్ని ఆపాదించుకుంటున్న ఉభయపక్షాలూ ఈ జయంతి వేడుకల ఘట్టాన్ని కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కుదించడం సముచితంగా లేదు.


ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగం సైతం పరాక్రమం చుట్టూనే సాగింది. నేతాజీ ఏ శౌర్యప్రతాపాలనూ, పరాక్రమాన్నీ కాంక్షించారో అవి తమకు ఉన్నాయని పరోక్షంగా గుర్తుచేయడం మోదీ ఉద్దేశం. నియంత్రణ రేఖనుంచి వాస్తవాధీనరేఖ వరకూ (ఎల్‌వోసీ టు ఎల్‌ఏసీ) అత్యంత బలంగా ఉన్న భారతదేశం అచ్చం నేతాజీ కోరుకున్న రీతిలోనే ఆయన అడుగుజాడల్లోనే నడుస్తోందన్నారు మోదీ. దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడల్లా మనం దీటుగా జవాబివ్వడం చూసి నేతాజీ కచ్చితంగా మురిసేవారన్న వ్యాఖ్యలో సర్జికల్‌ దాడుల వంటివి గుర్తుచేయడం ఉంది. రాఫెల్‌, తేజస్‌ల చేరికతో భారత్‌ మరింత బలోపేతమైన విషయాన్నీ గుర్తుచేశారు. నేతాజీ ఆత్మనిర్భర భారతాన్ని కాంక్షించారనీ, ఆ లక్ష్య సాధనలో బెంగాల్‌ ప్రశస్థమైన పాత్ర పోషించాలనీ అన్నారు మోదీ. దీనికి బీజేపీ ఎన్నికల నినాదం ‘సోనార్‌ బంగ్లా’ను జోడించి నేతాజీ ఆకాంక్షల్లో బంగారు బెంగాల్‌ ఒకటిగా ప్రస్తావించారు. లక్ష్యాన్ని సాధించేవరకూ నేతాజీ ఎలాగ విశ్రమించలేదో, వైభవోపేతమైన గతాన్ని తిరిగి పునరుద్ధరించుకొనేవరకూ బెంగాలీలంతా విశ్రమించకూడదన్నారు మోదీ. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఏ) సభ్యులు రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొంటారనడం, మూడేళ్ళక్రితమే అండమాన్‌లో ఒక దీవికి నేతాజీ పేరుపెట్టిన విషయాన్ని గుర్తుచేయడం, బెంగాలీల్లో నేతాజీ మీద ఉన్న గౌరవాభిమానాలను సానుకూలంగా మలుచుకొనే ప్రయత్నమే.


రాష్ట్రపతి ఆవిష్కరించిన నేతాజీ చిత్రపటం కూడా వివాదానికి కేంద్రబిందువుగా మారిపోయింది. అందులో ఉన్నది అసలు నేతాజీ కాదనీ, అది బెంగాలీ సినిమా ‘గుమ్నామీ’లో ఆ పాత్ర ధరించిన ప్రసేన్‌జిత్‌ చటర్జీదని ఓ వివాదం రేగింది. దేవుడా రక్షించు ఈ దేశాన్ని అంటూ తృణమూల్‌ నాయకులు దీనిని వివాదం చేస్తుంటే, ఈ చిత్రాన్ని వేయడానికి తాను నేరుగా నేతాజీ వారసులనుంచే అసలు చిత్రాన్ని తెప్పించుకున్నానని చిత్రకారుడు వివరణ ఇచ్చారు. ఇక, నేతాజీ బాటలో ఐక్యభారతాన్ని సాధించాలంటే దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం కాకూడదనీ, దేశం నలుదిక్కులా రొటేషన్‌ విధానంలో నాలుగు రాజధానులుండాలనీ, నాలుగుచోట్లా పార్లమెంటు సమావేశాలు జరగాలనీ మమతాబెనర్జీ వ్యాఖ్యానించడం మోదీని ఇరకాటంలో పెట్టేందుకే. మరో మూడునెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో, నేతాజీ పేరు వాడుకోవడంలో, వారసత్వాన్ని చాటుకోవడంలో రెండు పార్టీలూ మరింత పోటీపడతాయనడంలో సందేహంలేదు. నేతాజీ మరణం చుట్టూ అల్లుకున్న సందేహాలు, వివాదాల పరిష్కారానికి నెహ్రూ కాలంనుంచే అనేక కమిషన్లు ఏర్పడ్డా అవి కొత్తగా నిర్థారించిందేమీ లేకపోయింది. అయినా, నేతాజీ ప్రమాద మరణం చుట్టూ రాజకీయం మాత్రం సాగుతోంది. ఐదేళ్ళక్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ, మమతలు పోటాపోటీగా రహస్య ఫైళ్ళను విడుదల చేశారు. నేతాజీ బంధువులను విందుకు పిలిచి మరీ మోదీ వారిచేతిలో మరికొన్ని ఫైళ్ళు పెట్టారు. రహస్యఫైళ్ళను డీ క్లాసిఫై చేయించిన ఘనత నరేంద్రమోదీదేనని బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటున్నది. కాంగ్రెస్‌తోనూ గాంధీ, నెహ్రూలతోనూ విభేదించిన వారిని తమ ఖాతాలో వేసుకోవడంలో భాగంగా బెంగాల్‌ నుంచి నేతాజీని బీజేపీ ఎంచుకున్నది. ఆయనను పరాక్రమానికి మాత్రమే పరిమితం చేసి తన ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రతీ ఎన్నికల ముందూ నేతాజీమీద నాయకులు ప్రదర్శిస్తున్న ప్రేమను బెంగాలీలు గమనిస్తూనే ఉన్నారు.

Updated Date - 2021-01-26T07:01:23+05:30 IST