నేతలు పాసయ్యేనా?

ABN , First Publish Date - 2020-12-03T04:55:52+05:30 IST

నేతలు పాసయ్యేనా?

నేతలు పాసయ్యేనా?

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన జిల్లా నేతలు
  • వారికి కేటాయించిన ప్రాంతాల్లో  ఫలితాలపై ఉత్కంఠ
  • విజయావకాశాలపై ఎవరి ధీమా వారిదే..
  • ఫలితాలు బేరీజు వేసుకునే పనిలో నిమగ్నం
  • అధికార పార్టీకి అగ్నిపరీక్ష... బీజేపీ, కాంగ్రెస్‌కు అదృష్ట పరీక్ష 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హోరాహోరీ ప్రచారంతో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ఎంతో ఆశపడ్డా చివరకు ఓటర్లు నిరాశ పరిచారు. నువ్వా... నేనా... అన్నట్లుగా ఎంతో ఉత్కంఠగా కొనసాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడం అందరినీ కలవరపరుస్తోంది. తక్కువ పోలింగ్‌ కావడం ఎవరికి  అనుకూలంగా మారబోతోందనేది తెలియక రాజకీయ పార్టీల నేతలు తలపట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించినఅధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు సర్వశక్తులొడ్డి పోరాడారు. ప్రచార సభలకు హాజరైన ప్రజలను చూసి మురిసిపోయారు.  తక్కువ పోలింగ్‌ శాతం నమోదవడంతో ఫలితం ఎలా ఉండబోతోందనే భయం డివిజన్‌ ఇన్‌చార్జిల్లో నెలకొంది. పార్టీలు తమపై ఉంచిన నమ్మకాన్ని మరింత పెంపొందించుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలుతమకు కలిసి వస్తాయని ఆయా పార్టీల నేతలు భావించారు. జిల్లాకు చెందిన అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీ నాయకులు గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ అధిష్టానం జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లలోఒక్కొక్కరిని ఒక్కో డివిజన్‌కు ఇన్‌చార్జిగా నియమించింది. జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి, టీఎస్‌ఈడబ్ల్యుఐడీసీ చైర్మెన్‌ నాగేందర్‌గౌడ్‌లకు హఫీజ్‌పేట డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించగా, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌  మెతుకు ఆనంద్‌  గుడిమల్కాపూర్‌ డివిజన్‌, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మన్సూరాబాద్‌ డివిజన్‌, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రాజేంద్రనగర్‌ డివిజన్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అత్తాపూర్‌ డివిజన్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య విజయనగర్‌ కాలనీ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా బాధ్యతలు నిర్వహించారు. తమకు కేటాయించిన డివిజన్లలో వారు తమ నియోజకవర్గం ముఖ్య ప్రజా ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ చైర్మెన్లు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్ల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఓట్లు వస్తాయనుకున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఎక్కువగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లతో పాటు అత్తాపూర్‌ డివిజన్‌లోనూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే, బీజేపీ విషయానికి వస్తే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి బి.జనార్ధన్‌రెడ్డి తమ పరిధిలోకి వచ్చే డివిజన్లలో ప్రచారం చేయగా, జిల్లాకు చెందిన బీజేపీముఖ్య నేతలు ఎక్కువగా కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని డివిజన్లలోనే ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆరుడివిజన్ల పరిధిలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కరణం ప్రహ్లాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తొడిగల సదానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.శివరాజ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు యు.రమేష్‌కుమార్‌, పాండుగౌడ్‌, లాహోటీ, పోకల సతీష్‌ తదితరులు ప్రచారం చేయగా, జుబ్లీహిల్స్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి తరపున పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోకట్‌ మాధవరెడ్డి ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. 


 అంతుచిక్కని ఓటరు నాడి... నేతల్లో ఆందోళన

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన జిల్లా నేతలను పట్టి పీడిస్తోంది. పైకి తాము ప్రచారం చేసిన అభ్యర్థుల విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం వారిలో గుబులు వ్యక్తమవుతోంది. ఆశించిన స్థాయిలో పోలింగ్‌ జరగక పోవడంతో ఓటర్ల నాడి అంతు చిక్కక ఫలితాలను బేరీజు వేసుకునే పనిలో నిగమ్నమయ్యారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. ఈ ఎన్నికలు అధికార పార్టీ నేతలకు అగ్నిపరీక్షగా మారగా, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే కొలమానంగా భావిస్తున్నారు. తాము ప్రచారం చేసిన డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలు ధీమా వ ్యక్తం చేస్తుండగా, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు కూడా అదే ధీమాతో ఉన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు, ఎవరిని దెబ్బతీశారనేది తెలియాలంటే ఈనెల 4వ తేదీ, శుక్రవారం వరకు ఆగాల్సిందే. 


Updated Date - 2020-12-03T04:55:52+05:30 IST