చేనేత కార్మికులకు అండగా నేతన్న బీమా

ABN , First Publish Date - 2022-08-08T06:27:17+05:30 IST

చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

చేనేత కార్మికులకు అండగా నేతన్న బీమా
జాతీయ చేనేత దినోత్సవంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 -  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకాన్ని వర్తింపజేయనున్నట్లు కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఆదివారం చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన 8వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో రైతు బీమా అమలు చేశామన్నారు. రైతు బీమా లాగానే చేనేత కార్మికులకు చేనేత బీమా వర్తింపజేస్తామన్నారు. నేత కార్మికులు 60 సంవత్సరాలు దాటిన వారే ఎక్కువగా ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. ఖాదీ స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక రకమైన ఊపిరి ఇచ్చిన నినాదమని, జాతీయ ఉద్యమానికి చేనేత పరిశ్రమకు విడదీయరాని బంధం ఉందన్నారు. జాతీయ పథకమైన త్రివర్ణ పథకంలోనూ మగ్గానికి ఉపసాధనమైన రాట్నాన్ని చిహ్నంగా ఉంచాన్నారు. నేత కార్మికులకు ఒకేచోట కూర్చుని పనిచేయడం మామూలు విషయం కాదన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా కార్మికుల శ్రమ వారి విలువ, ప్రత్యేకత కలిగి ఉంటుందన్నారు. ఎంతో సృజనాత్మకతతో నేసిన హ్యాండ్లూమ్‌ చీరలకు ఎంతో విలువ ఉందని అన్నారు. మేయర్‌ వై సునీల్‌రావు మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. జిల్లాలో 14,070 మంది చేనేత కార్మికులు, 720 ఉన్నారని తెలిపారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ మాట్లాడుతూ పేదల బతుకులు బాగు చేసే మహానేత కేసీఆర్‌ అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు నేతన్నలు వలసలు వెళ్లేవారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలసలు తగ్గిపోయాయన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌ వద్ద జెండా ఊపి చేనేత దినోత్సవ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ తెలంగాణ చౌక్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పలువురు నేత కార్మికులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, చేనేత జౌళిశాఖ సహా సంచాలకులు సంపత్‌, స్ర్తీ శిశు సంక్షేమాధికారి పద్మావతి, పద్మశాలి సంఘం నాయకులు వాసాల శ్రీనివాస్‌, సత్యనారాయణ, ఉల్లాల కృష్ణహరి, తవుటు మురళి, గడ్డం వెంకటేశం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:27:17+05:30 IST