నేటి నుంచే కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-18T05:04:05+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

నేటి నుంచే కర్ఫ్యూ

రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు అమలు

మాస్క్‌ ధరించకుంటే అపరాధ రుసుం

పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు అనుమతి తప్పనిసరి

ఇండోర్‌లో 100, అవుట్‌డోర్‌లో 200 మందికే పర్మిషన్‌


నెల్లూరు(క్రైం) జనవరి 17:  జిల్లాలో కరోనా కేసులు   రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచి  ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.  రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ అమల్లోకి రానున్నది. ప్రజలు మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వస్తే అధికారులు అపరాధరుసుం విధించనున్నారు. షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సి ఉంది. మాస్క్‌లు లేకుండా షాపింగ్‌ మాల్స్‌కు, దుకాణాలకు వినియోగదారులను అనుమతిస్తే రూ.10వేల వరకు జరిమా నా విధించనున్నారు. మంగళవారం నుంచి సినిమాహాళ్లల్లో సగం  సీట్లకు మాత్రమే అనుమతివ్వనున్నారు. రాత్రి సెకండ్‌షోను రద్దు చేశారు. వివాహాలు, ఇతర వేడుకలకు తప్పనిసరిగా ఆ ప్రాంత ఎమ్మార్వో వద్ద నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇన్‌డోర్‌లో చేసే వేడుకలకు వందమందిని, అవుట్‌డోర్‌లో జరిగే కార్యక్రమాలకు 200 మందిని మాత్రమే అనుమతించనున్నారు. రాత్రి కర్ఫ్యూ సమయంలో వైద్య సమస్యలు, ప్రభుత్వ సంబంధ కార్యక్రమాలకు హాజరయ్యేవారు అనుమతి, ఆధార పత్రంతో మాత్రమే బయటకు రావాల్సి ఉంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గ్రామాల్లో, పట్టణ, నగర ప్రాంతాల్లోని కూడళ్లల్లో కానీ, దుకాణ సముదాయాల్లో కానీ  ప్రజలు గుమిగూడరాదు. ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్‌ను వినియోగించాలి. వీటితోపాటు సామాజిక దూరం పాటించాల్సి ఉంది.

                    

జిల్లాలో 261 కరోనా కేసులు

నెల్లూరు(వైద్యం) జనవరి 17 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 261 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 1,49,416కి చేరింది. కరోనా కారణంగా ఎవరూ మృత్యువాత పడలేదు.  కరోనా నుంచి కోలుకున్న 13 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. జిల్లా వాప్తంగా మొత్తం 18,530 మందికి వాక్సిన్‌ వేశారు.  96 కేంద్రాల ద్వారా జరిగిన వ్యాక్సినేషన్‌లో 308 మంది వైద్య సిబ్బందిని పాల్గొన్నారు.  

 

కొవిడ్‌తో  ఎవరూ మరణించరాదు.. 

రానున్న రెండు,మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలి

అధికారుల సమీక్షలో మంత్రి అనిల్‌


నెల్లూరు(వైద్యం) జనవరి 17 : కొవిడ్‌తో ఎవరూ మరణించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌  తెలిపారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంతో కొవిడ్‌ నియంత్రణపై టాస్క్‌ఫోర్సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒమైక్రాన్‌ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామని చెప్పారు.  ప్రస్తుతం కరోనా కేసులు పెరుగు తున్నా, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.  రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. కలెక్టర్‌ కేవీఎస్‌. చక్రధర్‌బాబు మాట్లాడుతూ కొవిడ్‌ నియంత్రణకు చేపట్టిన కార్యక్రమాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో మూడో విడత కరోనా ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. జిల్లాలో కరోనా కేసుల్లో రికవరీ రేటు 97.97 శాతం ఉందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జేసీ హరేందిరా ప్రసాద్‌, మున్పిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఏఎస్పీ వెంకటరత్నం. డీఎఫ్‌వో షణ్ముఖ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ రోజ్‌మాండ్‌, డీఆర్‌వో చిన్న ఓబులేసు, జడ్పీ సీఈవో శ్రీనివాసరావ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, కొవిడ్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.   



Updated Date - 2022-01-18T05:04:05+05:30 IST