కరోనా వస్తే.. ప్రజలు గాంధీకి ప్రజాప్రతినిధులేమో ప్రైవేటుకు

ABN , First Publish Date - 2020-07-07T07:44:24+05:30 IST

ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు సర్కారీ వైద్య సేవలపై నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం కలిగించాల్సిన వీరే కరోనా సోకినప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు

కరోనా వస్తే.. ప్రజలు గాంధీకి ప్రజాప్రతినిధులేమో ప్రైవేటుకు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు సర్కారీ వైద్య సేవలపై నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం కలిగించాల్సిన వీరే కరోనా సోకినప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్నారు.  దీనిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రభుత్వాస్పత్రులకే వెళ్లేవారని గుర్తుచేస్తున్నారు. కానీ, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రైవేటుకే జైకొడుతున్నారు. తొలుత జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పాజిటివ్‌  నిర్ధారణ అయింది. ఆయన రాజధానిలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆయన సతీమణి కూడా హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఏ ఆస్పత్రిలోనూ చేరకుండా.. హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు చికిత్స తీసుకున్న ఆస్పత్రి వైద్యుడి ద్వారా సలహాలు, సూచనలు తీసుకుని రికవరీ అయ్యారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. జూబ్లీహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కూడా హోంమంత్రి చేరిన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి కూడా వైరస్‌ బారినపడ్డారు. ఆమె ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులెవ్వరూ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్లకపోవడంతో వారి వైద్య వ్యవస్థపై వారికే నమ్మకం లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. వారికీ ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-07T07:44:24+05:30 IST