రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత.. కస్టమర్ వేసిన లెక్క చూసి.. అవాక్కవుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-08-31T20:01:16+05:30 IST

ఒక రెస్టారెంట్లో భోజనం చేసిన వ్యక్తి.. తనకు వచ్చిన బిల్‌పై ఒక లెక్కేశాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత.. కస్టమర్ వేసిన లెక్క చూసి.. అవాక్కవుతున్న నెటిజన్లు

ఇంటర్నెట్ డెస్క్: ఒక రెస్టారెంట్లో భోజనం చేసిన వ్యక్తి.. తనకు వచ్చిన బిల్‌పై ఒక లెక్కేశాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిపోయింది. దానికితోడు నెటిజన్లు రెండు  వర్గాలుగా విడిపోయి అతను చేసిన పని కరెక్టా? కాదా? అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఆ వీడియోలో.. కస్టమర్ ఏం రాశాడో తెలుసా? తన వద్దకు వచ్చిన బిల్లులో ‘టిప్’ అని ఉన్న దాని ఎదురుగా.. బిల్లు మొత్తాన్ని మైనస్ చేసేశాడు!


ఆంటొని కొరియా అనే కస్టమర్.. ఒక రెస్టారెంటుకు వెళ్లాడు. అక్కడ భోజనం చేసిన తర్వాత అతనికి 32.49 డాలర్ల బిల్లు వేశారు. ఆ బిల్లుపై ‘టిప్’ అనే సెక్షన్ ఉంది. ఆ సెక్షన్‌లో ‘-32.49’ డాలర్లు వేసిన ఆంటొని.. మొత్తం బిల్లును జీరో చేసేశాడు. ఎందుకంటే.. తను ఆర్డర్ ఇచ్చిన ఆహారానికి బదులు వేరేది వచ్చిందని, గంటల తరబడి వెయిట్ చేశానని, వెయిటర్ దురుసుగా ప్రవర్తించారని ఆ వీడియోలో ఆంటొని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అతను అలా బిల్లు తగ్గించడాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆహారం తప్పుగా వస్తే వెయిటర్‌కు చెప్పారా? తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


మరికొందరేమో ‘‘ఇలాంటి పప్పులుడకవు బాస్. బిల్లు కట్టాల్సిందే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ మాత్రం ‘‘గతంలో వెయిటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఇది బాధగా అనిపిస్తోంది. ఏమైనా సమస్యలు ఉన్నా నేను ఎప్పుడూ టిప్స్ ఇస్తాను. మనం మనుషులం, తప్పులు జరుగుతాయి’’ అని ఆమె అన్నారు. అయితే ఈ స్పందనలపై రియాక్ట్ అయిన ఆంటొనీ కూడా అసలు విషయం చెప్పాడు. ‘‘నేను నా బిల్లులో 20శాతాన్ని ఎప్పుడూ టిప్‌గా ఇస్తా. ఆ డిన్నర్‌కి కూడా ఇచ్చా’’ అని వివరించాడు. తాను వేసిన జోక్ సగం మందికి అర్థమైందని, మిగతా వారికి అర్థం కాలేదని అన్నాడు.


అయితే ఆంటొనీ షేర్ చేసిన వీడియోలో అతను కస్టమర్ కాపీ బిల్‌పై ఈ లెక్క చేశాడు. అలాగే బిల్లు ఖరీదు మొత్తాన్ని జీరో చేసేస్తే ఏ రెస్టారెంటు కూడా ఒప్పుకోదు. ఈ విషయం అర్థంకాని వాళ్లే సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారని కొందరు చెప్తున్నారు.

Updated Date - 2021-08-31T20:01:16+05:30 IST