ఎప్పటికో!

ABN , First Publish Date - 2021-05-10T05:01:58+05:30 IST

ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల(ఈఎంఆర్‌ఎస్‌) భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం లేకుండా పనులు జరుగుతున్నాయి. పనులు వేగంగా పూర్తి చేయించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ను గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రభాకర్‌శ్రీకాంత్‌ ఆదేశించారు.

ఎప్పటికో!
పాచిపెంట: జీఎన్‌ పేటలో ప్రారంభం కాని భవన నిర్మాణం

నత్తనడకన ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు

ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ముందుకు సాగని పనులు

(పార్వతీపురం)

ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల(ఈఎంఆర్‌ఎస్‌) భవన నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం లేకుండా పనులు జరుగుతున్నాయి. పనులు వేగంగా పూర్తి చేయించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ను గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ప్రభాకర్‌శ్రీకాంత్‌ ఆదేశించారు. అనంతరం పీవో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కదలిక లేదు. కురుపాం కేంద్రంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు గుడ్డిలో మెల్ల నయం అన్న చందంగా జరుగుతున్నాయి. మక్కువ మండలం అనసభద్ర, పాచిపెంట మండలం జీఎన్‌ పేటలో మాత్రం పనుల్లో కదలిక లేదు. ఇంజినీరింగ్‌ అధికారులు జీఎన్‌ పేట, అనసభద్ర పాఠశాలల భవన నిర్మాణాలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించడం లేదు. 

కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పాఠశాలల భవన నిర్మాణాలు వేగంగా పూర్తవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశించారు. సుమారు ఆరు నెలల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఆది నుంచి వేగం లేదు.  మొక్కుబడిగా చేస్తున్నారు. వారం రోజులు అటు ఇటులో మూడింటి నిర్మాణ పనులు ప్రారంభించగా ఒక్కచోట మాత్రమే కాస్త జరుగుతున్నాయి. కురుపాం పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తే మిగిలిన  నిర్మాణాలు ఎప్పుడు పూర్తిచేసినా అడిగే వారే ఉండరన్నది గిరిజన ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్ల ఆలోచనగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  జీఎన్‌ పేటలో నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబంధించి రూ.12 కోట్లు ఉన్నా ఒక్క రూపాయి కూడా బిల్లులు చెల్లించలేదంటున్నారు. కొన్ని నెలలుగా భూమి లెవెలింగ్‌ పనులే సాగుతున్నాయి. అనసభద్రలో భవన నిర్మాణానికి కూడా రూ.12 కోట్లు ఉన్నప్పటికీ సుమారు రూ.75 లక్షల విలువైన పనులు మాత్రమే చేపట్టారు. ఈ రెండు భవన నిర్మాణాలు ఎప్పటికి పూర్తి చేస్తారో గిరిజన ఇంజినీరింగ్‌ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. కరోనా వైరస్‌ కారణంగా పనులు జోరుగా చేపట్టలేని పరిస్థితి ఉంది. వచ్చేది వర్షాకాలం కావడంతో భవన నిర్మాణాలు పూర్తిచేయడానికి చాలా సమయం పట్టవచ్చు. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనుల్లో ఆరు నెలలు భూమి లెవెలింగ్‌కే పరిమితమయ్యారు. మిగిలిన 18 నెలల్లో పాఠశాల భవన నిర్మాణాలతో పాటు సిబ్బంది భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారో గిరిజన ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లకే తెలియాలి.


పూర్తి చేసేందుకు చర్యలు

జీఎన్‌పేట, అనసభద్రలలో ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. అనసభద్రలో రూ.75 లక్షల విలువైన పనులు జరగడం వాస్తవమే. జీఎన్‌ పేటలో భూమి లెవెలింగ్‌ పనులు పూర్తయ్యాయి.

- మణిరాజు, డీఈఈ, టీడబ్ల్యూ, సాలూరు సబ్‌ డివిజన్‌



Updated Date - 2021-05-10T05:01:58+05:30 IST