
జ్ఞానంతో కూడిన ఆచార్య చాణక్య విధానాలు సమాజంలో, కుటుంబంలో మనిషి ఏ విధంగా జీవించాలో తెలియజేస్తాయి. ఆచార్య చాణక్య.. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం సమాజానికి సంబంధించిన అనేక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. దీనిని చాణక్య నీతిలో పొందుపరిచారు. ఈ విధానాలు సంక్షోభ సమయాల్లో మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. సరైన సలహాలను అందిస్తాయి. ఎవరైనా సరే ఇతరులతో ప్రస్తావించకూడని మూడు వ్యక్తిగత విషయాల గురించి ఆచార్య చాణక్య తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఈ మూడు విషయాలను నిరంతరం గుర్తుంచుకోవాలని, వాటిని ఇతరులకు చెబితే జీవితం నాశనం అవుతుందని చాణక్య హెచ్చరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాపారంలో దెబ్బతినడం
ఎవరైనా తమ వ్యాపారంలో డబ్బు నష్టపోతే, దానిని ఇతరుల ముందు ప్రస్తావించకూడదు. ఇలా చేస్తే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని బలహీనులుగా పరిగణించి మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. మిమ్మల్ని పనికిరానివారుగా భావించి దూరం పెడతారు.అందుకే వ్యాపారంలో మీకు ఎదురైన నష్టం గురించి ఎవరికీ చెప్పకండి. మీ ఆర్థిక స్థితిని ఎవరి దగ్గరా ప్రస్తావించకండి.
భార్యలో చెడు గుణాలు
ఎవరైనా సరే తన భార్యలోని చెడు లక్షణాలను ఎవరిదగ్గరా ప్రస్తావించకూడదు. ఆమె మిమ్మల్ని అవమాన పరిచిన విషయాలను ఇతరుల ముందు చెప్పకూడదు. ఇలా చేస్తే సదరు వ్యక్తి సమాజంలో ప్రతిష్టను కోల్పోయే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితం నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది.
ఎవరి చేతిలోనైనా మోసపోవడం
ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ విషయాన్ని ఇతరులతో చెప్పకండి. అలా చేస్తే మీ చుట్టుపక్కలవారు మిమ్మల్ని బలహీన మనస్తత్వం కలిగినవారిగా భావించి మోసం చేయవచ్చు, కాబట్టి అలాంటి వాటిని ఇతరుల దగ్గర ప్రస్తావిస్తూ మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి. ఇది సమాజంలో మీ స్థానాన్ని దిగజారుస్తుంది. మీ చుట్టుపక్కల వారు మీ మాటలను లెక్కలోకి తీసుకోరు.