దేశానికి కొత్త అజెండా

ABN , First Publish Date - 2022-04-28T09:39:27+05:30 IST

ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు భారతదేశానికి ఉన్నా..

దేశానికి కొత్త అజెండా

  • ప్రగతిపథంలో నడిపించే ప్రత్యామ్నాయం కావాలి
  • గతంలో చాలా ఫ్రంట్‌లొచ్చాయి.. ఏం సాధించాయి?
  • ఇప్పుడు కావాల్సింది రాజకీయ పునరేకీకరణలు కాదు
  • ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు, కూటమి కాదు
  • దేశమంటే ప్రజల సామూహిక లక్ష్యం కావాలి
  • నూతన ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి
  • మారాల్సింది ప్రభుత్వాలు కాదు.. దేశ స్థితిగతులు
  • హైదరాబాద్‌ వేదికగా అజెండా తయారైతే గర్వకారణం
  • గవర్నర్ల వ్యవస్థను దుర్మార్గంగా వాడుతున్నారు
  • దేశంలో పెడధోరణులు పెరిగిపోతున్నాయి
  • మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి చేసిందేంటి?
  • ప్రసంగాల జోరు.. అబద్ధాల హోరు మాత్రమే
  • తస్మాత్‌ జాగ్రత్త.. నీ ఆటలు సాగవు: సీఎం కేసీఆర్‌
  • టీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సభలో బీజేపీపై నిప్పులు
  • జాతీయ రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్‌ ముందుకు సాగాలి
  • రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన పార్టీ ప్లీనరీ


దేశానికి ఇప్పుడు కావాల్సింది, రావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు. ఎల్లయ్యనో, మల్లయ్యనో ప్రధానమంత్రిని చేయడం కాదు. గద్దెనెక్కించాల్సింది పార్టీలను కాదు.. దేశ ప్రజలను. సెకండ్‌, ఫస్ట్‌ ఫ్రంటు, నేషనల్‌ ఫ్రంటు ఇలా చాలా ఫ్రంట్లు వచ్చాయి. కానీ, ఏం జరిగింది? ఏం సాధించాయి? ఇప్పుడు కావాల్సింది రాజకీయ పునరేకీకరణలు కాదు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ అజెండా. అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే అజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాలి. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాలి’’ 

                                                                            - ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు భారతదేశానికి ఉన్నా.. వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేకుండా పోయాయని టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశ లక్ష్యమంటే ప్రజల సామూహిక లక్ష్యం అయి ఉండాలని, దేశ నలుమూలల ప్రజల కోసం ఒకలక్ష్యం, దిశ,  గమ్యం ఉండాలని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం దేశం లక్ష్యం దిశగా పయనించడం లేదన్నారు. దేశాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యామ్నాయ అజెండా కావాలన్నారు. ఇందుకోసం అవసరమైన సమయంలో తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 21వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహించిన ప్రతినిధుల సభ(ప్లీనరీ)లో కేసీఆర్‌ మాట్లాడారు. ప్రసంగం మొత్తం కేంద్రంలోని బీజేపీని టార్గెట్‌ చేశారు. ఆ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతుతోంని, ఇది దేశానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. ‘తస్మాత్‌ జాగ్రత్త! మోదీ నీ ఆటలు సాగవు’ అని నేరుగా ప్రధానమంత్రికి హెచ్చరికలు చేశారు. గవర్నర్‌ తమిళిసై పేరు ప్రస్తావించకుండా.. దేశంలో గవర్నర్‌ వ్యవస్థ దిగజారుతోందంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఓవైపు జాతీయ రాజకీయాలపై విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇస్తూనే, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్సే గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘‘ఈ రోజు మన మనసును మనం ప్రశ్నించుకుంటే.. భారతదేశ లక్ష్యం ఏమిటి? ఏ దిశగా పోతుందో చెప్పగలుగుతామా? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశ లక్ష్యమంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు. 


పార్టీ ప్రవచించే నాలుగు మాటలు కాదు. దేశ లక్ష్యమంటే దేశ ప్రజల సామూహిక లక్ష్యం అయి ఉండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు, పశ్చిమ కనుమల నుంచి తూర్పు దిశ వరకు, దేశ నలుమూలల ప్రజల కోసం ఒక లక్ష్యం, ఒక దిశ, ఒక గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశం మొత్తం సామూహిక ప్రయత్నం చేయాలె. అలా అన్ని దేశాలు చేస్తాయి. మరి భారత దేశం తన లక్ష్యాన్ని ఎందుకు కోల్పోయింది? ఏం జరుగుతోందీ దేశంలో ? దీనికి మనం మౌన ప్రేక్షకులుగా ఉండాలా? దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణ, నియంత్రిత విధానం, పట్టుదలతో పురోగమించి అద్భుతాలు సాధించాలి. నన్ను కొన్ని పార్టీల మిత్రులు కలిశారు. జాతీయ స్థాయి కమ్యూనిస్టు పార్టీ మిత్రులు వచ్చారు. అందరం కలిసి మంచీ చెడ్డా ప్రయత్నం చేయాలె. అలా అన్ని దేశాలు చేస్తాయి. మరి భారత దేశం తన లక్ష్యాన్ని ఎందుకు కోల్పోయింది? ఏం జరుగుతోందీ దేశంలో? దీనికి మనం మౌన ప్రేక్షకులుగా ఉండాలా? దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణ, నియంత్రిత విధానం, పట్టుదలతో పురోగమించి అద్భుతాలు సాధించాలి.


నన్ను కొన్ని పార్టీల మిత్రులు కలిశారు. జాతీయ స్థాయి కమ్యూనిస్టు పార్టీ మిత్రులు వచ్చారు. అందరం కలిసి మంచీ చెడ్డా మాట్లాడుకున్నాం. దేశం కోసం అందరం ఏకం కావాలని చెప్పారు. బీజేపీని గద్దె దించాలని, అది మనందరి లక్ష్యం కావాలని అన్నారు. ఇది చెత్త ఎజెండా, నేను మీ వెంట రానని చెప్పిన. ఎవరినో గద్దె దించడానికో, ఎవరినో గద్దెనెక్కించడానికో జరగాలా ప్రయత్నం? గద్దెనెక్కించాల్సింది భారత దేశ ప్రజలను. పార్టీలను కాదు. మారాల్సింది ప్రభుత్వాలు కాదు. ప్రజల జీవితం మారాలి. దేశ జీవన స్థితిగతులు, మౌలిక పరిస్థితులు, సదుపాయాలు, అందరూ తలెత్తుకుని గౌరవంగా ఉండే పరిస్థితి రావాలి. టీవీలో ఒక రాష్ట్రానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌లో స్వయం సహాయక గ్రూపుల మహిళలు మాట్లాడుతూ తాము ఈ మధ్యనే గ్రూపును పెట్టుకున్నామని, కొంత పొదుపు జరుగుతుందని, రాత్రిపూట కూడా అన్నం తినగలుగుతున్నామని అంటారు. లేకపోతే తమకు ఒక్కపూటనే తిండి అని చెబుతారు. దానిని చూస్తే నా కళ్లలో నీళ్లు కమ్మాయి. ఇంత సువిశాలమైన, ఇన్ని జీవనదులు ప్రవహించే, 44 వేల కోట్ల ఎకరాల్లో పంటలు పండే భూములున్న భారత దేశంలో 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ దేశ మహిళలు ఒక పూట తిండి తినాలా? ఈ రోజు దాని నుంచి అధిగమించామని చెప్పుకోవాలా? ఈ దేశం ఇలాగే ఉండాలా? 

  

1980 వరకు చైనా జీడీపీ తక్కువ

1980 వరకు భారత జీడీపీ కంటే చైనా జీడీపీ తక్కువ. భారత్‌ కంటే చైనాలో పండే పంటలు తక్కువ. వ్యవసాయానికి అనుకూలమైన భూమి భారత్‌ కంటే చైనాలో తక్కువ. 20-30 ఏళ్లలో చైనా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ రోజు చైనా ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తి. మనమెక్కడ ఉన్నాం? మన రాష్ట్రంలోని ఒక జిల్లా అంత ఉండని ఇజ్రాయెల్‌ దేశం నుంచి ఆయుధాలు కొంటున్నాం. మన తాలూకా అంత ఉన్న చిన్న చిన్న దేశాల నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్లకు పంపులు తెచ్చుకుంటున్నాం. ఏం ఖర్మ, ఏం దుస్థితి? దీనిపై మనమందరం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం, వసతులు, వనరులు కలిగి ఉన్నది నా భారతదేశం. కలిగి లేక బాధపడితే వేరు. కలిగి ఉండి ఈ రోజు కటకట పడుతున్నాం. దీనికి ఏదో నివారణ జరగాలి. దీని కోసం కేసీఆర్‌ ఇయ్యాల ఫ్రంటు ప్రకటిస్తాడా? ఇంకోటి ప్రకటిస్తాడా కాదు. ప్రాసెస్‌ జరుగుతది. తెలంగాణ కోసం ప్రాసెస్‌ చేసినట్లు అద్భుతమైన భారత్‌ కోసం ప్రాసెస్‌ జరగాలి. ఆ ప్రాసె్‌సలో భవిష్యత్తు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో నేను జార్ఖండ్‌ రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. అక్కడి విలేకరులు మీరు యాంటీ బీజేపీ ఫ్రంటు ఎప్పుడు పెడుతున్నారని అడిగారు.


 నాకు కోపం వచ్చి యాంటీ కాదు, ఫర్‌ కాదు అని చెప్పాను. పెడితే గిడితే భారత దేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంటు ఉంటది తప్ప.. దీనికి వ్యతిరేకం, దానికి దోస్తీ అన్నట్లు ఉండదని, భారత ప్రజలను, దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే అజెండాకు శ్రీకారం చుడతామని చెప్పిన. తెలంగాణ ప్రజల పక్షాన దేశ రాజకీయాలను, దేశ గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన పంథాలో నడిపించడానికి హైదరాబాద్‌ వేదికగా కొత్త ఎజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశ నలు మూలలా వ్యాపిస్తే.. అది మనందరికీ గర్వకారణం. ఏదో ఇద్దరు, ముగ్గురు ముఖ్యమంత్రులను ఒక్కటి చేయడమో, నాలుగు పార్టీలను ఒక్కటి చేయడమో, ఎవరితోనే దోస్తానా కట్టడమో.. కాదు కావాల్సింది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. ప్రతివాడు పని చేసే అవకాశం రావాలి. ఆ భారత దేశం లక్ష్యంగా పురోగమించాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేయాలంటున్నారు. ఇలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి. 


మహాత్మాగాంధీనే దూషిస్తారా?

జాతిపిత మహాత్మాగాంధీనే దూషణలు చేసే దేశమా మనది? ఇదేం పెడ ధోరణి, ఇదేం దుర్మార్గం? దేశ స్వాతంత్య్రం కోసం జైళ్లలో మగ్గి, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడడం, ఆయనను చంపిన హంతకులను పూజించడమా? ఇదా భారత దేశం? ఇది సంస్కృతా? ఎందుకీ విద్వేషం? ఏ రకమైన మతపిచ్చి లేపుతున్నారీ దేశంలో? కుత్సిత బుద్ధితో కుటిల రాజకీయాలు చేసి, పచ్చి రాజకీయ స్వార్థం కోసం, ఎవరో పది మంది పదవుల కోసం ఇలాంటి విధ్వంసం చేయడం చాలా తేలికనే. అదే నిర్మాణం చేయాలంటే ఎంత సమయం పడుతుంది? కర్ణాటకలో ఏం జరుగుతోంది? హిజాబ్‌, హలాల్‌, పూలు కొనొద్దు, పండ్లు కొనొద్దు.. ఇదా? ఏ పనిని ఎవరైనా స్వీకరించవచ్చు. దానికి కులం, మతం తేడా లేదు. ఈ రోజు 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పని చేస్తున్నారు. ఆ దేశాలవారు మీరు మా మతస్తులు కాదు, మా కులస్తులు కాదు... గెటవుట్‌ అంటే... వారు తిరిగి ఇండియాకు వస్తే... ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆ 13 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తదా? ఈ మత విద్వేషాలు చేసే సన్నాసులు వారిని రక్షిస్తారా? ధరలు పెరిగిపోయాయి. మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు లేవు. ఇవన్నింటినీ మరిచి ఇలాంటి దుర్మార్గాలకు దిగుతారా? దేశ రాజధానిలో కత్తులు పట్టుకుని ఊరేగింపులా? ఇదేనా ప్రజలు కోరుకునేది ? కావాల్సింది ప్రాజెక్టులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు.


హిందుత్వానికి ప్రమాదం ఎలా వస్తుంది?

గొప్ప వైవిధ్యమైనది భారతదేశం. ఇలాంటి దేశంలో భయంకరమైన విషాన్ని జొప్పిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ముఖ్యమంత్రులంతా హిందువులే. హిందుత్వానికి ప్రమాదం ఎలా వస్తుంది? లేనిది ఉన్నట్టు చెప్పి విద్వేషం రగిల్చి.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇస్లామిక్‌ దేశాల్లో దేవాలయాలను నిర్మిస్తున్నారు. అమెరికాలోనూ ఎన్నో గుడులున్నాయి. మనదేశంలో ఏం చేస్తున్నారు? మనిషి కోసం మతమా? మతం కోసం మనిషా? ఈ విద్వేషాన్ని ఎదుర్కొనకపోతే భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలు వస్తాయి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతోంది. ఆయన ఏం చేశారు??సాధించిన ప్రగతి ఏంటి? రేకుల డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్లు ప్రసంగాలు జోరు.. అబద్దాల హోరు తప్ప.. దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి బతికే ఉంది. ప్రజల కండ్లు మూసుకుని లేరు. నరేంద్రమోదీ తస్మాత్‌ జాగ్రత్త! నీ ఆటలు ఇక సాగవు. తెలంగాణ పక్షాన దేశాభివృద్ధిలో వంద శాతం పాత్ర పోషిస్తా. చిత్తశుద్ధితో పనిచేస్తా’’ అని కేసీఆర్‌ అన్నారు. 


ధాన్యం ఇతరులకు అమ్మొద్దు

రైతులు ఒక్క గింజను కూడా ఇతరులకు అమ్మొద్దు. ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పూర్తిధాన్యం సేకరణలో టీఆర్‌ఎస్‌ వాళ్ల పాత్ర ఉండాలి. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి. టీఆర్‌ఎస్‌ పార్టీ విషయంలో నాకు ఏ రందీ లేదు. ఒక్కో వక్త గంట కాదు.. రెండు గంటలు మాట్లాడేలాగా తయారయ్యారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలను అలవోకగా చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆఫీ్‌సలు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రజాప్రయోజనాలను రక్షించే సంస్థగా టీఆర్‌ఎస్‌ ఉండాలి. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆఫీ్‌సల ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకుంటాం.


సైనికుడిలా పనిచేస్తా..

మనసు పెట్టి పనిచేస్తే.. అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగే అవకాశాలు సుసంపన్నంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందించడంలో ఒక సైనికుడిలా పనిచేస్తా. జాతీయ రాజకీయాలు, వ్యవస్థ, వనరులు, వసతులపై 15-20 రోజులపాటు దేశవిదేశాల ఆర్థికవేత్తలతో సమావేశం నిర్వహిస్తాం. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి కొంత మంది ముందుకువస్తున్నారు. 2 వేల మంది మాజీ అఖిలభారతీయ సర్వీసుల అధికారులతో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించబోతున్నాం. ఆ సదస్సులో చాలా విషయాలు అర్థమవుతాయి.  


పెట్రోల్‌ ధరను పెంచలేదు

రాష్ట్రం ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడా డీజిల్‌, పెట్రోల్‌ ధరను పెంచలేదు. 2015లో రౌండ్‌ఫిగర్‌ చేశాం తప్ప.. ఈ రోజు వరకు ఒక్కపైసా కూడా పెంచలేదు. పెంచిన పాపాత్ములు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన వంగిమాగధులు. ఏ నోరుతో తెలంగాణను పన్ను తగ్గించమంటున్నారు? ఇది రాష్ట్రాల మీదకు నెట్టే కుటిల, దుష్ట రాజకీయ ప్రయత్నం. ఇటీవల మేం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచాం. ఎందుకోసం పెంచామో ప్రజలకు ధైర్యంగా చెప్పాం. బీజేపీ నాయకులకు సిగ్గుండదు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే రూ.1000 బహుమతులు ఇస్తామని ప్రకటిస్తున్నారు. మన ఆర్టీసీని అమ్ముకోమంటున్నారు. 


90 స్థానాల్లో గెలవబోతున్నాం

ప్రజలు సునిశితంగా అన్ని విషయాలు గమనిస్తారు. ఎవరో ఆరోపణలు చేస్తే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండంగా టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలుస్తోంది. అందులో ఎవరికీ అనుమానం అవసరంలేదు. సాంకేతికపరమైన విషయాలను అవగాహన చేసుకోవడానికి కన్సల్టెన్సీని పెట్టుకున్నాం. వాళ్లు చేసిన సర్వేలు మనం 90కి పైచిలుకు స్థానాల్లో అలవోకగా గెలుస్తామని చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ కేడర్‌, నాయకులకు శిక్షణా శిబిరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తాం.పార్టీకి నిధులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అభ్యుదయం కోసం వాడాలి. జిల్లా నాయకులకు మొదలుకుని దఫాదఫాలుగా విదేశాలకు పంపిస్తాం. ఇజ్రాయిల్‌, చైనా లాంటి దేశాలకు పార్టీ ప్రతినిధులు వెళ్లిరావాలి. జాతీయ రాజకీయాల కోసం ఆలోచన చేస్తున్నామంటే.. ముందుకెళ్లండని చాలా మంది దాతలు ముందుకు వచ్చి అద్భుతమైన విరాళాలను సమకూర్చారు. జాతీయరాజకీయాలకు పోవాలంటే చాలా వనరులు, డబ్బులు కావాలని అంటున్నారు. మా పార్టీకి నిబద్ధత కలిగిన 60 లక్షల మంది సభ్యులున్నారు. వారిలో చాలా మందికి రూ.కోటి, లక్ష, వెయ్యి, పది దాకా సాయం చేసే స్థోమత ఉంది. సగటున ఒక్కో సభ్యుడు రూ.1000 పంపించినా రూ.600 కోట్లు అవుతాయి. 


గవర్నర్ల వ్యవస్థ.. బుద్ధి, జ్ఞానం రావొద్దా?

మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం ప్రతిపాదన చేసి పంపిస్తే.. 12 ఏళ్ల వరకు గవర్నర్‌ తన వద్దే ఆ ప్రతిపాదనను పెట్టుకుని కూర్చున్నాడు. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్‌ చేసి పంపిస్తే... గవర్నర్‌ పెడ ధోరణి. ప్రదర్శించారు బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో పంచాయితీ. స్వర్గీయ ఎన్‌టీ రామారావు పార్టీ పెడితే మేమంతా యువకులుగా పని చేశాం. ఎలాంటి కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చాం. చెప్పిన పని ఆచరిస్తూ ముందుకుపోతా ఉన్నారు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి, స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్‌టీ రామారావును చాలా దుర్మార్గంగా పదవి నుంచి తొలగించారు. ఏం జరిగింది మనందరం కళ్లారా చూశాం. ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు ప్రజలు మెడలు వంచి, మళ్లీ ఎన్‌టీఆర్‌ను గద్దెనెక్కించారు. బుద్ధి జ్ఞానం రావొద్దా ? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎలా ఉండాలి ? ఎన్టీఆర్‌ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిన ఆ గవర్నర్‌ అవమానకర రీతిలో ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. తొలగించడ్డారు. దాన్నుంచి దేశం గుణపాఠం నేర్చుకోవాలి కదా? దానికి ఉల్టా ఈ రోజు ఏం జరుగుతోంది ? ప్రజల కోసం రాజ్యాంగమా ? దానికి ఉల్టానా ? రాజ్యాంగ సంస్థలేమవుతున్నాయి? రాజ్యాంగ ప్రతిపత్తి ఏమవుతోంది ? మృగాల్లాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకుని, పట్టపగలు తుపాకులు పట్టుకుని సంచరిస్తరా? అందుకే ఈ దేశం సరైన పద్ధతిలో ముందుకు పోవాలంటే, అంబేద్కర్‌ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే.. ప్రజల అజెండాతో కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలె. తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటయి. టీఆర్‌ఎస్‌ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది. 


వికెట్లు పడిపోయే మంత్రివర్గం లేదిక్కడ..

నేను 50 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఒక మంత్రి అవినీతికి పాల్పడి, పదవి కోల్పోతే.. పేపర్‌వాళ్లు వికెట్‌ నెంబర్‌ వన్‌ అని రాసేవారు. కానీ, అలా పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు. నిన్నగాక మొన్న కర్నాటక రాష్ట్రంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి, పదవి కోల్పోయిన విషయాన్ని ఈ వారం రోజుల్లోనే చూశాం. మనకంటే ముందే... ఎన్నో దశాబ్దాల ముందు నుంచి ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాలన్నికంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. మన జీఎ్‌సడీపీ దేశ జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన 2014లో జీఎ్‌సడీపీ సుమారు రూ.5 లక్షల కోట్లుగా ఉండేది. ఈ రోజు రూ.11.50 లక్షల కోట్లకు చేరింది. ఒకరోజు తెలంగాణలో మూడే మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఈరోజు 33 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేసిన స్థాయిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పని చేసి ఉంటే.. మన స్థాయి రూ.14.50 లక్షల కోట్లు ఉండేది. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. పెడధోరణలు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కనబడట్లేదు.


టీఆర్‌ఎస్‌ ప్రజల ఆస్తి.. కాపలాదారు

20 ఏళ్లు, రెండు దశాబ్దాల కఠోర శ్రమ. నేడు 21వ సంవత్సరం పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలోకి టీఆర్‌ఎస్‌ అడుగు పెడుతోంది. 60 లక్షల మంది సభ్యులున్నారు. తెలంగాణకు కాపలాదారుల పార్టీ టీఆర్‌ఎస్‌. రాష్ట్రానికి పెట్టని కోట. ఎవరూ బద్దలు కొట్టలేని కంచుకోట. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.8.50 కోట్లు పెట్టి స్థలాన్ని కొనుక్కుని, ఇంకో రూ.8-10 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్‌ను కడుతున్నాం. 6, 7 నెలల్లో కాలంలో దేశ రాజధానిలో కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. పార్టీకి రూ.451 కోట్లు ఫిక్స్‌డ్‌డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఎలక్ర్టోరల్‌ బాండ్స్‌ ప్రకారం టీఆర్‌ఎ్‌సకు ఉన్న నిధులు రూ.865 కోట్లు. స్టేట్‌బ్యాంక్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌బరోడాలో పారదర్శకంగా నిధులను పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాం. హైదరాబాద్‌, ఢిల్లీ, జిల్లా కార్యాలయాలను కలుపుకుని పార్టీకి మొత్తంగా రూ.1000 కోట్ల వరకు ఆస్తులున్నాయి. అద్భుతమైన పరిపాలన అందిస్తూ దేశానికే ఒక రోల్‌ మోడల్‌గా తెలంగాణ కొనసాగుతోంది. కేంద్రం అనేక పద్ధతుల్లో వెలువరుస్తున్న ఫలితాలు, అవార్డులే దానికి తార్కాణం. 


దేశ్‌ కీ నేత కేసీఆర్‌

పార్టీ ప్లీనరీలో ప్రతినిధుల ఆకాంక్ష

కేసీఆర్‌ అధ్యక్షతన దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన ప్రతినిధుల సభ.. దేశం బాగు కోసం జాతీయ రాజకీయాల్లో ముందుకు సాగాలని అధికార టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు ‘దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషించాలి’ అనే రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. చివరి నిమిషంలో సిద్ధం చేసిన రెండింటితో సహా 13 తీర్మానాలను ఆమోదించింది. ఈ సభ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలనా వైఫల్యాలను సరిదిద్ది, తెలంగాణ తరహాలో దేశాన్ని గాడిలో పెట్టడానికి జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఎన్టీఆర్‌, ఇప్పుడు కేసీఆర్‌.. సృష్టికర్తలని ఉద్ఘాటించారు. దేశ్‌కీ నేత కేసీఆర్‌ అంటూ నినదించారు. టీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అంతటా విజయవంతంగా అమలు చేస్తున్న అనేక పథకాలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి పూనుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా రూపాంతరం చెందాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ప్లీనరీ వేదికగా చేసిన ప్రారంభ, ముగింపు ఉపన్యాసాల్లో స్పష్టత ఇవ్వనప్పటికీ, జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ క్రియాశీలక పాత్రను ఖాయం చేశారు. అయితే కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు ఉండబోదన్నారు. కాగా, ప్లీనరీలో కేసీఆర్‌ సహా ప్రసంగాలు చేసిన ప్రతినిధులెవరూ కాంగ్రెస్‌ జోలికి వెళ్లలేదు. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కంటే, గత ప్రభుత్వమే (కాంగ్రెస్‌) బాగుందని ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. 2014 తర్వాత దేశ ప్రజ ల పరిస్థితి ‘పెనం పైనుంచి పొయ్యిలో పడినట్టు’ అయిందనే వ్యాఖ్యలు చేశారు. 


 వినియోగిస్తున్న విద్యుత్తు 2 లక్షల మెగావాట్లే

ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్లు అందుబాటులో ఉంది. కానీ, దానిని వినియోగించలేని అశక్తతలో ఉందీ భారత దేశం. దేశంలో ఏ ఒక్క రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుచ్ఛక్తిని వినియోగించడం లేదు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్‌లో కూడా భరించలేని కరెంటు కోతలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గ‌ఢ్, ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలో ఉంటే.. తెలంగాణ ఒక మణి దీపంలా వెలుగుతోంది. ఇదే పని భారత దేశంలో ఎందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణ పర్‌ఫార్మ్‌ చేసిన స్థాయిలో దేశం పని చేయడం లేదు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ సమావేశంలో చెప్పిన. అయినా లాభం లేదు. ప్రపంచంలోనే అత్యధిక యువ శక్తి కలిగి ఉన్నది భారతదేశం. ఏమి దరిద్రం? 13వేల కోట్ల మంది భారతీయలు తమ ప్రతిభను విదేశాలలో వెచ్చిస్తున్నారు. దీనిపై అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 


ప్రధాని మోదీది డ్రామా కాన్ఫరెన్స్‌! 

ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిందో డ్రామా కాన్ఫరెన్స్‌. ఆ సమావేశంలో మూడు, నాలుగు గంటలు సీఎంలంతా కూర్చొని ఉండాలి. వాళ్లు చెప్పేదే వినాలి. అది కరోనా మళ్లీ వస్తుందన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై సమావేశం. ఆ సమావేశంలో ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రాలు ట్యాక్స్‌లు తగ్గించాలని చెప్పడానికి సిగ్గు ఎగ్గు ఉండాలి కదా? ప్రజల మీద భారం వేయొద్దంటే.. మీరెందుకు పెంచుతున్నారు? ఏ నోరుతో రాష్ట్రాలను తగ్గించమంటారు? ఇదేం నీతి? ఇంత దుర్మర్గమా? దేశ ప్రధాని మాట్లాడే మాటలేనా అవి? నిజంగా ప్రజల మీద ప్రేముంటే.. మీరెందుకు పెంచారు? లేని సెస్‌లు ఎందుకు విధిస్తున్నారు?


1 నుంచి 10 వరకు తెలంగాణ గ్రామాలకే అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 10 గ్రామాలకు అవార్డులు ఇస్తే... 1 నుంచి 10 వరకు తెలంగాణ గ్రామాలకే అవార్డులు వచ్చాయి. వట్టిగనే వచ్చినవా? చట్ట ప్రేరణ, శాసన ప్రేరణ ఉండాలని, విధులను నిర్లక్ష్యం చేసినవారికి శిక్ష ఉండాలనే ఉద్దేశంతో నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెచ్చాం. 85ు మొక్కలు దక్కకపోతే టీఆర్‌ఎస్‌ సర్పంచి అయినా... నీ పదవి పోతది అని చెప్పినం. నీ ఉద్యోగం పోతదని గ్రామ సెక్రటరీకి చెప్పినం. 12,750 పంచాయతీలకు సెక్రటరీలను నియమించి, వారికి బాధ్యతలు అప్పగించాం. పల్లె ప్రగతి పేర సంవత్సరానికి రెండు మూడు సార్లు డ్రైవ్‌లు పెట్టి, ప్రతివాళ్లను ఇన్‌వాల్వ్‌ చేశాం. అందుకే ఈ రోజు పదికి పది గ్రామాల్లో మనమే ఫస్ట్‌ వచ్చినం. ఊరికే రాలేదు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే, అలవోకగా రాజకీయాలు చేస్తే రాలేదు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న వ్యూహం, ఉద్దేశంతో అద్భుతమైన సమాజాన్ని సృష్టించే దిశగా తలపెట్టిన కార్యక్రమం దళిత బందు.

Updated Date - 2022-04-28T09:39:27+05:30 IST