దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు

ABN , First Publish Date - 2021-08-16T01:17:51+05:30 IST

'ఉడాన్' (యూడీఏఎన్) స్కీమ్ కింద దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలను కలుపుతూ కొత్త..

దేశవ్యాప్తంగా 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు

న్యూఢిల్లీ: 'ఉడాన్' (యూడీఏఎన్) స్కీమ్ కింద దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలను కలుపుతూ కొత్త విమానాశ్రయాల నిర్మాణం అత్యంత వేగంగా జరుగనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మాట్లాడుతూ, దేశంలో 21 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు లాంఛనంగా కేంద్రం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఇవాళ దేశంలో ఎంతో వేగంగా విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుండటం అసాధారమని, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు.


కాగా, దేశంలో ఇంతవరకూ 6 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విమానాల రాకపోకలు ప్రారంభమైనట్టు పౌర విమానయాన శాఖ మంత్రి వీకే సింగ్ ఈనెల 5న లోక్‌సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.  పెద్ద సిటీలతో పాటు చిన్న నగరాలకూ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఉడాన్ స్కీమ్‌ను 2016లో ప్రారంభించారు. లాంఛనంగా కేంద్రం ఆమోదం తెలిపిన 21 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులలో మోప (గోవా), నవీముంబై, సిధుదుర్గ్, షిర్డి (మహారాష్ట్ర), డబ్రా (గ్వాలియర్- మధ్యప్రదేశ్), కుషినగర్, జెవర్ (నొయిడా) (ఉత్తరప్రదేశ్, ధొలేరా, హిరాసర్ (గుజరాత్), కరైకాల్ (పాండిచ్చేరి), దగదర్తి, భోగాపురం, ఓర్వకల్ (కర్నూల్) (ఆంధ్రప్రదేశ్), దుర్గాపూర్ (పశ్చిమబెంగాల్), పాక్యాంగ్ (సిక్కిం), కన్నూరు (కేరళ), హొల్లాంగి (ఇటానగర్) (అరుణాచల్ ప్రదేశ్) ఉన్నాయి.

Updated Date - 2021-08-16T01:17:51+05:30 IST