చకచకా

ABN , First Publish Date - 2020-11-29T06:19:08+05:30 IST

చకచకా

చకచకా

కొత్త బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్‌

డిసెంబరు ఏడున టెండర్లు

మూడు నెలల్లో నిర్మాణ పనుల టెండర్లు

వేగంగా అడుగులు వేస్తున్న అధికారులు

ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి అడుగులు చకచకా పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు కోసం డిసెంబరు 7న టెండర్లు తెరవనుండటంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజీని, దిగువన 60 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి వద్ద మరో బ్యారేజీని నిర్మించడానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రెండు బ్యారేజీలకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయడానికి కొత్తగా టెండర్లు పిలిచింది. డిసెంబరు ఏడో తేదీన జలవనరుల శాఖ అధికారులు వీటిని తెరుస్తారు. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీకి ఒక కన్సల్టెన్సీని ఎంపిక చేసి మూడు, నాలుగు నెలల్లో నిర్మాణానికి సంబంధించిన టెండర్లను పిలవాలని అధికారులు నిర్ణయించారు. 

ప్రయోజనాలివీ..

ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాన్ని మినహాయిస్తే దిగువన నది పరివాహక ప్రాంతంలో చుక్కనీరు ఉండట్లేదు. వరదలు ఉవ్వెత్తున వచ్చినప్పుడే ఈ ప్రాంతం నిండుకుండలా కనిపిస్తుంది. దీనివల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అంటే అదీ లేదు. నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లు తవ్వినప్పుడు స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంది. గ్రామాలకు పక్కగా నది ప్రవహిస్తున్నా అందులో చుక్కనీరు లేకపోతే నిష్ప్రయోజనమే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే పెనమలూరు మండలం. ఈ మండలంలోని గ్రామాలను ఆనుకుని నది సముద్రం సరిహద్దుల వరకు ప్రవహిస్తుంది. చోడవరం, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోర్లు తవ్వినప్పుడు జలాలు పైకి వస్తున్నాయి. అందులో ఏమాత్రం స్వచ్ఛత ఉండడం లేదని ఆయా ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత బోర్లు, బావులు ఉన్నప్పటికీ తాగునీటిని ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. చోడవరం పరిసర ప్రాంతాల పరిస్థితి ఇలా ఉంటే.. మోపిదేవి, అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. పోటు సమయంలో సముద్రపు నీరు నదిలోకి వచ్చి చేరుతుంది. ఇక అల్పపీడనాల సమయంలోనూ సముద్రపు నీరు రోజుల తరబడి నదిలో ఉంటోంది. ఈ కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లోని భూములు చౌడు బారిపోతున్నాయి. బోర్లు వేసినా ఉప్పు నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీ - చోడవరం బ్యారేజీ - మోపిదేవి బ్యారేజీ మధ్య ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చేస్తే ఈ పరిస్థితులు మారతాయని అధికారులు భావిస్తున్నారు.

నీటిని ఒడిసిపట్టి..

చోడవరం, మోపిదేవి బ్యారేజీల్లో ఒక్కోదాంట్లో 4.5 టీఎంసీ నీరు నిల్వ ఉండేలా నిర్మాణం చేయనున్నారు. వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఈ మూడు బ్యారేజీల మధ్య ఆపగలిగితే నీటి ఎద్దడి పరిస్థితులు మారతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,200 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారు. కొత్త బ్యారేజీలు అందుబాటులోకి వస్తే అందులో కొంతభాగాన్ని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రెండింటితో పాటు ప్రకాశం బ్యారేజీకి ఎగువన 25 కిలోమీటర్ల దూరంలో వైకుంఠపురం వద్ద ఒక బ్యారేజీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.  మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. ఈ బ్యారేజీలో మొత్తం పది టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ మూడు బ్యారేజీలు నిర్మిస్తే పట్టిసీమతో పని ఉండదన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-11-29T06:19:08+05:30 IST