Advertisement

రూ.4 కోట్లతో కొత్త బస్టాండ్‌

Mar 5 2021 @ 23:13PM
ఆర్టీసీ బస్టాండ్‌

ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు

ఎన్నికల అనంతరం టెండర్లు!

గద్వాల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాతబడిన బస్టాండ్‌ స్థానంలో అధునాతన బస్టాండ్‌ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ గద్వాలకు వచ్చినపుడు రూ.100 కోట్ల అభివృద్ధికి మంజూరు చేశారు. ఈ నిధుల్లో నుంచి రూ.4 కోట్లతో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. త్వరలో టెండర్లు పిలువనున్నారు. 1980లో గద్వాలలో బస్టాండ్‌ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం వచ్చిదంటే ప్రయాణికుల ఇక్కట్లు చెప్పనలవికాదు. ఊడిపడుతున్న పెచ్చులు, లీకేజీలు, విరిగిన కుర్చీలు, శిథిలావస్థకు చేరిన వ్యాపార సముదాయాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

బస్టాండ్‌ నిర్మాణానికి ప్రణాళికలు

హైదరాబాద్‌ ఇమ్లిబన్‌, కరీంనగర్‌ తీరులో గద్వాల బస్టాండ్‌ నిర్మాణానికి రూప కల్పన చేశారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పలుమార్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చర్చలు జరిపారు. డీపీఆర్‌లో పలు రకాలు మార్పులు చేర్పులు చేశారు. ప్రధానంగా పురాతన బస్టాండ్‌ భవనాలను మొత్తానికి కూల్చి వేసి కొత్త భవనాన్ని నిర్మించడానికి ప్రణాళికలు తయారు చేశారు. కొత్త షాపింగ్‌ కాంప్లెక్‌, బస్టాండ్‌లో ఉండాల్సి వస్తే లాడ్జి, సినిమా హాల్‌ వంటి నిర్మాణాలు చేపట్టాలని ఆలోచనలు చేశారు. అయితే రూ.4 కోట్లు సరిపోవని, మరో రూ. కోటిన్నర అదనంగా కేటాయిస్తే శాశ్వతంగా నిలిచిపోయే బస్టాండ్‌ నిర్మాణం చేపట్టవచ్చని ఇంజనీర్లు ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చారు. రూ.కోటిన్నర అదనంగా ఇవ్వడానికి ఎమ్మెల్యే ఒప్పుకున్నారని ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఎల్‌. రాంమోహన్‌ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని ఖాళీ స్థలం వర్షా కాలంలో బురదమయంగా మారుతోంది. ఇక్కడ కొత్త భవనాల నిర్మాణాలు, వ్యాపార సముదాయాలతో ప్రహరీ నిర్మాణం చేపట్టి మంచి గ్రీనరీ ఏర్పాటుకు ప్రణాళికలు తయార య్యాయని, ఎన్నికల అనంతరం టెండర్లు జరిగి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. 

Follow Us on:
Advertisement