ఏడెకరాలు.. 30ప్లాట్‌ఫామ్స్‌.. అధునాతన సౌకర్యాలతో ఖమ్మం కొత్తబస్టాండ్‌

ABN , First Publish Date - 2021-02-25T04:37:53+05:30 IST

ఏడు ఎకరాల స్థలంలో రూ.25కోట్ల వ్యయంతో 30ప్లాట్‌ఫారాలతో ఖమ్మం బైపాస్‌రోడ్డులో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన కొత్త బస్టాండ్‌ ఒకటో తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఫిబ్రవరి రెండో వారంలోనే దీన్ని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తి కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి బస్సుల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించారు.

ఏడెకరాలు.. 30ప్లాట్‌ఫామ్స్‌.. అధునాతన సౌకర్యాలతో ఖమ్మం కొత్తబస్టాండ్‌
ఒకటోతేదీన ప్రారంభం కానున్న ఖమ్మం కొత్తబస్టాండ్‌

ఒకటో తేదీనుంచి బస్సుల రాకపోకల షురూ

ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న అధికారులు 

మూతబడనున్న పాతప్రయాణప్రాంగణం

సిటీబస్టాండ్‌గా ఉంచాలని కొనసాగుతున్న ఆందోళనలు


ఖమ్మం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఏడు ఎకరాల స్థలంలో రూ.25కోట్ల వ్యయంతో 30ప్లాట్‌ఫారాలతో ఖమ్మం బైపాస్‌రోడ్డులో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన కొత్త బస్టాండ్‌ ఒకటో తేదీ నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఫిబ్రవరి రెండో వారంలోనే దీన్ని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తి కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి బస్సుల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.


ఒకటో తేదీ నుంచి పాత బస్టాండ్‌ నుంచి కాకుండా బైపాస్‌రోడ్‌లోని కొత్తబస్టాండ్‌ నుంచి ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా, కర్ణాటక తదితర పొరుగురాష్ట్రాలతో పాటు పొరుగుజిల్లాలకు సంబంధించిన అన్ని రూట్ల బస్సుల రాకపోకలు ఇక్కడినుంచే జరుగుతాయని చెబుతున్నారు. అయితే ఒకటో తేదీ లోపు మిగిలిన పనులను పూర్తి చేయాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పనుల పురోగతిపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు. 


పాత బస్టాండ్‌ వద్ద రద్దీ నేపథ్యంలో.. 

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడెకరాల స్థలంలో 12 ప్లాట్‌ఫామ్‌లతో నిర్మించిన ప్రస్తుత బస్టాండ్‌ నుంచి రోజుకు 1500సర్వీసులతో 40వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఖమ్మం నగరానికి నడిబొడ్డున్న ఈ బస్టాండ్‌ను ఆధారంగా చేసుకుని వేల సంఖ్యలో చిన్న పెద్ద దుకాణాలు, ఆసుపత్రులు, చిరువ్యాపారులు ఇలా ఎంతో మంది తమ వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు.


ఈ క్రమంలో మయూరిసెంటర్‌, కమాన్‌బజార్‌, కార్పొరేషన్‌ కార్యాలయ రోడ్డు, బస్టాండ్‌ ప్రాంతం  రద్దీగా ఉంటుండటంతో గతంలో సీఎం కేసీఆర్‌ ఖమ్మం వచ్చిన సమయంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఎన్నెస్పీ స్థలంలో కొత్తబస్టాండ్‌కు ప్రతిపాదన పెట్టి మంజూరు చేయించారు.


ఆ సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి తుమ్మల, పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే పనులు ప్రారంభమైనా నిధుల కొరత, కాంట్రాక్టర్‌ జాప్యం చేయడంతో  చాలాకాలం పనులు నిలిచిపోయాయి. ఆతర్వాత పువ్వాడ అజయ్‌ కుమార్‌ రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులను పునఃప్రారంభించారు. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన కొత్తబస్టాండ్‌లో కొత్తబస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు షాపింగ్‌మాల్స్‌కూడా ఏర్పాటుచేస్తున్నారు. 


పాతబస్టాండ్‌ మూసివేతపై చర్చ..

నగరంలోని పాత బస్టాండ్‌ ఆధారంగా వేలాది మంది వ్యాపారులు తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటుండగా.. బస్టాండ్‌ మూసివేస్తే పరిస్థితి ఏంటా అన్న చర్చ జరుగుతోంది. కొత్తబస్టాండ్‌ మంజూరైన సమయంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్తబస్టాండ్‌ నుంచి ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు మాత్రమే తిరుగుతాయని, పాతబస్టాండ్‌ నుంచి ఉమ్మడి ఖమ్మంజిల్లాకు సంబంధించిన ఆర్డినరీ, సిటీ బస్సులు నడుస్తాయని ప్రకటించారు. కానీ ప్రస్తుం కొత్తబస్టాండ్‌ నుంచే అన్ని బస్సుల రాకపోకలు జరుగుతాయని అధికారులు ప్రచారం చేస్తుండటం, ఇటీవల మంత్రి అజయ్‌ కూడా విలేకరుల సమావేశంలో ప్రకటించడంతో పాతబస్టాండ్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.


ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సంస్థలకు ఖమ్మం పాతబస్టాండ్‌ను లీజుకు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో పలు పార్టీలు, సంఘాలు ఆందోళనకు దిగాయి. సుమారు రూ.200కోట్ల విలువైన స్థలంపై అధికారపార్టీ పెద్దలు కన్నేశారని, పాతబస్టాండ్‌ను సిటీబస్టాండ్‌గా ఉంచాలని, అలా కాంకుడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగిస్తే సహించేదిలేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అజయ్‌ కూడా పాతబస్టాండ్‌ను, స్థలాన్ని ఎట్టిపరిస్థితిలో అన్యాక్రాంతం కానీయమని, ఎవరికీ కట్టబెట్టబోమని ఒకసభలోనే వివరణ ఇచ్చారు. అయునా విపక్షాలు మాత్రం ఆందోళనలు సాగిస్తూనే ఉన్నాయి. 



ప్లాట్‌ఫారాలు.. రూట్ల కేటాయింపులు.. 

ఒకటో ప్లాట్‌ఫాం నుంచి ఐదో నెంబరు ప్లాట్‌ఫాం వరకు ఉమ్మడి జిల్లాతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు దిగేస్థలంగా నిర్ణయించారు. మిగిలిన 25 ప్లాట్‌ఫాంలను  జిల్లాతో పాటు పొరుగుజిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లే బస్సుల కోసం కేటాయించారు. ఈ వివరాలు అందరికీ అర్థమయ్యేలా ఏయే ప్లాట్‌ఫాంల వద్ద ఏయే రూట్లకు వెళ్లే బస్సులు ఆగుతాయి, ఏయే సర్వీసులు ఏయే ప్రాంతాలకు ఏయే సమయాల్లో వెళతాయి అనే సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేశారు. 


ఒకటి నుంచి అందుబాటులోకి కొత్తబస్టాండ్‌ 

సోలోమాన్‌, ఆర్టీసీ ఆర్‌ఎం 

ఖమ్మం బైపాస్‌రోడ్డులో నిర్మించిన అధునాతన బస్టాండ్‌ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. ఇక్కడి నుంచి అన్ని బస్సు సర్వీసుల రాకపోకలకు, ప్రయాణికుల కోసం పూర్తి ఏర్పాట్లు చేశాం. నెలాఖరులోపు మిగులు పనులు కూడా పూర్తి చేసి.. జిల్లా సర్వీసులతోపాటు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను కొత్తబస్టాండ్‌నుంచే ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మయూరిసెంటర్‌ వద్ద ఉన్న పాత బస్టాండ్‌ను మూసివేస్తాం. 


‘పాత ప్రాంగణం’పై ప్రజా బ్యాలెట్‌

లోకల్‌బస్టాండ్‌గా ఉంచాలని మెజారిటీ ప్రజల అభిప్రాయం

ఖమ్మం మయూరి సెంటర్‌ : ఒకటో తేదీ నుంచి కొత్తబస్టాండ్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాత బస్టాండ్‌ను మూసివేయనున్నారు. ఈక్రమంలో పాతబస్టాండ్‌ను లోకల్‌ బస్టాండ్‌గా కొనసాగించాలని పాతబస్టాండ్‌ పరిరక్షణ సమితి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం నగరంలోని ఐదు కూడళ్లలో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు.


మొత్తం 2773ఓట్లు పోలవగా పాతబస్టాండును లోకల్‌ బస్టాండ్‌గా కొనసాగించాలని 2726 మంది అభిప్రాయపడ్డారు. 46 మంది మాత్రమే లోకల్‌బస్టాండ్‌ డిమాండ్‌ను వ్యతిరేకించారని కమిటీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అఫ్రోజ్‌సమీనా, దీపక్‌చౌదరి, కాంగ్రెస్‌ నగర అద్యక్షుడు జావిద్‌, న్యూడెమోక్రసీ నాయకులు చందు, వైవిక్రమ్‌, జబ్బార్‌, బేగం, భాస్కర్‌, షరీప్‌, అజిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:37:53+05:30 IST