Advertisement

కారుకు కొత్త సవాల్‌!

Nov 8 2020 @ 00:33AM

రాజకీయ వర్గాలు భావిస్తున్నట్లుగా దుబ్బాకలో బీజేపీ ద్వితీయ స్థానానికి చేరుకున్నప్పటికీ అది కేసీఆర్‌కు ప్రమాద సంకేతమే అవుతుంది. భారీ మెజార్టీతో కాకుండా స్వల్ప మెజార్టీతో గెలిచినా టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. దుబ్బాక ఫలితాన్ని బట్టి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీ తన సత్తా చాటితే కాంగ్రెస్‌ నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరాదరణకు గురవుతున్న పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ – బీజేపీ ఒకేస్థాయిలో ఉంటే తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురుండదని ఇంతకాలంగా కేసీఆర్‌ భావిస్తూ వస్తున్నారు. ఇపుడు తెలంగాణలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం బలహీనపడినా కేసీఆర్‌కు బీజేపీ నుంచి ముప్పు తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


దుబ్బాకలో తుది ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉండవచ్చునేమో గానీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో తృతీయ స్థానానికే పరిమితమైన బీజేపీ ఈ ఉపఎన్నికల్లో అధికార పార్టీకి సవాల్‌గా ఎందుకు మారిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా గతానికి భిన్నంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి‌ మాణికం ఠాగూర్‌ డైరెక్షన్‌లో బాగానే కష్టపడింది. అయితే టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం మొదటి నుంచి బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీంతో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌ – బీజేపీ మధ్యనే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన శాసనసభ్యులలో పలువురిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను కేసీఆర్‌ బలహీనపర్చారు. ఫలితంగా తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాన్ని ఆయనే కల్పించారు. ఈ కారణంగా దుబ్బాకలో బీజేపీ నుంచి సవాల్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది.


ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాజకీయంగా లాభపడుతూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో మాత్రం అభిప్రాయం మార్చుకున్నారు. నవంబరు చివర్లో లేదా డిసెంబరు మొదటి పక్షంలో గ్రేటర్‌ ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌, తాజాగా జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో గ్రేటర్‌ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. అంతకు ఒకరోజు ముందే నవంబరు 13 తర్వాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించబోతున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించడం గమనార్హం. నెల రోజుల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడం, బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయం చేయడంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకుని ఉంటుంది. వరద బాధితులకు ప్రభుత్వ ఖజానా నుంచి 550 కోట్ల రూపాయలను పంచిపెట్టడం ద్వారా గ్రేటర్‌ ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టాలనుకున్న కేసీఆర్‌ ప్రయత్నం సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇతర నాయకుల చేతివాటం పుణ్యమా అని బెడిసికొట్టింది. ప్రభుత్వ అధికారుల ద్వారా అందించాల్సిన సహాయాన్ని పార్టీ నాయకుల ద్వారా లెక్కాపక్కా లేకుండా పంచిపెట్టాలనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. తనకు తెలంగాణలో ఎదురులేదు అని కేసీఆర్‌ అనుకుంటున్న సమయంలోనే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరగడం, అక్కడ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికలకు మూడేళ్లకు పైగా వ్యవధి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూల ఫలితాలు వస్తుంటాయి. అలాంటిది దుబ్బాకలో బీజేపీ నాయకులు అధికార టీఆర్‌ఎస్‌కు చెమటలు పట్టించారు. తుది ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉండవచ్చునేమో గానీ ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో తృతీయ స్థానానికే పరిమితమైన బీజేపీ ఈ ఉపఎన్నికల్లో అధికార పార్టీకి సవాల్‌గా ఎందుకు మారిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా గతానికి భిన్నంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి‌ మాణికం ఠాగూర్‌ డైరెక్షన్‌లో బాగానే కష్టపడింది. అయితే టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం మొదటి నుంచి బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. దీంతో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌ – బీజేపీ మధ్యనే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ‘‘మా పార్టీ నాయకుల ఇళ్లల్లో సోదాలు చేయలేదు, మా వాహనాలను కూడా తనిఖీ చేయలేదు. దీన్ని బట్టి మేం మూడవ స్థానానికే పరిమితమవుతామనిపిస్తోంది’’ అని కాంగ్రెస్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్‌ అండ్‌ కో పరిగణిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన శాసనసభ్యులలో పలువురిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను కేసీఆర్‌ బలహీనపర్చారు. ఫలితంగా తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశాన్ని ఆయనే కల్పించారు.


ఈ కారణంగా దుబ్బాకలో బీజేపీ నుంచి సవాల్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. బీజేపీ నుంచి ముప్పు ఎదురవుతున్నదని ఊహించిన అధికార పార్టీ పెద్దలు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసులను ఉపయోగించుకుని బీజేపీ నాయకులను వెంటాడారు. ఈ పరిణామాన్ని ఆ పార్టీ తనకు అనుకూలంగా మలచుకుని బలపడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికలలో 50 వేలకు పైగా మెజార్టీతో దుబ్బాక నుంచి గెలుపొందిన రామలింగారెడ్డి మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. రామలింగారెడ్డి భార్య సుజాతను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే ప్రజలలో రామలింగారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయన సతీమణిని పోటీకి దింపినా సానుభూతి పనిచేయలేదు. ‘‘రామలింగారెడ్డి పై ఇంత వ్యతిరేకత ఉందన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది’’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడొకరు వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించినా మెజార్టీ తగ్గిపోతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీని పదేపదే టార్గెట్‌ చేసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడిందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసులు ఎడాపెడా సోదాలు చేయడం కూడా బీజేపీకి కలిసొచ్చిందంటున్నారు. ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు పంపిణీ చేయడం మన దేశంలో సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక్కటే డబ్బు పంపిణీ చేయబోతున్నదని ప్రచారం చేయడం ఏమిటన్నది ప్రశ్న. అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు. బీజేపీ అభ్యర్థిని టార్గెట్‌గా చేసుకుని పదే పదే సోదాలు జరపడాన్ని కూడా ఈ కోణంలోనే చూడాలి. ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే బీజేపీకి చెందిన వారి నుంచి పాతిక లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు.


ఆ తర్వాత సిద్దిపేటలో రఘునందన్‌రావు బంధువుల ఇళ్లు సోదాలు చేసి 18 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు హైదరాబాద్‌లో రఘునందన్‌రావు బావమరిది ఇంటి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజన్‌కుమార్‌ ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేసి డబ్బు దొరికితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతూ ఉంటుంది. దుబ్బాక ఎన్నికల సందర్భంగా అటు సిద్దిపేట పోలీసులు, ఇటు హైదరాబాద్‌ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే చెప్పాలి. ఈ రెండు ప్రాంతాలలో ఎన్నికల కోడ్‌ కూడా అమలులో లేదు. అయినా ప్రైవేట్‌ వ్యక్తుల ఇళ్లలో డబ్బు కోసం సోదాలు చేసే అధికారం పోలీసులకు ఉందా? అన్నది ప్రశ్న. ఈ రెండు సందర్భాలలోనూ దొరికిన డబ్బు దుబ్బాకలో బీజేపీ అభ్యర్థికి సంబంధించినదని పోలీసులు ప్రకటించడం గమనార్హం. అలా చెప్పే అధికారం పోలీసులకు ఉందా? ఎవరి వద్దనైనా నగదు లభిస్తే దానికి లెక్కలు చెప్పాల్సింది ఆదాయపు పన్ను శాఖాధికారులకే గానీ, పోలీసులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజన్‌కుమార్‌ పరిధి అతిక్రమించి మరీ రఘునందన్‌రావు బావమరిది వద్ద దొరికిందని చెబుతున్న కోటి రూపాయలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అంతేకాకుండా రఘునందన్‌రావు బావమరిదిని కూడా నిందితుడిగా చిత్రీకరించి తమ వెనక నిలబెట్టారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం. అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వారిని సైతం నేరం రుజువు కానంతవరకు పోలీసులు వారిని విలేకరుల ఎదుట పరేడ్‌ చేయించకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా, లేకపోయినా ప్రైవేట్‌ వ్యక్తుల ఇళ్లలో నగదు కోసం సోదాలు చేసే అధికారం పోలీసులకు ఉందా? అన్నది మరో ప్రశ్న. దొరికిన నగదు దుబ్బాకలో లభించినది కూడా కాదు. అయినా ఎన్నికల కోడ్‌ అమలులో లేని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. అక్రమ నగదు నిల్వలు ఉన్న సందర్భాలలో ఆదాయపు పన్ను అధికారులు మాత్రమే తనిఖీ చేస్తారు. రఘునందన్‌రావు బావమరిది ఇంట్లో దొరికిన నగదును ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించకుండా, డబ్బును ఆకర్షణీయంగా పేర్చి విలేకరులకు చూపించడం ఏమిటి? సమర్థనీయం కాని ఇలాంటి చర్యలను రేపు ఎవరైనా న్యాయస్థానాలలో ప్రశ్నిస్తే పోలీస్‌ అధికారుల పరిస్థితి ఏమిటి? ఈ సంఘటనలన్నీ దుబ్బాకలో అధికార పార్టీకి ఎంతో కొంత నష్టం చేసి ఉండవచ్చు. దానికితోడు పోలింగ్‌కు రెండు రోజుల ముందు మంత్రి కేటీఆర్‌ బీజేపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రకు బీజేపీ నాయకులు పాల్పడబోతున్నారన్నది సదరు ఆరోపణల సారాంశం. బీజేపీ నాయకులను కట్టడి చేయాలని తమ పార్టీ డీజీపీని కోరుతుందని కూడా మంత్రి కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్‌ అమలులో లేని హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవ్వాళ తెలంగాణలో ప్రభుత్వం అంటే కేసీఆర్‌ లేదా కేటీఆర్‌. అయినా కేటీఆర్‌ ఈ తరహా విజ్ఞప్తిని డీజీపీకి చేయడం ఏమిటి? ఆదేశాలే ఇవ్వవచ్చుగా. అయినా పోలింగ్‌కు 24 గంటలే ఉన్న తరుణంలో దుందుడుకు చర్యలకు పాల్పడి బైండోవర్‌ చేయించుకునేంతటి అమాయకులా.. బీజేపీ నాయకులు! కేటీఆర్‌ ఆరోపించినట్లుగా హైదరాబాద్‌లో ఏం జరగలేదు. మొత్తంమీద టీఆర్‌ఎస్‌ కారణంగా పోలింగ్‌ సమీపించే నాటికి బీజేపీ బలపడిందనే అభిప్రాయం ఏర్పడింది. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అనుకూల, వ్యతిరేక శిబిరాలుగా ఓటర్లు సంఘటితమయ్యారని, ఈ కారణంగా కాంగ్రెస్‌ తృతీయ స్థానానికే పరిమితం అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి. కారణాలు ఏమైనప్పటికీ, అధికార పార్టీ పట్ల యువతలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని చెబుతున్నారు. ఈ అంచనాలు, అభిప్రాయాలు నిజమా? కాదా? అన్నది ఓట్ల లెక్కింపు తర్వాత స్పష్టమవుతుంది.


తేల్చేది దుబ్బాకే!

దుబ్బాక ఫలితం ఎలా ఉండబోతున్నప్పటికీ ఒకటి మాత్రం నిజం. తొలి టర్మ్‌లో ఉన్నట్లుగా కేసీఆర్‌ పాలన ఇప్పుడు లేదు. గతంలోలా ఇప్పుడు ప్రభుత్వంలో క్రమశిక్షణ కనిపించడం లేదు. అధికారుల దారిన అధికారులు పని చేసుకుంటూ పోతున్నారు. శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తొలి టర్మ్‌లో అక్రమాలకు పాల్పడాలంటే శాసనసభ్యులు, పార్టీ నాయకులు వణికిపోయేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూముల జోలికి రావడానికి అప్పుడు అధికార పార్టీకి చెందిన వారు సాహసించేవారు కాదు. ఇప్పుడు ఖాళీగా ఉన్న భూములపై రాబందుల్లా వాలిపోతున్నారు. తాము సూచించిన రేటుకే భూములను తమకు విక్రయించాలని ప్రైవేట్‌ వ్యక్తులను బెదిరిస్తున్నారు. ఒక శాసనసభ్యుడితో పాటు మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ ఒకరు ఈ విధంగానే ఒకరిని బెదిరించి చెరో వందకోట్లు జేబులో వేసుకున్నారని బాధితులు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలాంటి దందాలను ఇప్పుడే చూస్తున్నాం. భూ వివాదాల్లో తలదూర్చిన వారు ఎంతటివారైనా కేసీఆర్‌ సహించరన్న అభిప్రాయం ఇప్పటివరకు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మంత్రి కేటీఆర్‌ చుట్టూ ఉంటున్న వారు కూడా వివాదాస్పద భూములను కొల్లగొడుతున్నారు. మంత్రులందరూ డమ్మీలుగా మారిపోవడంతో జిల్లాస్థాయిలో పరిపాలన కుంటుపడుతోంది. ఎంపిక చేసుకున్న అంశాలను మినహాయిస్తే పలు ప్రభుత్వ శాఖలలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితులలో కేసీఆర్‌ ఉన్నారని చెబుతున్నారు. పొగడ్తలకు అలవాటు పడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజాలు చెప్పడానికి అధికారులు కూడా సాహసించడం లేదు. పాలనాయంత్రాంగం గతంలో ఉరుకులు, పరుగులు పెట్టేది. ఇప్పుడు స్తబ్దుగా ఉంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో తెలుసుకునే సత్తా ఉన్న కేసీఆర్‌కు ఇవన్నీ తెలియవనుకోలేం. హైదరాబాద్‌లో సంభవించిన వరదలనే తీసుకుందాం. కాలనీలకు కాలనీలు రోజుల తరబడి ముంపులో చిక్కుకున్నప్పటికీ కేటీఆర్‌ మినహా మరే మంత్రి కనిపించలేదు. బాధితులకు ఉపశమనం కల్పించడానికి 10 మంది మంత్రులను పురమాయించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని చెబుతున్నారు.


మొత్తం కేటీఆర్‌ చేతుల మీదుగానే జరగాలని కేసీఆర్‌ కోరుకుని ఉండవచ్చు. ప్రభుత్వం అంటే బాప్‌ ఔర్‌ బేటా మాత్రమే కాదు. అయినా తెలంగాణలో ఇప్పుడు అదే అభిప్రాయం ఉంది. ఈ కారణంగానే హైదరాబాద్‌లో ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని బీజేపీ నాయకులు ఎప్పటి నుంచో వ్యూహరచన చేసుకుంటున్నారు. బస్తీలలో కూడా బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దుబ్బాకలో ఫలితం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. రాజకీయ వర్గాలు భావిస్తున్నట్లుగా దుబ్బాకలో బీజేపీ ద్వితీయ స్థానానికి చేరుకున్నప్పటికీ అది కేసీఆర్‌కు ప్రమాద సంకేతమే అవుతుంది. భారీ మెజార్టీతో కాకుండా స్వల్ప మెజార్టీతో గెలిచినా టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. దుబ్బాక ఫలితాన్ని బట్టి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీ తన సత్తా చాటితే కాంగ్రెస్‌ నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి కూడా బీజేపీలోకి వలసలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరాదరణకు గురవుతున్న పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌ – బీజేపీ ఒకేస్థాయిలో ఉంటే తెలంగాణలో తనకు రాజకీయంగా ఎదురుండదని ఇంతకాలంగా కేసీఆర్‌ భావిస్తూ వస్తున్నారు. ఇపుడు తెలంగాణలో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం బలహీనపడినా కేసీఆర్‌కు బీజేపీ నుంచి ముప్పు తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు సంబంధించినంత వరకు కేసీఆర్‌ మాత్రమే కర్త, కర్మ, క్రియ. బీజేపీ రూపంలో ఎదురుకాబోతున్న ముప్పును ముందుగానే గ్రహిస్తే తెలంగాణలో తన పట్టు సడలకుండా విరుగుడు చర్యలు తీసుకోవడం కేసీఆర్‌కు కష్టమైందేమీ కాదు.


మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో మితిమీరిన స్నేహం కూడా తెలంగాణలో హిందువులను సంఘటితం చేయబోతున్నదని చెబుతున్నారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే దుబ్బాక ఎన్నికల ఫలితం వరకు వేచి చూడాల్సిందే!

                                                                                                                    ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.