10 వేలకు చేరువగా.. రాష్ట్రంలో కొత్త కేసులు.. 38 మరణాలు

ABN , First Publish Date - 2021-04-22T09:51:40+05:30 IST

రాష్ట్రంలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,619 శాంపిల్స్‌ను పరీక్షించగా 9,716 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 38 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.

10 వేలకు చేరువగా.. రాష్ట్రంలో కొత్త కేసులు.. 38 మరణాలు

  • 60 వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..
  • సబ్బం హరి, శ్రీశైలం పీఠాధిపతికి కరోనా
  • ప్రతి 4 శాంపిల్స్‌లో ఒకరికి కరోనా
  • ఒక్కసారిగా పెరిగిన పాజిటివిటీ రేటు..
  • గతేడాది కంటే వేగంగా వైరస్‌ వ్యాప్తి
  • 70 వేల టెస్టులు చేసినా కేసులు తక్కువ..
  • ఈసారి 35 వేల టెస్టులకే 24ు పాజిటివ్‌
  • నేడు రెండో డోసు వారికే వ్యాక్సిన్‌
  • కొత్త కేసులు 9,716 
  • 24 గంటల్లో 38 మరణాలు
  • కృష్ణా జిల్లాలోనే 10 మంది మృతి
  • శ్రీకాకుళంలో 1,444 మందికి వైరస్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,619 శాంపిల్స్‌ను పరీక్షించగా 9,716 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 38 మంది చనిపోయారని వైద్యఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 9,86,703కి, కరోనా మరణాల సంఖ్య 7,510కి పెరిగింది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 1,444 మంది వైరస్‌ బారిన పడగా.. గుంటూరులో 1,236, చిత్తూరులో 1,180, కర్నూలులో 958, నెల్లూరులో 934, అనంతపురంలో 849, తూర్పుగోదావరిలో 830, విశాఖపట్నంలో 810,  విజయనగరంలో 565, కృష్ణాలో 294, ప్రకాశంలో 294, కడపలో 216, పశ్చిమగోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,359 మంది డిశ్చార్జ్‌ కావడంతో రికవరీల సంఖ్య 9,18,985కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 60,208కి చేరుకున్నాయి. 24 గంటల్లో నమోదైన 38 మరణాల్లో కృష్ణా జిల్లాలో పది ఉండగా.. నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళంలో నలుగురేసి, చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురేసి, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలో ఇద్దరేసి, అనంతపురంలో ఒకరు చొప్పున మృతి చెందారు. 


కొంపముంచిన కుంభమేళా..20 మందికి కరోనా

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 6 వార్డుకు చెందిన కొందరు మూడు వారాల క్రితం తీర్థయాత్రలకు వెళ్లి హరిద్వార్‌ కుంభమేళాలో స్నానాలు చేసి వచ్చారు. తర్వాత వీరిలో ఒకరికి జ్వరం వచ్చింది. పరీక్ష చేయిస్తే కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటికే ఆ నివాసంలోని మరో ఇద్దరిలో లక్షణాలు బయటపడ్డాయి. వీరితోపాటు తీర్థయాత్రలకు వెళ్లిన వారికి, వచ్చిన తరువాత వీరిని కలిసిన వారికి కూడా వైరస్‌ సోకింది. ఇలా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటి వరకు 20 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. 


ఆస్పత్రిలో చేరిన సబ్బంహరి

మాజీ ఎంపీ సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే బుధవారం వెల్లడించారు. ఈ నెల 15న పాజిటివ్‌ నివేదిక రాగా వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోంక్వారంటైన్‌లో ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో చేరానని చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఫోన్‌లో సంప్రదించవద్దని కోరారు.


శ్రీశైలం పీఠాధిపతికి పాజిటివ్‌

శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామికి మంగళవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన కర్ణాటకలోని బెల్గమ్‌ జిల్లా చికోడిలోని ఎడూయూర్‌ శ్రీక్షేత్రంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు జగద్గురు పీఠం ప్రతినిధి నటరాజ్‌ తెలిపారు. స్వామి ఆరోగ్యం నిలకడగా ఉందని, భక్తులు ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ముందుజాగ్రత్తగా స్వామి వక్తిగత సిబ్బంది కూడా హోంఐసోలేషన్‌లోకి వెళ్లారు. 


విమ్స్‌లో ఒక్కరోజే 11 మంది మృతి 

విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో కొవిడ్‌తో చికిత్స పొందుతూ 11 మంది మృతిచెందారు. అధికారులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు. కొద్దిరోజులుగా జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతుండడంతో నాలుగు రోజుల కిందటే విమ్స్‌లో సేవలను ప్రారంభించారు. ఇక్కడ సేవలు ప్రారంభమైన మొదటి రోజు ముగ్గురు మృతిచెందగా, రెండో రోజు ఐదుగురు, మూడో రోజు మరో ఇద్దరు మృతి చెందారు. మూడు రోజుల్లో పది మంది మృతిచెందగా, బుధవారం ఒక్కరోజే ఏకంగా 11 మంది మరణించారు. విమ్స్‌లో సేవలు ప్రారంభమైన నాలుగు రోజుల్లో 21 మంది మృతిచెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.  


మరో 2లక్షల కొవీషీల్డ్‌ 

రాష్ర్టానికి మరో 2 లక్షల కొవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో బుధవారం ఉదయం వచ్చిన వ్యాక్సిన్‌ను తొలుత గన్నవరం వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ సెంటర్‌కు, అనంతరం అక్కడి నుంచి 13 జిల్లాలకు తరలించారు.


నేడు రెండో డోసు వారికే వ్యాక్సిన్‌

రాష్ట్రంలో గురువారం ప్రత్యేకంగా కరోనా వ్యాక్సిన్‌ రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కే భాస్కర్‌ తెలిపారు. కాబట్టి గురువారం తొలిడోసు టీకా ఎవరికీ ఇవ్వరనే విషయాన్ని గమనించాలని కోరారు.

Updated Date - 2021-04-22T09:51:40+05:30 IST