ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు

ABN , First Publish Date - 2020-10-19T10:17:04+05:30 IST

ఇంజనీరింగ్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు కళాశాలలకు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. ఒక ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ కళాశాలల్లో కలిపి కొత్త కోర్సుల్లో 480 మంది విద్యార్థులకు ప్రవేశం లభించనున్నది

ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు

ఒక ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ కళాశాలలకు అవకాశం

కొత్త కోర్సుల్లో 480 సీట్లు

ఏఐ, ఏఐ అండ్‌ ఎంఎల్‌, ఎంవోటీ, ఐటీ కోర్సులకు అనుమతి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఇంజనీరింగ్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు కళాశాలలకు కొత్త కోర్సులు మంజూరయ్యాయి. ఒక ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ కళాశాలల్లో కలిపి కొత్త కోర్సుల్లో 480 మంది విద్యార్థులకు ప్రవేశం లభించనున్నది. ఇక నుంచి జిల్లాలో కృత్రిమ మేధ(ఏఐ), కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌), ఇటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) కోర్సుల్లో విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వెబ్‌ ఆప్షన్లు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. మంథనిలోని జేఎన్‌టీయూ కళాశాలలో కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌ కోర్సును మంజూరు చేస్తూ 60 సీట్లను కేటాయించారు. అలాగే జ్యోతిష్మతి విద్యాసంస్థలకు చెందిన రెండు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఒకదానికి 60 సీట్లతో కృత్రిమ మేధ(ఏఐ), మరో కళాశాలలో కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌) కోర్సును 60 సీట్లతో మంజూరు చేశారు. పెద్దపల్లిలోని మదర్‌ థెరిసా ఇంజనీరింగ్‌ కళాశాలలో కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌లో 60 సీట్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 60 సీట్లతో రెండు కోర్సు లకు అనుమతి లభించింది.


నిగమ ఇంజనీరింగ్‌ కళాశాలకు కృత్రిమ మేధ-మిషన్‌ లర్నింగ్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కోర్సులు లభించాయి. ఒక్కో విభాగంలో 60 సీట్ల చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. అలాగే వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కళాశాలలో 60 సీట్లతో కృత్రి మేధ-మిషన్‌ లర్నింగ్‌ కోర్సు మంజూరైంది. ప్రైవేట్‌ కళాశాలల్లో కొందరు డిమాండ్‌ లేని పాత కోర్సులకు చెందిన సీట్లను సరెండర్‌ చేసి కొత్త కోర్సుల మంజూరు పొందగా, మరికొందరు కొత్త కోర్సులు అదనంగా పొందారు. ఆదివారం ఉదయమే వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా రాత్రి నుంచి ప్రారంభమైంది.  ఉమ్మడి జిల్లా పరిధిలో నాచుపల్లి జేఎన్‌టీటీయూ, మంథని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలు ప్రభుత్వానికి చెందినవి కాగా 11 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నా యి. వీటిలో కరీంనగర్‌ జిల్లాలో 8, పెద్దపల్లి జిల్లాలో మూడు ఇంజనీరింగ్‌ కళాశాలలు పనిచేస్తున్నాయి.


ప్రభుత్వ కళాశాలల్లో 570 సీట్లు, 11 ప్రైవేట్‌ కళాశాలల్లో 4440 సీట్లు ఉన్నాయి. మొత్తం ఈ 5010 సీట్లలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 540 సీట్లు, సీఎస్‌ఇలో 1110 సీట్లు, ఇసీఇలో 1260 సీట్లు,  ఇఇఇలో 940 సీట్లు మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 580 సీట్లు ఉన్నాయి. వీటిలో 368 సివిల్‌ సీట్లను, 777 సీఎస్‌ఇ, 862 ఇసీఇ , 662 ఇఇఇ, 336 మెకానికల్‌ ఇంజనీరింగ్‌ సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు. 1335 సీట్లకు మేనేజ్‌మెంట్‌ కోటా కింద ప్రవేశాలు కల్పిస్తారు. 

Updated Date - 2020-10-19T10:17:04+05:30 IST